Thursday, March 28, 2024

అన్నీ తానై..

తప్పక చదవండి
  • యాదాద్రి భువనగిరి జిల్లా డీపీఓ ఆర్. సునంద ఏకఛత్రాధిపత్యం..
  • ఉన్నతాధికారులు సైతం ఆమెకే వత్తాసు పలుకుతున్న వైనం..
  • క్రింద స్థాయి సిబ్బందిని వేధిస్తున్న జిల్లా పంచాయితీ అధికారి..
  • జిల్లాలో అధికసంఖ్యలో డీపీఓ బాధితులు..
  • డీపీఓ సునంద దర్శణం లభించాలంటే గగనమే..
  • యాదాద్రి భువనగిరి కలెక్టర్ స్పందించాలని బాధితుల డిమాండ్..

ఆమె జిల్లాస్థాయి మహిళా అధికారి.. ఇక్కడ ఆమె చెప్పిందే వేదం.. ఉన్నతాధికారులు సైతం ఆమెకే వత్తాసు పలుకుతుంటారు.. సమస్యలు చెప్పుకోవడానికి క్రింది స్థాయి ఉద్యోగులు ఆమెను కలవాలంటే గగనమే అవుతుంది.. ఉన్నతాధికారులు తనపట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తుండటంతో ఈవిడగారు రెచ్చిపోతున్నారు.. తన కిందస్థాయి ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారు.. యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయితీ అధికారిణి ఆర్. సునంద వ్యవహారం రోజు రోజుకూ తలనెప్పిగా తయారైందని క్రిందిస్థాయి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

యాదాద్రి భువనగిరి జిల్లా, పంచాయతీ అధికారిని ఆర్. సునంద జిల్లాలో అన్నితానై వ్యవహారాలూ నడిపిస్తున్నారు.. పై అధికారుల కనుసన్నల్లో పనిచేస్తున్నారు.. కాగా ఉన్నతాధికారులు సైతం డిపిఓ సునంద పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఇదే అదనుగా తీసుకొని క్రింది స్థాయి సిబ్బందిని ఈవిడ మానసిక వేదనకు గురి చేస్తున్నారు. డిపిఓ బాధితులు జిల్లాలో చాలామంది ఉన్నారని తెలుస్తోంది.. ఈమెను కలవడానికి వెళ్లిన కిందిస్థాయి ఉద్యోగులకు, తన సిబ్బందిచే కలవకుండా బయట నుంచే తిరిగి పంపించేస్తుంటారని తెలుస్తోంది.. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శణం అయినా సులభంగా దొరుకుతుంది.. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా డీపీఓ ఆర్. సునంద దర్శణం దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అంటున్నారు.. అలాటి అవకాశం క్రింది స్థాయి సిబ్బందికి లభించదు.. తనకు అనుకూలంగా ఉన్నవారిని అందలం ఎక్కించడం.. అనుకూలంగా లేని వారిని పాతాళానికి తొక్కడం ఈవిడాకు వెన్నతో పెట్టిన విద్య. బదిలీలు లేనప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో బదిలీలను నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రింది స్థాయి సిబ్బందిని డిప్యూటేషన్ పై పంపుతున్నారు.

- Advertisement -

ఈవిడ చేసిన అక్రమ బదిలీలు.. డిప్యూటేషన్స్ కి కొన్ని ఉదాహరణలు :
సంస్థాన్ నారాయణపూర్ మండలం, గుడిమల్కాపూర్ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కే .కృష్ణని ఎలాంటి కారణాలు లేకుండా ఒక వారం రోజులలో బీబీనగర్ మండలం, రామారావు పేట గ్రామపంచాయతీకి బదిలీ చేయవలసిన అవసరం ఏమి వచ్చింది..?

బీబీనగర్ మండలంలోని, వెంకిర్యాల గ్రామపంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సత్తిరెడ్డిని.. బీబీనగర్ గ్రామపంచాయతీ కి, బీబీనగర్ గ్రామపంచాయతీ లో విధులు నిర్వహిస్తున్న వై. ఆనంద్ రావును వెంకిర్యాల గ్రామపంచాయతీకి బదిలీ చేయడంలో డీపీఓ ఆర్. సునంద ఉద్దేశం ఏంటి..? నెల తిరగక ముందే వాళ్ల ఉత్తర్వులను రద్దు చేయడం, తిరిగి యధాస్థానానికి బదిలీ చేయడంలో మర్మమేమిటి?. రిటైర్మెంట్ కి దగ్గర్లో ఉన్న వై. ఆనంద్ రావును మారుమూల మండలం అయిన గుండాలకి డిప్యూటేషన్ పై పంపించడం ద్వారా తన పాత కక్షాలను నెరవేర్చుకున్నారా..?

14 మార్చి 2023 నాడు బీబీనగర్ మండలంలోని, భక్తి అనంతారం గ్రామపంచాయతీ నందు విధులు నిర్వహిస్తున్న ఎం. ఇంద్రసేనారెడ్డిని.. జమీల పేట గ్రామ పంచాయతీకి బదిలీ చేశారు. ఒక నెల గడవకముందే ఇంద్రసేనా రెడ్డిని బీబీనగర్ మేజర్ గ్రామ పంచాయతీకి డిప్యూటేషన్ పై పంపడంతో డిపిఓ పాత్ర ఏమిటి..?

అవుట్ సోర్సింగ్ ఉద్యోగి డి. చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శిని, పోచంపల్లి మండలంలోని.. రామలింగంపల్లి గ్రామపంచాయతీ నుండి బీబీనగర్ మండలంలోని.. మక్త అనంతారం గ్రామపంచాయతీకి ఎలాంటి కారణంతో బదిలీ చేసినట్టు?

రజిత అనే జూనియర్ పంచాయతీ కార్యదర్శిని జమీలాపేట గ్రామపంచాయతీ నుండి రావి పహాడ్ గ్రామపంచాయతీకి ఎందుకు బదిలీ చేసినట్టు? కాగా ఈ బదిలీలన్నీ సదరు డీపీఓ ఆర్. సునంద కనుసన్నల్లో.. నిబంధనలకు విరుద్ధంగా స్వలాభం కోసం జరిగినవే అంటున్నారు బాధితులు..

ఇట్టి డీపీఓ పై అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నా, ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.. అక్రమమార్గంలో డీపీఓ ప్రమోషన్ తెచ్చుకున్నారని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు తన అసలు శాఖకి వెళ్లకుండా, ఈ శాఖలో అక్రమ సంపాదన రుచి మరిగి ఇక్కడే కంటిన్యూ అవుతున్నారన్న వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి.. డీపీఓ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, కొంతమంది క్రింది స్థాయి ఉద్యోగులు కుటుంబ కారణాలచే బదిలీలకు దరఖాస్తు చేసుకొని చెప్పులు అడిగేలా తిరిగినా కనికరించని డీపీఓ తనకు అనుకూలంగా ఉన్న వారిపట్ల సానుకూలంగా స్పందిస్తూ బదిలీలు చేయడం వివాదాస్పదం అవుతోందని బాధితులు అంటున్నారు.. పైగా తనకు రాష్ట్రస్థాయి అధికారుల అండదండలు ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించుకోవడంతో.. క్రింది స్థాయి సిబ్బందిని భయ భ్రాంతులను గురి చేస్తోంది.. ఇప్పటికైనా ప్రభుత్వ ఉత్తర్వులను, నియమ నిబంధనలను కాదని స్వార్థ ప్రయోజనాల కోసం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా డీపీఓ ఆర్. సునందపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు