పని చేయండి పదవులు అడగండి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెరుగైన ప్రతిభ చూపిన ప్రజాప్రతినిధులకే కేబినెట్‌తో పాటు పార్లమెంటరీ సెక్రటరీ లాంటి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. కేసీఆర్‌ తన కేబినెట్‌ను ఇంక విస్తరించలేదు. గత ఏడాది డిసెంబర్‌ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాలను కైవసం చేసుకొంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి.ఈ 17 స్థానాల్లో తమ మిత్రపక్షమైన ఎంఐఎం హైద్రాబాద్‌ నుండి విజయం సాధిస్తోందని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ విశ్వాసంతో ఉన్నారు. మిగిలిన 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మహబూబాబాద్‌, ఖమ్మం, హైద్రాబాద్‌ ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో పీపుల్స్‌ ఫ్రంట్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

విజయం సాధించారు. దీంతో ఈ మూడు ఎంపీ స్థానాలతో పాటు మిగిలిన స్థానాలను కూడ కైవసం చేసుకొనేందుకు పార్టీ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్‌ భారీ లక్ష్యాన్ని ముందుంచాడు. ఎంపీ ఎన్నికల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో కానీ, పార్లమెంటరీ సెక్రటరీలుగా అవకాశం ఇస్తామని ప్రకటించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. హైద్రాబాద్‌ ఎంపీ పరిధిలో ఎంఐఎం విజయం సాధించాలని కూడ టీఆర్‌ఎస్‌ కోరుకొంటుంది. ఈ రెండు పార్టీలు మిత్రులుగా కొనసాగుతున్నాయి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నేతలతో కూడ కేసీఆర్‌ చర్చించారు. కేసీఆర్‌తో తాము జతకడుతామని ఎంఐఎం చీఫ్‌ అసద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెడరల్‌ ఫ్రంట్‌ దేశంలో కీలకపాత్ర పోషించాలంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించేందుకు వీలుగా కేసీఆర్‌ రాష్ట్రంలోని ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకొనేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీ టార్గెట్‌ ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు విజయం సాధించేలా కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు కేబినెట్‌తో పాటు ఇతరత్రా మంచి పదవులను కట్టబెట్టనున్నట్టు హావిూ ఇచ్చారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే పార్టీ నేతలపై కఠిన చర్యలు తీసుకొంటామని కూడ కేసీఆర్‌ హెచ్చరించినట్టు చెబుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలపైనే కేసీఆర్‌ ప్రస్తుతం కేంద్రీకరించి పనిచేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here