దలాల్‌స్ట్రీట్‌ మళ్లీ బేర్‌మంది

0

ముంబయి: దలాల్‌స్ట్రీట్‌ మళ్లీ బేర్‌మంది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి. ఫలితంగా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 11,500 మార్క్‌ను కోల్పోయింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా సాగాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉన్నప్పటికీ బ్యాంకింగ్‌, ఐటీ రంగాల షేర్లు రాణించడంతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు వరకు లాభపడింది. నిఫ్టీ కూడా 11,600 పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఆరంభ లాభాలను క్రమంగా కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, టాటామోటార్స్‌ లాంటి దిగ్గజ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఫలితంగా చివరి గంటల్లో మార్కెట్లు భారీ నష్టాల్లోకి దిగజారాయి. నేటి మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 324 పాయింట్లు పతనమై 38,277 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 11,498 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.37గా కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here