కూటమి ఖేల్‌ ఖతం

0

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెజస, సిపిఐపార్టీలు కలిసి ఏర్పాటుచేసిన ప్రజాకూటమికి ‘పురిట్లోనే సంధి కొట్టింది’. ‘పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయినట్లు’ కూటమిలోని భాగస్వామ్యపక్షాలన్నీ గులాబీదళంలో చేరేందుకు సకలసన్నద్ధమవుతున్నాయి. తెలంగాణాలో ఘనంగా ప్రారంభించిన ఈ కాంబినేషన్‌ యోగిస్తే ఆంధ్రాలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ప్రయోగించి ప్రభుత్వాలు ఏర్పాటుచేయాలని కూట మి నేతలు ఎంతగానో భావించారు. ఎన్నో బంగారు కలలు కన్నారు. కూటమి ఏర్పాటులో అలవిమాలిన జాప్యం జరిగినా లేటుగానైనా లేటెస్టుగా వస్తున్నా మని సంబరపడ్డారు. వీరు చేసిన విశ్వామిత్ర సృష్టి అడుగుపెడుతూనే పిడుగుపడ్డట్టు మొదట్లోనే వికటించడంతో తదుపరి ప్రయోగాలను చుట్టచుట్టి అటకెక్కించాలని మానసికంగా శారీరకంగా సిద్ధపడిపోతు న్నారు. కాంగ్రెస్‌ ఉచ్చులోపడి చివరకు మూడుసీట్లతో బరిలోకి దిగిన సిపిఐ గొల్లుమంటోంది. తమకు కాంగ్రెస్‌ సహకరించలేదని బహిరంగంగా వాపోతుంది. దరావత్తు కోల్పోయిన కోదండరాం పార్టీ మాత్రం ఏ దిక్కూలేని ‘అనాథ’లా బిక్కచూపులు చూస్తోంది.

కాంగ్రెస్‌ మాకు సహకరించలేదు: చాడ

ప్రజాకూటమి సమన్వయ లోపం వల్లే ఫలితాలు నిరాశజనకంగా వచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ సెంటిమెంట్‌ ముందు ప్రజాకూటమినిలవలేకపోయిందని ఆయన వాపోయారు. అసెంబ్లీలో 1999 తరవాత మళ్లీ 2018లో వామపక్షాల ప్రాతినిథ్యం లేకుండా పోయిందని, ఇది ఒక గుణపాఠమని చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. సీపీఐకి కేటాయించిన మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ ఆశించిన స్థాయిలో సహకరించలేదని, ఒంటరిగా పోటీ చేసినట్లే ఉందని చాడ వ్యాఖ్యానించారు.

బోణీ కొట్టని తెజస:

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రొఫెసర్‌ కోదండరాం పార్టీ సారథ్యంలోని తెలంగాణ జన సమితి కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక్క చోట కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ఆ తర్వాత కేసీఆర్‌తో విబేధాల కారణంగా తెరాస నుంచి విడిపోయిన విషయం తెలిసిందే.

తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని ప్రారంభించిన కోదండరాం.. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. అయితే ప్రజాకూటమి పొత్తుల్లో సీట్ల సర్దుబాటుపై కోదండరాం గతంలో చాలా సార్లు బహిరంగంగానే అసంత ప్తి వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాలను ప్రజాకూటమి తెజసకు కేటాయించినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో సీట్ల సర్దుబాటుపై కోదండరాం పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల జోక్యంతో ఆయన వెనక్కితగ్గారు.

తొలుత తెజస అభ్యర్థులు 13 చోట్ల బరిలోకి దిగారు. అయితే ఆ తర్వాత 5 చోట్ల అభ్యర్థులు ఉపసంహరించు కోగా.. ఎనిమిది స్థానాల్లో తెజస పోటీ చేసింది. వీటిలో నాలుగు స్థానాలు దుబ్బాక, వరంగల్‌ తూర్పు, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అయితే తాజా ఫలితాల్లో ఏ ఒక్క స్థానంలోనూ తెజస గెలుపొందకపోవడం గమనార్హం.

‘రామా’ జంప్‌ లు షూరూ:

రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన చందర్‌ సీటు దక్కకపోవడంతో ఫార్వర్డు బ్లాక్‌ నుంచి పోటీచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమవరపు సత్యనారాయణపై విజయం సాధించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం కేసీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ తనకు మాత సంస్థ అని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చందర్‌ తెలిపారు. కాగా ఎన్నికల వరకు కూడా ఆయన టీఆర్‌ఎస్‌లోనే కొనసాగిన విషయం తెలిసిందే.

ఈ మేరకు బుధవారం కేసీఆర్‌ను ఆయన కలిసి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం 88 స్థానాల నుంచి 89కి చేరింది. గత ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ రెబల్‌గా పోటీచేసిన చందర్‌ సత్యనారాయణపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం, వైరా స్థానాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here