1763కి పెరిగిన మృతుల సంఖ్య & 5 వేల మంది గల్లంతు

0

జకార్తా: ఇండోనేషియాను ఇటీవల భూకంపం, సునామీ కుదిపేసింది. సులావెసీ ద్వీపంలో సంభవించిన సునామీలో మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ఇప్పటి వరకు 1763 మంది మృతి చెందినట్టు లెక్క తేలింది. 5 వేల మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. 70 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్టు ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నెగరోహో తెలిపారు. చాలా గ్రామాల్లో ఇళ్లు ఇంకా బురదలోనే ఉన్నాయని, మట్టిలో కూరుకుపోయాయని పేర్కొన్నారు. అందులో చిక్కుకుపోయిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.

సహాయక చర్యలు పూర్తయ్యాక మొత్తం మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పగలుగుతామన్నారు. ఈనెల 11 వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని, ఆ తర్వాత నిలిపివేస్తామని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో కనిపించని వారిని గల్లంతైన వారి జాబితాలో చేరుస్తామని వివరించారు. సెప్టెంబరు 28న సులావెసి ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం, ఆ వెంటనే విరుచుకుపడిన సునామీ ప్రభావం దాదాపు పది లక్షల మందిపై పడింది. ఈ ఘోర కలిలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూ ఉండగా, అంతర్జాతీయ సమాజం ఇండోనేషియాను ఆదుకునేందుకు ముందుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here