Featuredప్రాంతీయ వార్తలు

వేటు సరైందే..

  • ఎన్నికల్లో పోటీచేయొచ్చు!!
  • ధర్మాసనం సంచలన తీర్పు
  • సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
  • కర్ణాటక సీఎం యడియూరప్ప
  • భాజపా కుట్ర బయటపడింది – కాంగ్రెస్‌

బెంగళూరు

కర్ణాటక రెబల్స్‌ ఎమ్మెల్యేల భవితవ్యంపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 17 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. కానీ, వారిని ఉప-ఎన్నికల్లో పోటీకి అనుమతించింది. ఈమేరకు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. అక్టోబర్‌ 25న ఈ అంశంపై విచారణ పూర్తిచేసిన ధర్మాసనం.. తీర్పును బుధవారం వెల్లడించింది. అసెంబ్లీ గడువు ముగిసే వరకూ ఓ ఎమ్మెల్యేను స్పీకర్‌ అనర్హుడిగా ప్రకటించలేరని తెలిపింది. అంటే అనర్హులు ఉప ఎన్నికలలో పోటీ చేయవచ్చని, నామినేషన్లు దాఖలు చేయవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఎమ్మెల్యేగా ఎన్నికైతే క్యాబినెట్‌లో మంత్రిగా చేరవచ్చని స్పష్టం చేసింది. అయితే, రెబల్‌ ఎమ్మెల్యేలు తమను నేరుగా ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టుకు వెళ్లకుండా తమ వద్దకు రావడం సమంజసంగా లేదని అభిప్రాయపడింది. వాస్తవాలు, కేసు యొక్క పరిస్థితులపై ఆధారపడి ఈ తీర్పును వెలువరించామని, స్పీకర్‌ అధికారంలో జోక్యం చేసుకోవడం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. శాసనసభలో రాజ్యాంగ బాధ్యత, నైతికత ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి వర్తిస్తుందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో రెబల్‌ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. మొత్తం 17స్థానాలకు ఉప-ఎన్నికలు డిసెంబరు 5న జరగనుండగా, ఈ రెబల్‌ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. ఏం జరిగిందంటే..!కర్ణాటకలో కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించారు. కాంగ్రెస్‌కు చెందిన 13 మంది, జేడీఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వారు తిరిగి ఉప-ఎన్నికల్లో పోటీచేయకుండా ప్రస్తుత శాసనసభ ముగిసేవరకూ అనర్హులుగా పేర్కొంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం 17మంది రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో ఆ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం 15చోట్ల ఉపఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరించింది. దీంతో సుప్రీం తీర్పు వచ్చేంతవరకు ఉపఎన్నికలను నిలిపివేయాలని సుప్రీంను రెబల్స్‌ కోరారు. ఈ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా ఈసీకి సుప్రీం సూచించగా.. ఎన్నికలను వాయిదా వేశారు. తాజాగా ప్రకటించిన తేదీల ప్రకారం.. డిసెంబర్‌ 5న పోలింగ్‌ నిర్వహించి, 9న ఫలితాలు వెల్లడిస్తారు. నేటి సుప్రీం తీర్పుతో రెబల్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం – కర్ణాటక సీఎం యడియూరప్ప :

కర్ణాటకలో అనర్హతవేటుకు గురైన వారికి ఊరట కల్పిస్తూ ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని సుప్రీకోర్టు తీర్పును ఇచ్చిన విషయం విధితమే. కాగా ఈ తీర్పును బీజేపీ స్వాగతించగా, కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మాత్రం భాజపా కుట్ర బయటపడిందని వాదించాయి. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు కర్ణాటక సీఎం యడియారప్ప అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సుప్రీంతీర్పుతో అప్పటి స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య కలిసి పన్నిన కుట్రను ఈ తీర్పును కోర్టు వ్యతిరేకించిన్లటైందన్నారు. అనర్హతకు వేటుకు గురైన 17మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అంశంపై పార్టీ నిర్ణయిస్తుందన్నారు.

భాజపా కుట్ర బయటపడింది

కాంగ్రెస్‌ కర్ణాటకలో అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భాజపా కుట్ర బయటపడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కోర్టు తీర్పుతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు అక్రమమని తేలిందన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి పార్టీ ఫిరాయించిన 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయడాన్ని కోర్టు సమర్థించింది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో భాజపా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్రమమని రుజువైందని, బలనిరూపణ కోసం భాజపా రాజ్యాంగవిరుద్ధ చర్యలకు పాల్పడిందని, వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కర్ణాటక పీసీపీ అధ్యక్షుడు దినేశ్‌ గుండురావు డిమాండ్‌ చేశారు. సుప్రీం తీర్పుతో నాటి ప్రభుత్వాన్ని భాజపా కూలదోయడానికి యత్నించినట్లు స్పష్టమైందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో యడ్యూరప్ప, అమిత్‌ షా హస్తముందని కూడా నిరూపితమైందన్నారు. నిజంగా భాజపా విలువలు పాటించే పార్టీయే అయితే ఈ 17మందికి తాజా ఉపఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ సీనియర్‌ నేత సిద్ధరామయ్య కూడా కోర్టు తీర్పుని స్వాగతించారు. ఇకపై పార్టీ ఫిరాయించే వారికి ఇది ఒక గుణపాఠం వంటిదన్నారు. ఈ ఉపఎన్నికల్లో భాజపా అన్ని స్థానాల్లో విజయం సాధించి తీరుతుందన్నారు. కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించిన విషయం తెలిసిందే. అయితే, 2023 వరకు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ ఇచ్చిన ఆదేశాలను మాత్రం కొట్టివేసింది. దీంతో త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశమిస్తూ ఊరట కల్పించింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close