Featuredరాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి దక్కేనా?!

(పల్లా కొండలరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఖమ్మం జిల్లాలో టి.ఆర్‌.ఎస్‌ కు, ప్రజలకూ పెద్దదిక్కుగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పాలేరు నియోజకవర్గంలో ఓడిపోవడం, ఓడిపోతుందని భావించిన ఖమ్మం నియోజకవర్గంలో టి.ఆర్‌.ఎస్‌ అభ్యర్ధి పువ్వాడ అజెయ్‌ కుమార్‌ గెలుపొందడంతో ఈసారి జిల్లాలో అమాత్య పదవి ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది. అసలు ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి ఇస్తారా? లేదా? వెంటనే ఇస్తారా? వాయిదా వేస్తారా? అనే అంశాలు చర్చనీయాం శంగా మారాయి. గెలుపు ఓటములే గాక జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, శక్తివంతమైన ప్రత్యర్ధులను ఎదుర్కో వడం, అందరినీ కలుపుకుపోగల, సమన్వయం చేసుకోగల సామర్ద్యం అవసరం ఉండడంతో ఖమ్మం జిల్లాలో ఎవరిని మంత్రిని చేయాలన్నది టిఆర్‌ఎస్‌ అధిష్ఠానికి సవాల్‌గా మారింది. గెలిచిన ఒకే ఒక్కడు పువ్వాడకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో సందేహాలున్నాయి. ఖమ్మం జిల్లాలో 8 స్థానాలలో ప్రజాకూటమి, వైరా ఒక్కచోట ఇండిపెండెంటుగా పోటీ చేసిన కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్ధి గెలుపొందారు. తెలుగుదేశం తరపున బలమైన ప్రత్యర్ధి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించిన పువ్వాడ అజెయ్‌ కుమార్‌ ఖమ్మం నుండి వరుసగా రెండోసారి ఎన్నికై అజేయుడిగా నిలిచారు. నిజానికి ఖమ్మంలో తెలుగుదేశం అభ్యర్ధి నామా నాగేశ్వరరావుని కూటమి అభ్యర్ధిగా ప్రకటించి ననాటి నుండి నామాకు పాజిటివ్‌ టాక్‌ వినిపించింది. టి.ఆర్‌.ఎస్‌ ఎంఎల్‌ఏ అజెయ్‌కుమార్‌పై ఖమ్మం నగరం లో పలు వర్గాలవారిలో వ్యతిరేకత ఉండడం, పార్టీలో ఆధిపత్యపోరు వంటి కారణాల రీత్యా గెలుపు ‘నామా’దే అన్నట్లుగా ఏకపక్ష ప్రచారం సాగింది. అజెయ్‌ ఓటమి కోసం కొన్ని వర్గాలు ప్రత్యేకంగా పనిచేశాయి. వీటిని ముందే గమనించిన అజెయ్‌ తనదైన వ్యూహంతో అనూహ్యమైన, అఖండ విజయం సాధించారు. నిత్యం ప్రజలలో ఉండడం, ముఖ్యమంత్రి తనయుడు కె.టి.ఆర్‌ కు సన్నిహితుడు కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఖమ్మం నగరంలో చేసిన అభివద్ది పనులు అజెయ్‌కు కలిసి వచ్చాయి. కూటమిలో ఏ పార్టీ, ఏ అభ్యర్ధి పోటీ చేస్తారో తేల్చుకునేలోపు అజెయ్‌ ఖమ్మం నియోజకవర్గాన్ని రెండు రౌండ్లు చుట్టేశారు. కాలికి బలపం కట్టుకొని ఇంటింటికీ తిరిగి ప్రచారం పూర్తి చేశారు. ప్రత్యర్ధులు అసత్య ప్రచారాలు చేస్తూ, అధర్మ యుద్ధం సాగిస్తున్నారంటూ చివరలో అజెయ్‌ సతీమణి వీడియో ప్రచారం, సిపీఐ సీనియర్‌ నేత, రాజకీయ దురంధరుడు తండ్రి పువ్వాడ నాగేశ్వర్రావు మిత్రుల సహకారం, తగినంత ఆర్ధిక బలం, అభివద్ది సంక్షేమ కార్యక్రమాల విషయంలో, సమస్యల విషయంలో నిత్యం నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటారనే కారణంగా అజెయ్‌ బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కుని, వ్యతిరేక అంశాలను ఢీీకొని గెలిచారు. ఖమ్మంలో సి.ఎం సభ, మంత్రి తుమ్మల, ఎం.పి పొంగులేటిల సహకారం, ప్రభుత్వ అనుకూల వాతావరణం కారణంగా తాను గెలిచానని కతజ్ఞతా సభలో అజెయ్‌ ప్రకటించినా అవి మర్యాద కోసం చెప్పిన మాటలు మాత్రమే. టి.ఆర్‌.ఎస్‌ లోనూ ఆయనకి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేశాయి. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా అప్పటి టిడిపి అగ్రనేత తుమ్మల నాగేశ్వర్రావుపైనా, 2018 లో ఇప్పటి టిడిపి అగ్రనేత, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వరరావుపై ఘనవిజయం సాధించడం విశేషం. ఖమ్మం నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు గెలిచి తన తండ్రి వారసుడిగా నిలిచారు. అజెయ్‌ తండ్రి సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కూడా ఖమ్మం ఎం.ఎల్‌.ఎ గా రెండుసార్లు పనిచేశారు. పువ్వాడ నాగేశ్వరరావు అండతో ఆయన ఇమేజ్‌ నీడన అజెయ్‌ రాజకీయరంగ ప్రవేశం చేసినా తనదైన వ్యూహాలతో పనిచేసుకుంటూ ఎదుగుతుండడం గమనార్హం. రాజకీయంగా పలు విషయాలలో గెలుపు కోసం తనదైన వ్యూహాలతో, పట్టుదలతో శ్రమించే గుణం అజెయ్‌లో ఉంది. కాంగ్రెస్‌లో చేరేకంటే ముందు వై.కా.పా ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు.కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం ఎంఎల్‌ఏగా గెలిచారు. కాంగ్రెస్‌లోనూ తనదైనశైలిలో, స్వతంత్రంగానే పనిచేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తనయుడు కెటిఆర్‌ క్లాస్‌ మేట్‌ కావడంతో తదనంతరం పరిణామాలతో టిఆర్‌ఎస్‌లో చేరాల్సి వచ్చింది. అజెయ్‌ చేతిలో టిడిపి అభ్యర్ధిగా ఓడిన తుమ్మల అంతక్రితమే టి.ఆర్‌.ఎస్‌లో చేరి మంత్రి కావడం, కెసిఆర్‌ అండతో జిల్లాలో పార్టీ పగాలు తుమ్మల చేతిలోనే ఉండటంతో ఆదిలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కెటిఆర్‌ తో సాన్నిహిత్యంతో ఖమ్మం నియోజకవర్గం వరకూ తుమ్మల వేలు పెట్టకుండా చూసుకున్నారు. ఖమ్మం కార్పోరేషన్‌ వ్యవహారంలో మాత్రం మంత్రి వ్యవహారంతో అజెయ్‌తోపాటు, నగర ప్రజలూ ఇబ్బందిపడ్డారు. తుమ్మల పాలేరుని వదిలి ఖమ్మం రావడానికి ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు సాగినా కె.టి.ఆర్‌ అండదండలుండడంతో అజెయ్‌ అభివద్ది కార్యక్రమాలలో దూసుకుపోగలిగారు. ప్రతికూల అంశాలను తట్టుకొని ఖమ్మం జిల్లాలో టి.ఆర్‌.ఎస్‌ తరపున గెలిచిన ఏకైక ఎం.ఎల్‌.ఏ గా, అజేయుడిగా నిలిచిన పువ్వాడ అజెయ్‌ కుమార్‌ కి రాష్ట్ర మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు దక్కాల్సి ఉన్నా, ఆ విషయంలో ఆయనతో సహా అందరికీ పలు అనుమానాలున్నాయి. ఓడినా మళ్ళీ తుమ్మలనే మంత్రిని చేస్తారనీ, లేదా తుమ్మలను ఎంపి గా పంపి ప్రస్తుతం ఎంపిగా ఉన్న పొంగులేటి ని ఎంఎల్‌సీని చేసి ఆయనకు జిల్లా పార్టీ పగ్గాలతోపాటు మంత్రిని కూడా చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ జాబితాలో ఎం.ఎల్‌.సీ పల్లా రాజేశ్వరరెడ్డి పేరు కూడా చేరింది. అజెయ్‌ కుమార్‌ టి.ఆర్‌.ఎస్‌ తరపున గెలిచిన ఏకైక ఎం.ఎల్‌.ఏ గా అజేయుడిగా నిలిచినా అజాత శత్రువు కాకపోవడమే ఇందుకు కారణమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండడం,మంచివాడన్న పేరున్నా వ్యక్తిగతంగా అసహన ధోరణి, ప్రత్యర్ధులు సంధించే చిన్న చిన్న ఆటంకాలకు సైతం అవసరానికి మించి ఆందోళన చెందటం, స్థాయికి తగ్గట్టుగా స్పందించలేకపోవడం అందరినీ కలుపుకుని పొలేకపొవడం, జిల్లా స్థాయిలో హుందాగా, సంయమనంతో వ్యవహరించగల నేర్పరితనం, అనుభవం లేకపోవడంతో అప్పుడే అజెయ్‌ ని మంత్రిని చేయకపోవచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుతానికి డిప్యుటీ స్పీకర్‌ లేదా ప్రభుత్వ విప్‌ ని చేయొచ్చంటున్నారు. జిల్లాకు రెండు మంత్రి పదవులను ఇచ్చి అందులో ఒకటి అజెయ్‌కు ఇవ్వవచ్చనే అంచనాలూ వినబడుతున్నాయి. మంత్రి పదవి విషయంలో కెసిఆర్‌ నిర్ణయంకు కట్టుబడి ఉంటానని అజెయ్‌ ప్రకటించారు. కె.టి.ఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో తన ప్రయత్నాలు చేసే అవకాశముంది. జిల్లాలో పార్టీ బలహీనంగా ఉండడం, ఎన్నికల సందర్భంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడం, పార్టీలో గ్రూపు తగాదాల నేపథ్యంలో పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బలమైన ప్రత్యర్ధులను ఎదుర్కోవలసి ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్‌ తరపున ఎన్నికైన ఎం.ఎల్‌.ఏలను టి.ఆర్‌.ఎస్‌లోకి రప్పించే పనిలో మాజీ మంత్రి తుమ్మల, ఎం.పీ పొంగులేటిలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఆ దిశగా సత్తుపల్లి ఎం.ఎల్‌.ఏ సండ్ర వెంకటవీరయ్య టిడిపిని వీడేందుకు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు తెలుగుదేశం తరపున గెలిచిన అశ్వారావుపేట ఎం.ఎల్‌.ఏ మెచ్చా నాగేశ్వరరావును కూడా అధికారపార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది జరిగితే మంత్రి వర్గంలో చోటుకోసం పోటీపడే జాబితాలో సండ్ర వెంకటవీరయ్య పేరూ ఉంటుంది. మరోవైపు దళిత కోటాలో తనకి మంత్రి పదవి ఇస్తే తనతోపాటు కాంగ్రెస్‌ ఎం.ఎల్‌.ఏలను టిఆర్‌ఎస్‌లోకి చేరుస్తానని మధిర ఎంఎల్‌ఏ భట్టి విక్రమార్క కూడా రాయ’బేరం’ నడుపుతున్నట్లు వినికిడి. వీటిలో ఏది నిజం, ఏది ప్రత్యర్ధుల వ్యూహ ప్రచారం అన్నది అర్ధంకాని అయోమయ స్థితి నెలకొన్నది.

తన నియోజకవర్గం వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో దూకుడుగా ఉండగలిగే అజెయ్‌ జిల్లా మొత్తాన్ని సమన్వ యం చేయగలడా? ప్రతి పక్షాలను, స్వపక్షంలోని ప్రత్యర్ధులను సమర్ధవం తంగా ఎదుర్కోగలడా? సీతారామ ప్రాజెక్టు వంటి భారీ పనులను అధికా రు లతో సమన్వయం చేసుకుని ముందుకు నడిపించగలడా? ఇలాంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్నందున అజెయ్‌కు మంత్రి పదవి విషయ ంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారనేది జిల్లాలో ఆసక్తికరంగా మారింది. అజెయ్‌ని కాదని మంత్రిని చేయాలంటే ఎవరిని చేయాలి? ఎలా చేయాలి? అన్నది అధిష్ఠానం ఆలోచనలో ఉన్న కీలక అంశం. ఏది చేస్తే జిల్లాలో పార్టీకి లాభం జరుగుతుందనే విషయంలోనే ఎక్కువగా ఆలోచన జరుగుతోందని, దీనికోసం ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మరికొంత సమయం సడుతుందన్న వాదన వినిపిస్తోంది. కె.టి.ఆర్‌తో ఖమ్మం ఎంఎల్‌ఏ సాన్నిహిత్యం పనిచేస్తే జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కినా ఆశ్చర్యం లేదు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close