Featuredజాతీయ వార్తలు

‘ద్వంసరచన’లో 17మంది

  • గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి కుట్ర?
  • ‘ఉగ్ర’ మూక కోసం గాలింపు
  • అప్రమత్తమైన ‘నిఘా’
  • పట్టుకుతీరుతామని కేంద్రం స్పష్టం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

గణతంత్ర వేడుకలను రక్తసిక్తం చేయడానికి దాయాది దేశం నుంచి ఓ 17మంది ముష్కరులు దేశంలోకి అక్రమంగా చొరబడ్డారు. దక్షిణాది రాష్ట్రాలలో భారీ విధ్వంసం సృష్టించడానికి ‘ధ్వంసరచన’తో తిరుగుతున్నారు. వీరిని పట్టుకోవడం కోసం జాతీయ పరిశోధన బృందం (ఎన్‌ఐఏ)తో పాటు నిఘా వర్గాలు దేశవ్యాప్తంగా జల్లెడపడుతున్నాయి. ఇంటిలిజెన్స్‌ వర్గాల అప్రమత్తత సమాచారం. మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాలు, రైల్వే, బస్‌ స్టేషన్‌, చెక్‌ డ్యాంల వద్ద భద్రత కొనసాగుతోంది. ఓ చిన్న ఆధారంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అత్యంత ముఖ్యులకు మాత్రమే అందిన ఈ సమాచారం గురించి ‘ఆదాబ్‌’కు ఉప్పందింది. వెంటనే ‘ఆదాబ్‌ బృందం’ కూడా రంగంలోకి దిగింది. దేశ పౌరుల క్షేమ, భద్రతలే లక్ష్యంగా.. అంర్నీ అప్రమత్తం చేయాలనే ధ్యేయంతో ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న సంచలన పరిశోధన కథనం.

ఎలా బయటపడింది: చెన్నైలో ఈ నెల 8న దుండగులు ప్రత్యేక ఎస్సైని దారుణంగా హత్య చేశారు. ఈకేసు దర్యాప్తులో అనూహ్య విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో గణతంత్ర దిన వేడుకల్లో విధ్వంసానికి కుట్ర చేసినట్టు తాజాగా వెల్లడైంది. దీని కోసం పలువురు ఉగ్రవాదులు రంగంలోకి దిగారని తెలియడంతో వారి కోసం పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కన్యాకుమారి జిల్లా కళియకావిళై చెక్పోస్ట్లో ప్రత్యేక ఎస్సై విల్సన్‌ హత్యకు గురైన కేసులో నిందితులు, పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కన్యాకుమారి జిల్లాకు చెందిన అబ్దుల్‌ సమీమ్‌, కేరళకు చెందిన తౌఫిక్‌ లను అరెస్టు చేశారు. వీరి ద్వారా… దక్షిణాది రాష్ట్రాల్లో విధ్వంసానికి కుట్ర చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో గణతంత్ర దిన వేడుకల్లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రమూక కుట్ర చేసినట్టు తాజాగా తెలిసింది. దీని కోసం 17మంది ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో తలదాచుకున్నారని తేలింది. దీంతో ఉగ్రమూకను అరెస్టు చేసేందుకు ఎన్‌ఐఏ, నిఘా వర్గాలతో పాటు తమిళరాష్ట్ర, పుదుచ్చేరి పోలీసులూ కూడా రంగంలోకి దిగారు. చెక్పోస్టులు, విడిదులు, తదితర ప్రాంతాలపై నిఘా ఉంచారు. దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఆటోలోనే వచ్చిన ముష్కరుడే మంగుళూరు ఎయిర్‌ ఫోర్టులో బాంబు పెట్టింది

మంగుళూరులో దొరికిన బాంబు: మంగళూరు, బాజ్పే విమానాశ్రయంలో గుర్తుతెలియని వ్యక్తి ఉదయం 8.45 గంటల సమయంలో వదలివెళ్లిన సంచిలో బాంబు ఉందని మధ్యాహ్నం ఒంటి గంట వేళకు అధికారులు తేల్చారు. ఆపై.. బాంబుల నిర్వీర్యదళం రంగంలోకి దిగి- ఆ సంచిని ప్రత్యేక వాహనంలో తరలించి పేల్చివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, భాజపా కార్యాలయం, చర్చిస్ట్రీట్‌, మైసూరులోని కొన్ని ప్రాంతాల్లో బాంబులు సృష్టించిన భయోత్పాతం మరువలేనిది. మంగళూరు విమానాశ్రయానికి ఆటోలో వచ్చి వెళ్లిన ఆగంతకుడు ( ఛాయాచిత్రం ఆదాబ్‌ సంపాదించింది) ఒక విమానయాన సంస్థ కౌంటర్‌ సమీపంలోని ప్రయాణికుల విశ్రాంతి గది వెలుపల ల్యాప్టాప్‌ ఉంచే సంచిని వదిలి వెళ్లిన విషయాన్ని రెండు గంటల అనంతరం గుర్తించారు. బాంబుకు అమర్చిన బ్యాటరీ ఖాళీ కావడంతో (డిస్ఛార్జ్‌) అది పేలలేదని ప్రాథమిక విచారణలో గుర్తించారు. బాంబును ప్రత్యేకమైన మినీ కంటెయినర్‌ లో కెంజారు గ్రామ సమీపానికి తీసుకు వెళ్లారు. దాన్ని క్రేన్‌ సహాయంతో మైదానంలో ఉంచారు. మైదానంలో ఉన్న వారిని బయటకు పంపించారు. బాంబు నిష్క్రియదళం సిబ్బంది కొత్త బ్యాటరీని అమర్చి, దాన్ని ఇసుక మూటల మధ్య ఉంచి పేల్చివేశారు. బాంబు ఉంచి వెళ్లిన నిందితుని చిత్రాలను అన్ని చోట్లకు పంపించామని నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ హర్ష తెలిపారు. నిందితుడు వచ్చి వెళ్లిన ఆటో సంఖ్య ఆధారంగా వివరాలను గుర్తించే ప్రయత్నాలను ప్రారంభించారు. నిందితుడ్ని గుర్తించి, అరెస్టు చేసేందుకు మూడు బృందాల పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు దొరికిన విషయం వెలుగు చూసిన వెంటనే బెంగళూరు, హుబ్బళ్లి, మైసూరు విమానాశ్రయాల్లో సోదాలు నిర్వహించారు. కార్గో విభాగంలోనూ అణువణువూ జల్లెడ పట్టారు. భద్రతలో భాగంగా అన్ని ఆనకట్టలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను రెట్టింపు చేశారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల గురించి స్థానిక ఠాణాల్లో సమాచారం అందించాలని డీజీపీ నీలమణి రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తీరప్రాంత జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత జిల్లాలు, ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకున్న విభాగాల్లో బస్టాండ్లు, మార్కెట్లలో సోదాలు కొనసాగించారు.

శభాష్‌ గంగయ్య: తను మోసుకెళుతున్నది ఏకంగా పది కిలోల బాంబు! ఆ విషయం తెలిసీ నిర్భయంగా ముందుకు సాగారు గంగయ్య. ఈ పేలుడు పదార్థాల నిర్వీర్య దళంలోని ఆయన.. ప్రత్యేక వాహనంలో ఆ బాంబును తరలించాక…ఓ పరికరం సాయంతో బాంబును ఇసుక మూటల మధ్య అమర్చి ఆ బాంబును పేల్చివేశారు. (ఆ దృశ్య చిత్రం కూడా చూడవచ్చు)

ఇసుక బస్తాల నడుము బాంబును పేల్చిన దృశ్యం

తుంగభద్ర డ్యాం వద్ద సాయుధ బందోబస్తు: ఉగ్రమూకల ద్వంసరచనపై జాగ్రత్త చర్యగా హ్పసపేటెలోని తుంగభద్ర జలాశయానికి భద్రత పెంచారు. ఒక ఎస్సై, ఒక ఏఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు భద్రత విధుల్లో అదనంగా ఉంటారని డ్యాం సిఐ నారాయణ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచనలు వచ్చే వరకూ భద్రత కొనసాగుతుందని, కింద ద్వారం వద్ద కూడా సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసి డ్యాం వద్దకు అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు.

రాయచూరు అప్రమత్తం: ఎస్పీ వేదమూర్తి స్పష్టం

రాయచూరులో ఎస్పీ వేదమూర్తి తనిఖీలు చేస్తున్న దృశ్యం

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచినట్లు జిల్లా ఎస్పీ వేదమూర్తి తెలిపారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్కు ఆయన వెళ్లి స్వయంగా తనిఖీలను పర్యవేక్షించారు. ఆర్టీపీఎస్‌, వైటీపీఎస్‌, హట్టి బంగారు గనుల కంపెనీ, నారాయణపుర జలాశయం వద్ద బందోబస్తు పెంచినట్లు ఎస్పీ వివరించారు. సదరబజార్‌ పీఎస్సై ఉమేష్‌ కాంబ్లే, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. అర్థరాత్రి వరకు ఢిల్లీ నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం సుమారు 8మంది అనుమానితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణ పౌరులు కూడా ఎక్కడ అనుమానితులు కనిపించినా, అనుమానాస్పద వస్తువులు కనిపించినా స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్విలని ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ కోరుకుంటుంది. అందరం అప్రమత్తంగా ఉన్నట్లు అయితే ముష్కరుల పన్నాగాలు ఈ దేశంలో సాగవు. జరగవు. జరగనివ్వకూడదు. మేరా భారత్‌ మహాన్‌. జైహింద్‌.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close