సీఎం కనీసం స్పందించారా….?

వెటర్నరీ వైద్యురాలి హత్యపై లక్ష్మణ్
వెటర్నరీ వైద్యురాలు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నా… తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం స్పందించరా…? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. భువనగిరిలో పార్టీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక రెడ్డి హత్యపై ఆయన మాట్లాడుతూ…హైదరాబాద్‌తో పాటు వరంగల్ జిల్లాలో జరిగిన హత్యాచార ఘటనలపై దేశం మొత్తం స్పందిస్తూ… తీవ్రంగా ఖండిస్తున్నారని అయినా… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు నోరు విప్పక పోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో సీఎం కేసీఆర్ పరిపాలనతో ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. ఇది టీఆర్ఎస్ పాలనకు సమాధి కడతారని ఆయన జోస్యం చెప్పారు. మరోవైపు ఫ్రెండ్లీ పోలిసింగ్ పేరుతో శాంతిభద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీసులు వైఫల్యం చెందారని ఆయన ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలోనే హజీపూర్ సంఘటన అనంతరం నేటి వరకు 60మందికి పైగా మహిళలు ,యువతులు తప్పిపోయినా…పోలీసులు పట్టించుకోకుండా ఉన్నారని విమర్శించారు.