అమల్లోకి నిషేధాజ్ఞలు.. ఇబ్బందుల్లో తెలుగు భక్తులు

0

శబరిమల: కేరళలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. సెప్టెంబరు 28న తీర్పు వెల్లడించిన తర్వాత తొలిసారి అక్టోబరులో నెలవారీ పూజల కోసం ఆలయం తెరుచుకోగా, 50 ఏళ్లలోపు మహిళలు శబరిమలలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలను భక్తులు అడ్డుకున్నారు. సుప్రీం తీర్పును అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించడంతో ఘర్షణ వాతావరణం నెలకుంది. నవంబరు 16 నుంచి జనవరి 20 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. రెండు నెలలపాటు మండల, మకరువిళక్కు పూజలు సన్నిధానంలో సాగనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో నిషేధిత వయసు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను భక్తులు అడ్డుకోవడం, తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడంతో శబరిమలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శబరిమల, పంబ, నిలక్కల్‌ పరిసరాల్లో గురువారం అర్ధరాత్రి నుంచే 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. మొత్తం 15 వేల మంది పోలీసులను మోహరించారు. వీరిలో 860 మంది మహిళా పోలీసులు సైతం ఉన్నారు. పదునెట్టాంబడిపై ఉన్నవారు తప్పా, భద్రత విధుల్లో పాల్గొన్న సిబ్బంది తప్పనిసరిగా డ్రస్‌ కోడ్‌ పాటించాలని ఐజీపీ విజయ్‌ సలీమ్‌ ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్టే ఇవ్వనందున తప్పకుండా అమలుచేస్తామని ఇప్పటికే కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశంపై గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అర్థాంతరంగా బయటకు వచ్చాయి. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ.. తీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరించబోమని కేరళ సీఎం విజయన్‌ పేర్కొన్నారు. అయ్యప్ప దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన భక్తులు నీలక్కల్‌ వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబరిమలకు వెళ్లే మార్గంలో 144 సెక్షన్‌ విధించడంతో బస్సులను నిలిపివేశారు. దీంతో, ఏపీ నుంచి 40 బస్సుల్లో వెళ్లిన భక్తులు పడిగాపులు కాస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకూ తమను అనుమతించమంటూ పోలీసులు చెబుతున్నారని.. అంతవరకూ మా పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

కోచిలో తృప్తిలొల్లి శబరిమలకు వెళ్లేందుకు శుక్రవారం తెల్లవారు 4.45 గంటలకు కోచి చేరుకున్న సామాజిక కార్యకర్త త ప్తిదేశాయ్‌ ఇంకా విమానాశ్రయంలోనే ఉన్నారు. త ప్తిదేశాయ్‌ వచ్చినట్టు తెలుసుకున్న భక్తులు, పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో ఆమెను బయటకు రాకుండా భద్రత సిబ్బంది అడ్డుకుని వెనక్కు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా, తనకు విమాన ఖర్చులు పూర్తిగా కేరళ ప్రభుత్వమే చెల్లించాలని త ప్తిదేశాయ్‌ డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించడం వల్లే తాను శబరిమల వెళ్లేందుకు వచ్చానని, అందుకే వాళ్లే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే దర్శనం చేసుకునే వెళ్తానని ఆమె ఎయిర్‌పోర్ట్‌లో భీష్మించుకుని కూర్చున్నారు. ఆమెతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. క్యాబ్‌ డ్రైవర్లు సైతం ఆమెను తమ వాహనాల్లో ఎక్కించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా తాము నడుచుకోలేమని నిరాకరిస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా సాగే శబరిమల యాత్ర శనివారం మొదలు కానుండగా, దీనికి విఘాతం కలిగించడానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని, శరణుఘోషతో నిరసన తెలుపుతున్నారు. శబరిమల వివాదంపై కేరళ ప్రభుత్వం గురువారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. రెండు నెలల పాటు ఆలయం తెరిచి ఉంటుంది కాబట్టి, మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు భావిస్తోంది. అంతేకాదు, ఈ రెండు నెలలపాటు శబరిమలలో శతాబ్దాలుగా సాగుతోన్న సంప్రదాయానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా కాపాడుకుంటామని అయ్యప్ప ధర్మసేన ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here