Featuredస్టేట్ న్యూస్

ఆగని మరణాలు…

రాలిపోతున్న విద్యాకుసుమాలు..

కనబడని కమిటి నివేదిక…

పట్టింపులేని యంత్రాంగం…

మరణాలు ఆగడం లేదు.. అవమానం భరించలేక విద్యార్థులు ఇప్పటికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మన ప్రభుత్వాల నిర్లక్ష్యం.. మన అధికారుల అలసత్వానికి అభం శుభం తెలియని విద్యార్థులే బలైపోతున్నారు… బాధ్యులెవరంటే.. ఎవరూ, ఎవరూ, ఎవరని ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవడమే తప్ప కమిటీ చేసిందీ లేదు.. నివేదిక వచ్చినా దాని ప్రకారం చర్యలు తీసుకున్నదీ లేదు.. ఇంటర్‌ విద్యార్థుల మరణాలంటే మన ప్రభుత్వాలకు, మన అధికారులకు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా తయారయ్యారు. ఒకరెమో చదువుతే పాసవుతారంటారు. మరొకరెమో ఇంటర్‌మీడియట్‌లో తప్పులే జరగలేదంటారు. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, అసలు తప్పేలా జరిగిందో విచారణ జరపకుండా ఒకరు స్పందించడం, రాష్ట్ర ముఖ్యమంత్రి సరియైన సమయంలో స్పందించకపోవడంతో ఇప్పటివరకు అంత పెద్ద తప్పిదంపై చర్యలు మాత్రం తీసుకున్న సంధర్బాలే లేవు… జరిగిన తప్పిదానికి సంబంధిత మంత్రి రాజీనామా లేదు. అధికారులపై ఇప్పటివరకు చర్యలు లేవు… ముప్పై దగ్గరలో ఉన్న విద్యార్థుల మరణాలంటే మన పాలకవర్గానికి ఎంత ఆసక్తి ఉందో దీన్ని బట్టి తెలుస్తూనే ఉంది…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): 24, 25, 26, 27 రోజురోజుకు విద్యార్థుల మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది కాని ఇప్పటివరకు తప్పు జరిగినా దానిపై సరియైనా చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడమే లేదు. నంబరదేముందీ అనుకుంటున్నారేమో పోయేది మన పోరగాళ్ల ప్రాణాలు కాదనుకుంటున్నారో ఏమో కాని ఒక్కరి ఆలోచన అంతుపట్టడమే లేదు. విద్యార్థుల ప్రాణాలపై తక్షణమే స్పందించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొవాల్సిన ముఖ్యమంత్రివర్యులు అవేమి పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పది, పదిహేను రోజుల నుంచి రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న తతంగాన్ని పట్టించుకోకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ రాష్ట్రాల బాట పట్టడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారో, లేక చర్చల పేరు మీద తీర్థయాత్రలకు తిరుగుతున్నారో తెలియడం లేదు. విద్యార్థులకు మానిసికంగా ధైర్యాన్ని ఇచ్చేవారు కరువైపోయారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో మరో విద్యార్థిని ఉజ్జ్వల భవిష్యత్తుపై గంపెడాశలు పెట్టుకుంది. తీరా ఫలితాలు చూసేసరికి ఏమి చెయ్యాలో పాలుపోక ఫలితాలు వచ్చినప్పటి నుంచి మానసికంగా కుంగిపోతూ మంగళవారం రోజు ఆత్మహత్యకు పాల్పడి నిండు ప్రాణాలను బలితీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెంలోని జూలూరుపాడు మండలం వెంగన్నపాలెనికి చెందిన మానస ఇటీవల ఇంటర్‌ పరీక్షలు రాసింది. మంచి మార్కులు వస్తాయని.. ఉన్నత చదువులకు వెళ్లాలని ఆమె భావించింది. ఇంటర్‌ ఫలితాలు చూశాక ఫెయిల్‌ అని రావడంతో ఆందోళనకు గురైంది.. కుటుంబసభ్యులు, స్నేహితులుఎంతమంది నచ్చజెప్పినా మానసికంగా కృంగిపోయిన మానస పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు మానసను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లాలని డాక్టర్లు సూచించడంతో నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మానస కన్నుమూసింది.

నివేదికలు ఇచ్చినా చర్యలు లేవు… ఇంటర్‌మీడియట్‌ పేపర్‌ వ్యాల్యూయేషన్‌లో తప్పులు జరిగాయని నివేదిక ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థిసంఘాలు మండిపడుతున్నాయి. ఒక అడ్డమైన కంపెనీని తెచ్చి, లక్షలాది మంది పిల్లల బతుకులతో ఆటలాడుకుంటున్న అసలైన బాధ్యులు మాత్రం బిందాస్‌గానే ఉన్నారు. చివరకు బలైపోయేది మాత్రం విద్యార్థులే.. విద్యార్థులే కదా పోతే పోనివ్వండి, ఉద్యమ సమయంలో ఎందరు చావలేదు. పంటలు ఎండిపోయి, గిట్టుబాటు ధరలేక వేలాది మంది రైతులు చావలేదా అనే నానుడిని నిజం చేసేలా ఉన్నారు. అడ్మిషన్ల దగ్గరి నుంచి హాల్‌ టికెట్లు, ఫలితాల ఎంట్రీ దాకా ఒక్క దశలోనూ గ్లోబరీనా కంపెనీకి ఏవిూ చేతకాలేదు అని తెలిసినా ఒక్క నోటీసు ఇవ్వకుండా తమ అడుగులకు మడుగులత్తుతుందీ ఇంటర్‌మీడియట్‌ బోర్డు.. ఎవరూ పట్టించుకోకుండా రోజురోజుకు ఆత్మహత్యల స్కోరు లెక్కించుకొవడం మినహా చేసేదీ మాత్రం ఏమీ లేదు.. ఉమ్మడి రాష్ట్ర పాలనను రోజుకో రకంగా తిట్టిపోసిన పెద్దపెద్ద నాయకులు మాత్రం ఒక్కరంటే ఒక్కరూ కనబడటం లేదు.. స్వంత రాష్ట్రంలో సమస్యలను పట్టించుకోకుండా పక్కరాష్ట్రాలపై పడడం కరెక్ట్‌ కాదేమోనంటున్నారు మన ఓటర్లు.. మన అశోకుడు, మన గ్లోబరినా, మన పాలన.. మనకు తిరుగులేకుండా ఆనందంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ చక్కర్లు కొడుతున్నాం..

తప్పేమి జరగలేదంటున్న ఇంటర్‌బోర్డు… విద్యార్థుల ఆత్మహత్యపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు సమర్ధించుకుంది. అందులో తమ తప్పేవిూ లేదన్నట్టు చెబుతోంది. ఇంటర్మీడియట్‌లో ఫెయిలయ్యామని, ఆత్మహత్య చేసుకున్న 23 మంది విద్యార్థుల ఆన్సర్‌ షీట్లన్నీ మళ్లీ ప్రత్యేకంగా రీ వాల్యూయేషన్‌, రీ వెరిఫికేషన్‌ చేశామని, ఆ విద్యార్థులంతా నిజంగానే ఫెయిలయ్యారని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ ప్రకటించారు. వారి ఆత్మహత్యలతో ఇంటర్‌ బోర్డుకు సంబంధం లేదని ఆయనకు ఆయన సొంతంగా క్లీన్‌ చిట్‌ ఇచ్చుకున్నారు. ఇంటర్‌ వ్యవహారాల్లో తనకు మరక అంటకుండా ఆయన తాపత్రయం పడుతున్నారు. ఇంటర్‌ బోర్డు వ్యవహారంలో జరిగిన అవకతవకల ప్రచారంలో ఆందోళనకు గురి కాని.., ఒక్క ఇంటర్‌ విద్యార్థి కూడా లేడంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రాసిన వారిలో కనీసం 30 శాతం మంది తమ ఎగ్జామినేషన్‌ పేపర్లు తమకు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇంటర్‌ బోర్డు పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థుల్లో ఏర్పడిన అనుమానాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్ధమైపోతుంది. 99 మార్కులు వచ్చిన విద్యార్థులకు సున్నా మార్కులేసింది నిజం. ఇప్పటికీ కొన్ని వందల మందికి అలా మార్కుల్లో మార్పులు జరిగాయన్నది కూడా నిజం. ఫెయిలైన 3లక్షల మందిపైగా విద్యార్థుల్లో రీ వెరిఫికేషన్‌, రీ వాల్యుయేషన్‌లలో కనీసం 3శాతం మంది పాస్‌ అవుతున్నట్టుగా ఇంటర్‌ బోర్డు అధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలకు, తమకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల హత్మహత్యలతో ఇంటర్‌ బోర్డుకు సంబంధం లేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ నివేదికపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట్‌ మండలంలోని మడుర్‌ గ్రామంలో ఏప్రిల్‌ 23న రాజు అనే ఇంటర్‌ విద్యార్థి ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురై స్కూల్‌ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అయితే, ఇంటర్‌ బోర్డు నివేదికలో ఫెయిల్‌ అయిన కారణంగా విద్యార్థులు చనిపోలేదని చెప్పడం ప్రభుత్వ కుట్రని తల్లిదండ్రలు మండిపడుతున్నారు. పేపర్లు దిద్దడంలో తప్పులు జరగడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని రాజు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద కొడుకు చనిపోయాడని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close