నేటి తరానికే ఉపాధీ లేదు..

0

రాబోయే తరం.. భవిష్యత్తు భారతం.. ప్రతి ఒక్కరూ కలలుగంటున్న యువ భారతం.. వేదికలెక్కి, మైకులు పట్టుకొని, శృతి తప్పకుండా, గొంతు వణకుండా మాటల, తూటాలతో ప్రగల్భాలు పలికే నాయకగణానికి, స్వీపర్‌ ఉద్యోగం కోసం పిహెచ్‌డీ ఎంటెక్‌, బిటెక్‌ చదువులు చదివిన నేటి తరం మాత్రం వారికి కనబడదు. మండుటెండల్లో, క్యూలో నిలబడి చిన్న ఉపాధికోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న యువజనం ఎక్కడ చూసినా ప్రభంజనంలా కనబడుతోంది.. పాలకులు ఇది మా పనికాదనుకుంటున్నారో, లేదా మాకు సంబంధం లేదనుకుంటున్నారో తెలియదు కాని బంగారు కలల ఆశలతో పట్టాలు చేత పట్టుకొని రోడ్లమీదికి వచ్చిన వారి జీవితాలను పుట్‌పాత్‌లకే పరిమితం చేస్తున్నారు.. వేలు, లక్షల రూపాయలతో చదివిన చదువేంటీ, వారు చేస్తున్న ఉద్యోగం ఏంటో పెంచిన తల్లిదండ్రులకు, చేస్తున్న యవతకు అర్థం కావడం లేదు… సరియైన నైపుణ్యాలు లేని చదువులు, మాటలకే పరిమితమయ్యే యంత్రాంగం అన్ని వెరసి దేశ భవిష్యత్తు యువత చేతిలో కాదు, ఉపాధి కల్పించిన పట్టాల చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.

రాజేందర్‌ పల్నాటి ఆదాబ్‌ ప్రత్యేక ప్రతినిధి

పెద్ద పెద్ద చదువులు… పేరు పక్కన చాతడాంత పొడుగునా చదివిన చదువు పేర్లు.. అన్ని విషయాలకు తెలుసుకుంటారు.. అన్ని అంశాలపై పట్టు ఉండేలానే కనిపిస్తారు.. తీరా చూస్తే చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి అసలు సంబంధమే లేదు… ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీ, పిజీ, పిహెచ్‌డీ పట్టాలు చేత పట్టుకొని, స్నాతకోత్సవం రోజు గర్వంగా, తల పై కెత్తుకునేలా బయటికి వస్తున్నారు.. నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్‌ కోర్సు, ఆ తర్వాత పై చదువులకు ఆస్తులమ్మి, వయస్సును దాటి, బుక్‌ల వెంట పరుగెత్తి, పరుగెత్తి అలసిపోతుందీ నేటి యువత.. తీరా వెనక్కి తీరా చూస్తుంటే.. సాధించిందీ, సంపాదించిదీ మాత్రం శూన్యం… గొప్ప చదువులు చదివినామనే పేరు తప్ప చదివిన చదువుకు ఉద్యోగం సాధించామనే ఆనందం చాలా అరుదు.. అలాంటి వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు… ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది నేతలు వచ్చినా గొప్ప గొప్ప చదువులని చెప్పుకుంటున్న మన దేశ యువత భవిష్యత్తు మాత్రం ఎప్పటికి గాలిలో పతంగిలా ఏ దరికి చేరుతుందో తెలియడమే లేదు…

         దేశంలో నిరుద్యోగ స్థాయి రోజురోజుకు తారా స్థాయికి పెరిగిపోతుంది. అంచనాలకు మించి పెరుగుతున్న జనాభాకు తోడు యువత శాతం కూడా విపరీతంగా పెరుగుతోంది. చిన్న ప్రభుత్వం ఉద్యోగం నోటిఫికేషన్‌ వస్తే చాలు వేలల్లో, లక్షలో, కోట్లలో మరీ మరీ క్యూ కడుతూ దరఖాస్తులు చేస్తున్నారు. ప్రపంచంలో అతి వేగంగా పెరుగుతున్న యువ జనాభాలో మన దేశం కూడా స్థానం సంపాదించుకోపోతుంది. పేరుకు చెప్పుకోవడానికి మాత్రమే పనికోస్తున్నాం కాని ఉపాధిని కల్పించడంలో ప్రపంచంలోనే మనం వెనుకబడిపోతున్నాం. అఖిల భారత సాంకేతిక విద్యామండలి గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం పది లక్షల మంది ఇంజనీర్లు, డిప్లమో హోల్డర్లు విద్యాసంస్థల నుంచి బయటికి వస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో 2013లో పట్టభద్రులైన విద్యార్థుల్లో సగానికి సగం ఎటువంటి ఉద్యోగానికి సరిపోయే నైపుణ్యాలు లేవని తేలింది. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాప్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ అంచనా ప్రకారం ఐటీ రంగంలో పట్టభద్రులవుతున్న వారిలో కేవలం 25శాతం వద్ద మాత్రమే ఉద్యోగార్హతలకు తగినంత నైపుణ్యం ఉంటుంది. మిగతా శాతం దేనికి పనికోస్తారో తెలియక, సరియైన ఉద్యోగం రాక సతమతమవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న యువత కోసం 2030 నాటికి 25కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సగానికి కాదు కదా పదిశాతం యువతకు కూడా ఉద్యోగాల కల్పన ఎండమావిలానే మిగిలిపోయింది. సంవత్సరాలు గడుస్తున్నా, పాలన మారుతున్నా యువతరం జీవితాల్లో మాత్రం ఏలాంటి మార్పు రావడమే లేదని చెప్పవచ్చు. ఇప్పటికే పలు దేశాల్లో చైనా, జపాన్‌ లాంటి మొదలగు వాటిలో వయోవృద్దుల సంఖ్య పెరుగుతూ ఉంది. మన దేశంలో కూడా ఆ స్థాయి వచ్చేసరికి ఇక్కడున్న యువతను అన్నిరంగాల్లో అభివృద్ది పరిచేలా ప్రణాళికలు రూపొందించవచ్చు. ప్రతి సంవత్సరం లక్షల్లో పెరిగిపోతున్న యువతను వినియోగించుకోవాల్సిన బాధ్యత నేడు ప్రధానంగా ప్రభుత్వాల పైననే ఉంది. కాని ప్రభుత్వం తమకేది సంబంధం లేనట్టుగానే వ్యవహరించడం వల్లనే యువత జీవితం ఆగమ్యగోచరంగా మారిపోతుంది. 

స్వీపర్‌ ఉద్యోగానికి ఉన్నత అభ్యర్థులు..

దేశంలో నిరుద్యోగం స్థాయి ఎంత ప్రమాదకరంగా మారిపోతుందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఆ మధ్య బీహర్‌లోని అటెండర్‌ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతతో నోటిఫికేష్‌ విడుదలవగా లక్షలో పిజీ, పిహెచ్‌డీ చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. అంటే మన దేశ భవిష్యత్తుకు మూల స్తంభమైన యువతను పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. ఎన్నికల ముందు, వేదికల నెక్కి యువత దేశభవిష్యత్తు అని ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్న నాయకులకు ఉజ్జ్వల భవిష్యత్తుతో, గంపెడు ఆశలతో ఉన్న యువత జీవితం చిత్తుచిత్తుగా మారుతున్న మన పాలకులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది డిగ్రీలు, ఎంబిఎలు, బిటెక్‌లు చదివి పట్టాలు పట్టుకొని రోడ్ల మీదకు వస్తున్నారు. వారంతా ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వందలున్నా, దరఖాస్తులు మాత్రం లక్షల్లో వస్తున్నాయి. అంటే మన దేశం రేపటి తరానికి ఏలాంటి ప్రాధాన్యత ఇస్తుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. చదివిన చదువు ఎంత పెద్దది ఐనా సరే, ప్రభుత్వ కొలువులో స్వీపర్‌ ఉద్యోగాలకు పిహెచ్‌డీ చదువు చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారంటే మన పరిస్థితి, మన దేశ యువజనం పరిస్థితి కళ్లకు కట్టినట్టు అర్థమవుతోంది. తాజాగా తమిళనాడు ఆసెంబ్లీ సెక్రటేరియట్‌లో స్వీపర్‌, శానిటరీ కార్మికుల ఉద్యోగులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అందులో మొత్తం స్వీపర్‌ పోస్టులు 10, శానిటరీ కార్మికుల పోస్టులు 4గాను గత సంవత్సరం సెప్టెంబర్‌ 26న తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌ దరఖాస్తులను ఆహ్వానించగా ఇలా ఉన్నత చదువులు చదివిన వారి దరఖాస్తులే ఎక్కువగా ఉండడంతో అధికారులే నోరెళ్లబెట్టారు. పదవ తరగతి పాసైతే చేసే ఉద్యోగాలకు కూడా ఎంటెక్‌, బిటెక్‌, ఎంబిఎ, పోస్టు గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు నుంచి వందల ధరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. వీరే కాకుండా వీరితో పాటు డిప్లోమో పట్టా పొందిన వారు కూడా స్వీపర్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిప్లమో, టెక్నాలజీ చదువులు చదివిన వారు చీపురు పట్టే ఉద్యోగానికి, మురికివాడలు క్లీన్‌ చేసే ఉద్యోగానికి ధరఖాస్తు చేశారంటే మన బంగారు కలల భారతదేశం భవిష్యత్తు ముందు ముందు ఏలా ఉండబోతుందో అని అర్థమైపోతుంది. డిప్లమో చదివిన వారు స్వీపర్‌ పోస్టు ఐనా కావాలనే అతృతతో, ఒత్తిడితో మరీ మరీ క్యూలో నిలబడి దరఖాస్తులు చేస్తున్నారు. దేశం వెలుగుతోంది. వెలిగిపోతుంది అని గోప్పులు చెప్పే నాయకులకు, మనలను పరిపాలించే యంత్రాంగానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పాలకులు చెప్పె మాటలకు, చేసే పనులకు కొంచెం కూడా పొంతన లేకుండా రేపటి తరం జీవితాన్ని నాశనం చేస్తున్నారు. రాబోయే దేశ భవిష్యత్తు అంతా నేటి తరం, రాబోయే తరంలో ఉన్నదీ అని చెప్పడానికి మాత్రమే మనం పాలకుల పనితీరు ఉంది. యువతే నేటి దేశభవిష్యత్తు కాదు.. యువత ముందు నీ భవిష్యత్తు ఏంటో చూడు. గొప్ప గొప్ప చదువులు చదివిన చదివిన చదువుకు ఉపాధి కల్పించిన యంత్రాంగాల వల్ల నిరాశతో, నిస్పృహాతో యువత భవిష్యత్తే అంధకారమయ్యే రోజుల్లోనే మనం బతుకుతూ ఉన్నాము.. రేపటి తరం కోసం కాదు ఉన్నత చదువులు చదివిన నేటి తరం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది. నేటి తరానికి, నేటి యువతకు కావాల్సిందీ గద్దెనెక్కి చెప్పే మాటలు కాదు, చదివిన చదువుకు ఉపాధి కల్పించే పాలకులు కావాలి.. అలాంటి పాలకుల కోసం, యువతను ఆకర్షించే ప్రభుత్వం కోసం కోట్లాది మంది యువతవేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంది…

ఉన్నత చదువులు చదివిన వారు దరఖాస్తులు చేసుకోవడం ప్రభుత్వం అధికారులను అవాక్కయ్యేలా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here