అడ్డగోలుగా మాట్లాడితే ‘పరువు నష్టం’ దావా వేస్తా

0
  • కేసీఆర్‌ కార్మికుల పక్షపాతి
  • రాయితీపై ఇళ్లు నిర్మించేలా రూపకల్పన
  • ఫెయిలైౖన విద్యార్థులు అధైర్యపడవద్దు
  • ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది
  • ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి
  • మేడే వేడుకల్లో కెేటీఆర్‌

ఇంటర్‌ బోర్డు వ్యవహారంలో రాజకీయంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు కేటీఆర్‌.. తప్పు చేసిన వారిపై తప్పక చర్యలుంటాయని స్పష్టం చేసిన ఆయన.. నేనూ ఓ తండ్రినే.. పిల్లల భాద నాకు తెలుసన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా విజ్ఞప్తి చేశారన్న కేటీఆర్‌… ఇంటర్‌ ఫలితాల విషయంలో ప్రభుత్వం డిఫెన్స్‌ లో పడిందన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇక విద్యాశాఖకు సంబంధించిన అంశాన్ని ఐటీ శాఖకు లింకుపెడుతున్నారు.. దానితో సంబంధమేంటి..? టెండర్లు ఇచ్చింది ఇంటర్‌ బోర్డు కదా? అన్నారు కేటీఆర్‌. ఐటీ మంత్రిగా ఉంటె నాకే సంబంధమా.? అని ప్రశ్నించారు. రూ.4 కోట్ల టెండర్‌ ఉంటే.. రూ.10 వేల కోట్ల స్కామ్‌ అంటూ ఒకాయన సోయి లేకుండా మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. ఇక పెద్దమ్మగుడికి రా అంటూ ఓ బఫున్‌ పిలుస్తున్నారంటూ వీహెచ్‌పై మండిపడ్డారు. ప్రతి పక్షాలు చిల్లర రాజకీయాలు చెయ్యొద్దు అని హెచ్చరించారు…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సీఎం కేసీఆర్‌ కార్మికుల పక్షపాతి అని, కార్మికుల సంక్షేమం కోరే ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్మికుల సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కార్మికుల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష్యమన్నారు. గడిచిన ఐదేళ్లలో కేసీఆర్‌ హయాంలో కార్మికుల సమస్యలను పరిష్కరించారని తెలిపారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించారని చెప్పారు. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించారని అన్నారు. కేసీఆర్‌ ఆశీర్వాదంతో రామగుండం ఫర్టిలైజర్‌, సిర్పూర్‌ పేపర్‌ మిల్లు, బాల్లపూర్‌ ఇండస్ట్రీస్‌ను తెరిపించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. కొత్త పరిశ్రమలకు పెద్ద పీట వేశామని, పారిశ్రామికీకరణకు ఊతమివ్వడం ద్వారా కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించడం, మూతపడ్డ పరిశ్రమలను తెరిపించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నాణ్యమైన జీతం, నాణ్యమైన జీవితం వచ్చే విధంగా ముఖ్యమంత్రి త్రిముఖ వ్యూహంతో పని చేశారని అన్నారు. గత పాలకులు జీతాలు పెంచమని అంగన్‌వాడీలు అడిగితే గుర్రాలతో తొక్కించారని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో అంగన్‌వాడీలను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని వారికి భోజనం పెట్టి మరీ జీతాలు పెంచారని కేటీఆర్‌ అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అంగన్‌ వాడీ టీచర్ల జీతాలను 4వేల 500 నుంచి పది వేల 500 రూపాయలకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంగన్‌ వాడీ టీచర్లకు రెండు సార్లు జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని అన్నారు. మినీ అంగన్‌ వాడీ టీచర్లు,

ఆయాలకు రూ. 2 వేల 500 నుంచి 6 వేలకు జీతాలను పెంచినట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతాన్ని రూ.7 వేల 500 లకు, వీఆర్‌ ఏలకు జీతం 6 వేల నుంచి పది వేల 700 లకు పెంచామని తెలిపారు. ఐకేపీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచామన్నారు. 25 వేల విద్యుత్‌ కాంట్రాక్టర్లను సంస్థలో విలీనం చేసి.. వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు జీతాలు పెంచామని తెలిపారు. వీఆర్‌ఏలు, పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు పెంచారని, ¬ంగార్డుల జీతం రూ. 9 వేల నుంచి రూ. 21 వేలకు పెంచారని కేటీఆర్‌ గుర్తుచేశారు. పెరిగిన సంపదను పేదలకు పంచుతున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సమస్యను సీఎం కేసీఆర్‌ పరిష్కరించారని, ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను రద్దు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. పరిశ్రమలకు సవిూపంలోనే నివాస స్థలాలు ఉండాలని కార్మికులు కోరుతున్నారని, కార్మికులకు రాయితీపై ఇళ్లు నిర్మించి ఇచ్చేలా విధాన రూపకల్పన చేస్తామని కేటీఆర్‌ హావిూ ఇచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

పద్దతి మార్చుకోకపోతే పరువునష్టం వేస్తాం.. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు పద్దతి మార్చుకోకపోతే పరువు నష్టందావా వేయనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తాను చెప్పినట్లు తెలిపారు. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలను ప్రభుత్వం సరిదిద్దుతుందని, ఉచితంగా రీ వెరిఫికేషన్‌కు ఆదేశాలివ్వటం జరిగిందని అన్నారు. కేసీఆర్‌ స్పందించి విద్యార్థులకు న్యాయం చేస్తామని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఇప్పటికే హావిూ ఇచ్చారని అన్నారు. రూ. 4 కోట్ల 35 లక్షల 70 వేలకు గ్లోబరీనాకు టెండర్‌ దక్కిందని, ఒకాయన 10 వేల కోట్ల స్కాం జరిగిందని అంటున్నాడని, రూ. 4వేలకు టెండర్లు దక్కించుకుంటే.. రూ.10వేల కోట్లు స్కాం ఎలా జరుగుతుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. అర్థంలేని మాటలతో విద్యార్థులను రెచ్చగొడుతూ.. తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు అంటూ విద్యార్థులను రోడ్లపైకి తీసుకొస్తున్నాయని, సున్నితమైన సమస్యను ఓ పక్క ప్రభుత్వం పరిష్కరిస్తుంటే.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ కాంగ్రెస్‌ నేత పెద్దమ్మగుడికి రా ప్రమాణం చేయ్యి అంటున్నాడని, ఆయన చెప్పి టైంకు పోకపోతే నీవు దొంగవు అన్నట్లు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని, అడ్డగోలు విమర్శలు చేసేవారిపై పరువునష్టం దావా వేస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు అధైర్యపడవద్దని.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని కేటీఆర్‌ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here