ధోనీ మరోసారి సూపర్‌ స్టంపౌట్స్‌..అంతేగా… అంతేగా

0

చెన్నై : ధోనీ వికెట్ల వెనకాల ఉన్నప్పుడు బ్యాట్స్‌మెన్‌ బంతినైనా ఆపాలి.. లేకపోతే క్రీజులోనైనా ఉండాలి.. అలా కాకుండా.. హాఉ ఏమౌతుందిలే అని ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఇక ఆ బ్యాట్స్‌మెన్‌కు మిగిలేది పెవిలియన్‌కు దారి మాత్రమే. బ్యాట్స్‌మెన్‌ క్రీజును వదిలి ప్రత్యేకంగా బయటికి వెళ్లాల్సిన పనిలేదు. క్రీజులో ఉన్నా సరే.. కాలు కదిపితే చాలు.. ఆ కదిపిన క్షణంలోనే బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు పంపిస్తాడు. నిన్న దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చేసిన స్టంపౌట్లను చూసిన ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. చెన్నై వేదికగా బుధవారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ మరోసారి తన కీపింగ్‌లో మెరుపులతో అదరగొట్టాడు. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ఇద్దర్ని స్టంపౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపించాడు. 11వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజా వేసిన నాలుగో బంతిని దిల్లీ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ మోరిస్‌ తప్పుగా అంచనావేయడంతో ఆ బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. అయితే, బంతి అందుకున్న ధోనీ మోరిస్‌ను స్టంపౌట్‌ చేసి అప్పీల్‌ చేశాడు. మైదానంలో ఉన్న లెగ్‌ అంపైర్‌.. థర్డ్‌ అంపైర్‌ను సమీక్ష కోరాడు. రిప్లేలో మోరిస్‌ కాలు ఒక్క క్షణం గాల్లోకి లేచినట్లు కనిపించింది. అయితే, సరిగ్గా అదే సమయంలో ధోనీ బెయిల్స్‌ను లేపడంతో మోరిస్‌ అనూహ్యంగా డకౌట్‌ కావాల్సి వచ్చింది. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు. ధోనీ మళ్లీ స్టంపౌట్‌కు అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరాడు. మోరిస్‌ ఔట్‌కు ఇది దాదాపు జిరాక్స్‌ కాపీలా అనిపించింది. అయితే ఆ బంతి శ్రేయస్‌ బ్యాట్‌ను తాకడంతో అంపైర్‌ క్యాచ్‌ ఔట్‌గా ప్రకటించాడు. మోరిస్‌ను స్టంపౌట్‌ చేసేందుకు ధోనీకి పట్టిన సమయం కేవలం 0.12 సెకన్లు మాత్రమే. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ను స్టంప్‌ చేసేందుకు 0.16 సెకన్లు పట్టింది. అయితే ధోనీ స్టంపౌట్లు చూసిన క్రికెట్‌ అభిమానులు.. ధోనీ చేతుల్ని బుల్లెట్‌రైలుకు లోగోగా పెడితే బాగుంటుందని తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here