గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. గ్రామాల వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలుకావాలని, గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు ఇస్తామని ఆయన హావిూ ఇచ్చారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్మశాన వాటికల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు. పంచాయితీ సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికచేసిన రిసోర్స్‌ పర్సన్స్‌కు ప్రగతిభవన్‌లో అవగాహన కల్పించారు. ఈసందర్బంగా సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ పంచాయితీల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను కార్యక్రమాలు వివరించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌ సభ్యులతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. గ్రామాల వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలి. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు.. గ్రామాల ప్రజలను కలుపుకొని సామూహికంగా గ్రామవికాసానికి పాటు పడాలి. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తాం. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలి. మంచినీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తోందని సీఎం తెలిపారు. ఉపాధిహావిూ పథకంనిధులను సంపూర్ణంగా వినియోగించుకుని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, స్మశాన వాటికలు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘నరేగా’ నిధులతో పాటు రాష్ట్ర బ్జడెట్‌ నుంచి కూడా నిధులు ఉంటాయని, పార్లమెంటు సభ్యులతో పాటు శాసనసభ్యులు కూడా వారి ‘అభివృద్ధి నిధుల’ నుంచి గ్రామాల్లో అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటారని సిఎం తెలిపారు.కేంద్రం నుంచి రాష్టాన్రికి ఎంత మొత్తంలో డబ్బు వస్తుందో అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్జడెట్‌లో నిధులు కేటాయిస్తుందని, ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని చెప్పారు.ప్రతీ

గ్రామానికి డాంబరు రోడ్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకున్నదని, ఆ దిశగా దృష్టి పెట్టడంతో పాటు కొత్తగా 859 గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే తయారుచేసి పనులను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలని, ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, వీటికి నరేగా నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతర పనులకు ఈ నిధులను వాడాలని, అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మొక్కలు పెట్టడం, వాటిని రక్షించడం లాంటి బాధ్యతలు గ్రామ పంచాయతీలు చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం గ్రామ పంచాయతీల బాధ్యత అని చెప్పిన కెసిఆర్‌ గ్రామాల్లో పాడుబడిన ఇళ్ళ శిథిలాలను తొలగించాలని, పాడుపడిన లేదా నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చేయాలని పేర్కొన్నారు. మురికి, కంప చెట్లను తొలగించాలని, కూలిపోయిన ఇండ్ల శిథిలాలను కూడా తొలగించాలని స్పష్టం చేశారు. పంచాయితీ నిధులు దుర్వినియోగం కావద్దని, ప్రతీ పైసా సద్వినియోగం కావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పంచాయితీ చట్టాలను అవగామన చేసుకుని సర్పంచ్‌లు ముందుకు సాగేలా వారికి సూచనలు ఇవ్వాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, స్మశాన వాటికల నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలి. గ్రామాల సర్పంచులను, గ్రామ కార్యదర్శులను చేంజ్‌ ఏజెంట్లుగా మార్చే బాధ్యతలను రిసోర్స్‌ సభ్యులు చేపట్టాలి. గ్రామ పంచాయతీలకు అధికారాలను బదిలీ చేసే విషయంలో, నిధులు కేటాయించే విషయంలో అత్యంత ఉదారంగా ఉంటాం. అదే సమయంలో నిధుల దుర్వినియోగాలనికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సర్పంచులు, గ్రామ కార్యదర్శులను సస్పెండ్‌ చేసే విధంగా కఠిన చట్టం రూపొందిస్తమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ ఎస్కే జోషి, ఎమ్మెల్యేలు డీఎస్‌ రెడ్యానాయక్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here