బంధం రోజురోజుకు భారమే..

0

సహజీవనంలోనూ మనస్పర్థలే…

పటాపంచలవుతున్న బంధాలు..

బంధం.. బంధుత్వం… అనురాగం.. అత్మీయత అన్ని మూడున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి.. బతికినన్ని రోజులు బాదర బంధీలు లేకుండా గడిపే జీవితానికే యువత అలవాటు పడుతున్నారు.. పెండ్లి అనేది భారతీయ సంస్కృతిలో ఇక విభిన్నమైన ఘట్టం.. ప్రపంచమంతా భారతదేశంపై తదేకంగా చూస్తుంటే మన వాళ్లు మాత్రం విదేశీ మోజుకే అలవాటుపడుతున్నారు. ఇటీవల సుప్రీం కోర్టుపై ఇరువురి ఒప్పందంతో కలిసి ఉండవచ్చు, సహజీవనం పేరుతో శారీరకంగా కలువనూవచ్చు అనే సంకేతాలు సైతం ఇచ్చింది. ఆనాది నుంచే రహస్యంగా కొనసాగుతున్న సహజీవనం సుప్రీం మాటలతో మరింత బహిర్గతమయింది. పెళ్లి లేకుండానే కలిసే ఉంటూ, కలిసి పిల్లలను కనవచ్చు అనే ధోరణి అందరిలో కాకున్నా అవకాశం ఉన్నవారందరూ ఆ పద్దతినే అవలంభిస్తూ వస్తున్నారు.. రహస్యంగా ఉన్న బంథం బహిర్గతంగా కొనసాగడంతో ఎవరికి తోచినట్టు వారు, ఎవరికి నచ్చిన వారితో వారు ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఉన్నన్ని రోజులు ఉంటూ, ఎవరికి మనస్పర్థలు వచ్చినా బంధం మొత్తానికే పుల్‌స్టాప్‌ పెట్టే మనుసులే పెరిగిపోతున్నారు.. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో కూడా సహజీవనం చాపకింద నీరులా వ్యాపిస్తున్న అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది… కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే మేలు అనుకునే ఆలోచనలోకి మనిషి జీవన విధానంలో కొనసాగుతోంది. విదేశీ మోజులోనైనా కలిసుంటారేమో కాని భారతదేశంలో మాత్రం ఎప్పుడు కలిసుంటున్నారో, ఎప్పుడు విడిపోతున్నారో తెలియడం కష్టంగా మారిపోయింది… బంధం రోజురోజుకు భారంగా మారిపోతూ మనిషి ఉన్నతి నుంచి అధమ స్థాయికి నెట్టేస్తుంది…. అవసరాల కొరకే కొనసాగే బంధాలతో మనిషి చివరకు ఒంటరిగా, ఏకాకిగా మిగిలిపోతున్నాడు….

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

లివ్‌ ఇన్‌ రిలేషన్‌ అంటే ఇద్దరి భావాలు కలిసిన ఆడ మగ కలిసి జీవించడం.. ఎవరి అనుమతి లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా బంధం, బంధుత్వం అనే మాట వినపడకుండా, పెళ్లి అనే బంధం కాని ప్రేమ అనే ఫీలింగ్‌ కాని అవసరం లేకుండా కలిసే ఉండేది. ఒకరికొకరు నచ్చారంటే సహజీవనం అనే పదం చాలు కలిసి ఉండవచ్చు.. కలిసి ఎంజాయ్‌ చేయవచ్చు. రోజురోజుకు మారుతున్న పరిమాణాల దృష్ట్యా సహజీవనం అనే పదానికి కూడా అర్థమే మారిపోయింది. ప్రేమించుకొని విడిపోయే వాళ్ల గురించి వింటూ ఉన్నాం. కాని ఇటీవల కాలం నుంచి సహజీవనం (లివ్‌ ఇన్‌ రిలేషన్‌)లో విడిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అంతేకాదు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్ల వరకు వెళ్లి కేసులు సైతం పెట్టుకునే స్థాయికి ఎదిగిపోతున్నారు. పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసినా న్యాయపరమైన చిక్కులు అనేకం తలెత్తడంతో ఎవరికి ఏం సమాధానం చెప్పాలో, ఎవరిపై ఏలాంటి కేసులు నమోదు చేయాలనే తెలియక తికమక పడుతున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు సుప్రీంకోర్లు కూడా ఇష్టపూర్వకమైన శృంగారం తప్పుకాదని తేల్చడంతో సహజీవనం చేసే వారికి మరింత బలం వచ్చినట్టు ఉంది. ఇన్నాళ్లు ఒకరికొకరు సహజీవనంలో బ్రేకప్‌ రాగానే మహిళలు తమపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో సుప్రీం తీర్పుననుసరించి పోలీసులకు ఏం చేయాలో అంతుబట్టడం లేదు. సహజీవనం కల్చర్‌ అనేది మొదటగా పాశ్చాత్య నాగరికతగా చెప్పుకునే వారు. విదేశాలలో వారి జీవన విధానానికి తగ్గట్లు ఎవరికి నచ్చినన్ని రోజులు వారు కలిసే మెలిసే ఉండేవారు. పిల్లలు పుట్టిన, ఆస్తులు పెరిగినా మనస్పర్థలు రాగానే ఎవరిదారి వారు చూసుకునే సంస్కృతి అక్కడ బాగా ఉండేది. అక్కడి సంస్కృతిలో రోజురోజుకు మార్పు వస్తున్నా కాని విదేశీ అలవాట్లు, వారి సంస్కృతి మనకు అలవాటుగా మారిపోయింది. ప్రపంచం మొత్తం మనవైపు చూస్తుంటే మనం మాత్రం బంధాలు, బంధుత్వాలు అన్ని తాత్కాలిక అంశాలుగా చూస్తూ అవసరం ఉన్నవరకే వాడుకుంటూ వదిలేస్తున్న సంస్కృతికి మనం బాగా అలవాటుపడిపోతున్నాం. సహజీవనం సంస్కృతి దేశంలోని పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో ఉండేది. ఇది రాను రాను చిన్న చిన్న నగరాలకు కూడా వ్యాప్తి చెందింది. ఇరువురి అభిప్రాయాలు, ఆలోచనల్లో స్వేచ్చ ఉంటుందని, పెళ్లయి దూరంగా ఉంటున్నవారు, విడాకులు తీసుకున్నవారు తమ అభిప్రాయాలు కలిసిన వారితో సహజీవనం వైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. కొంతకాలం ఇరువురీ అంగీకారంతో ఆనందంగానే ఉంటున్న రోజురోజుకు వారిలో వస్తున్న మనస్పర్థలు రాగానే బ్రేకప్‌ చెప్పుకుంటూ ఎవరిదారి వారే చూసుకుంటున్నారు. కొందరు పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కుతూ మాకు అన్యాయం జరిగిందని గోడు వెళ్లుబోసుకుంటున్నారు. వారు చేసే సహజీవనానికిచట్టబద్దమైన గుర్తింపు లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. భారత సంస్కృతికి వ్యతిరేకంగా కలిసి మెలిసి ఉంటున్న సహజీవానికి ప్రత్యేకమైన చట్టమంటూ లేదు. ఎవరికి నచ్చితే వారు కలిసుండాలి, నచ్చకుంటే విడిపోవాలి అనే నానుడి ఉంది. కాని మామూలు కేసుల కన్నా సహజీవనం కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒక్క బెంగుళూరు నగరంలోనే సహజీవనంలో ఈ ఒక్క ఏడాదిలోనే 300 కేసులు నమోదు కాగా, తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా నమోదు అయ్యాయి. ఇందులో కూడా ఒకరికొకరు అర్థం చేసుకోలేక త్వరలోనే విడిపోతున్నారని వీటి పరిస్థితిని చూస్తేనే అర్థమవుతోంది.

కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌లకు మన దూరం…

పెళ్లి అనేది ఇరు కుటుంబాలు, రెండు మనసులు కలిసే ఒక మరపురాని అందమైన జ్ఞాపకం. అది ఒక తంతులా అందంగా నిర్వహించే వేడుక. కాని నేడు మారుతున్న రోజులు, పరిణామాలను బట్టి అది ఒక వ్యాపారంగానే మారిపోయింది. సహజీవనానికి అలవాటు పడ్డ మనసులు అదీ కూడా కొన్ని రోజులకే పరిమితం కావడంతో ఎవ్వరికి ఎం చేయ్యాలో తోచడం లేదు. కొంతమంది న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం విదేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా పెళ్లిని కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌లుగా గుర్తించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటుందనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతోంది. దాని వల్ల సహజీవనం సమస్య, సహజీవనంలో గొడవల సమస్య కొంతమేరకు సద్దుమణుగుతుందని సామాజిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. భారతదేశం ఆనాది నుంచి సంప్రదాయమైన పెళ్లి అనే బంధాన్ని వీడి పాశ్చత్య మోజువైపు యువత పడిపోవడం వల్లనే వారి జీవితాలు నాశనం అవుతున్నాయని సంప్రదాయవాదులు అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here