చంద్రబాబు ప్లాన్‌ కు గండి

0

  • కేసీఆర్‌ అంచనా ఇదీ, దీదీ ఆశ అదీ…

హౖెెదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు తలపెట్టిన 21 పార్టీల సమావేశాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించడం వెనక భారీ వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని గ్రహించిన మమతా బెనర్జీ సమావేశం ప్రతిపాదనను వ్యతిరేకించకుండా ఫలితాల వెల్లడి తర్వాత సమావేశమైతే బాగుంటుందని వ్యూహాత్మకంగా సూచించినట్లు భావిస్తున్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చేయడం మమతా బెనర్జీకి ఇష్టం లేదని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధినేత కె. చంద్రశేఖర రావు మమతా బెనర్జీ వ్యూహానికి అనుగుణంగా ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు సాయం తీసుకుని ప్రాంతీయ పార్టీల కూటమి (ఫెడరల్‌ ఫ్రంట్‌) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు చెబుతున్నారు. అది సాధ్యమవుతుందని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు రాష్ట్రాలకు చెందిన పార్టీల అధినేతలు కె చంద్రశేఖర రావు, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ కలిస్తే కేంద్రంలో పరిస్థితి వేరేగా ఉంటుందని కేసీఆర్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒడిశాలో బిజెపి నవీన్‌ పట్నాయక్‌ కు ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, కాంగ్రెసు బలహీనపడుతోందని, ఈ స్థితిలో బలహీనంగా ఉన్న కాంగ్రెసు వైపు నిలువడానికే నవీన్‌ పట్నాయక్‌ ఆసక్తి చూపుతారని కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అఖిలేష్‌, మాయావతి కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందని కూడా ఆయన అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. తాను కాంగ్రెసు పార్టీని క్షమించానని, ఆ పార్టీపై తనకు ప్రతీకారేచ్ఛ లేదని జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ స్థితిలో ఈ ఆరు పార్టీలు ఏకమైతే కేంద్రంలో చక్రం తిప్పడానికి వీలవుతుందని కేసీఆర్‌ తన పార్టీ నాయకులతో చెప్పినట్లు సమాచారం. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడం మమతా బెనర్జీకి ఇష్టం లేదని కూడా ఆయన అన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఫలితాల వెల్లడికి ముందు ప్రతిపక్షాల సమావేశానికి మమతా బెనర్జీ పచ్చజెండా ఊపలేదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌ లో 80, ఒడిశాలో 21, పశ్చిమ బెంగాల్‌ లో 42, మొత్తం 185 లోకసభ స్థానాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లో 2014 ఎన్నికల్లో బిజెపి 71 సీట్లు గెలుచకుంది. ఈసారి ఆ పార్టీకి అన్ని సీట్లు రావడమనేది కలలో మాట అని అంటున్నారు. ఈ స్థితిలో యుపిఎ భాగస్వామ్య పక్షాలు కూడా రాహుల్‌ గాంధీ కాకుండా మరో నేతను ప్రధానిగా ఎంచుకునే అవకాశం ఉంటుందని కేసిఆర్‌ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెసుకు దగ్గర కావాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఎస్పీ – బిఎస్పీ కూటమి ప్రధాని అభ్యర్థిగా మాయావతి పేరును ముందుకు తేవచ్చునని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here