‘ధోనీ ఏది చేసినా లెక్క ప్రకారం చేస్తాడు

0

బెంగళూరు : ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. బెంగళూరులో నిన్న చెన్నైతో నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో ఆఖరికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పైచేయి సాధించింది. ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరం రాగా ధోని వరుసగా 4, 6, 6, 2, 6 బౌండరీలు బాది 24 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి శార్ధుల్‌ ఠాకూర్‌ రనౌట్‌ కావడంతో చెన్నై మ్యాచ్‌ చేజార్చుకుంది. మ్యాచ్‌ మొత్తానికి ఆ ఓవర్‌ హైలైట్‌గా నిలిచింది. అయితే, 19వ ఓవర్‌లో మూడు సార్లు సింగిల్‌ తీసే అవకాశం వచ్చినా ధోనీ తిరస్కరించాడు. మరోవైపు చెన్నై కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ సింగిల్స్‌ విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఆ ఓవర్‌లో ధోనీ మూడు సింగిల్స్‌ తీసి ఉంటే మ్యాచ్‌ చెన్నై వైపు ఉండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ క్రీజులో పాతుకుపోయిన మాట వాస్తమే. కానీ అవతలి ఎండ్‌లో ఉన్నది బ్రావో. అతను ఎన్నో మ్యాచ్‌ల్లో మ్యాచ్‌ విన్నర్‌గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ధోనీ ఎందుకు సింగిల్‌ తీయలేదు అన్న ప్రశ్నకు ఆ జట్టు సమాధానమిచ్చింది.

‘ఛేదనలో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉంటుంది. కొత్తగా వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చీరావడంతోనే బౌండరీలు బాదడం అంత సులభం కాదు. బ్రావో అప్పటికి కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఆ సమయయంలో బ్రావో పెద్ద షాట్లు ఆడుతాడని ఎవరూ అనుకోరు. అందుకే ఆ బాధ్యత నా భుజాలపై వేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని ధోని పేర్కొన్నాడు. ధోని నిర్ణయాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ కూడా సమర్థించాడు. ‘ధోనీ ఏది చేసినా లెక్క ప్రకారం చేస్తాడు. బ్రావో బలమైన బ్యాట్స్‌మన్‌ కావచ్చు. కానీ క్రీజులోకి అడుగుపెట్టగానే బౌండరీలు బాదడం ఏ బ్యాట్స్‌మెన్‌కు కుదిరే పని కాదు. అందుకే ఆ బాధ్యతను ధోనీ తీసుకున్నాడు. ఇలాంటి ఉత్కంఠ మ్యాచుల్లో ధోని ఎన్నో విజయాలు అందించాడు. కాబట్టి సింగిల్స్‌ విషయంలో ధోనిని మేం ప్రశ్నించుకోదలచుకోలేదు’ అని ఫ్లెమింగ్‌ వివరించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here