పంజావిసురుతున్న చలిపులి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోవడమే గాకుండా చలిగాలులు విపరీతంగా పెరిగాయి. చలి తీవ్రత రాత్రివేళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. విశాఖ ఏజెన్సీని చలి వణికిస్తోంది. లంబసింగిలో అత్యల్పంగా జీరో డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరు 3 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మూడు డిగ్రీలకు ఉష్టోగ్రతలు పడిపోయింది. గడచిన 10ఏళ్లలో 2010 డిసెంబర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, పసి పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా సూర్యుడు ఉదయం 11 గంటల తర్వాతే దర్శనమిస్తుండటం గమనార్హం. ఈ చలి తీవ్రతకు స్వెట్టర్లు, గ్లౌజులు, మాస్క్‌లు, హీటర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. మరోవైపు శీతల గాలుల ఉద్ధృతి పెరగడంతో రాష్ట్ర ప్రజలు చలితో ఇబ్బందుల పాలవుతున్నారు. ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి రెండువైపులా శీతల గాలులు తెలంగాణవైపు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 6 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో 5, మెదక్‌లో 8, రామగుండంలో 8, హన్మకొండలో 10, హైదరాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం సాధారణంకన్నా తక్కువగా ఉంటున్నందున వేడి తగ్గింది. గాలిలో తేమ బాగా తగ్గడంతో పొడి వాతావరణం ఏర్పడుతోంది. రాత్రి చలి, పగలు పొడి వాతావరణం వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. మరో రెండురోజులు సైతం చలి ఇదే విధంగా కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు.

గజగజ వణుకుతున్న ఆదిలాబాద్‌… ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి భయానికి ప్రజలు గడపదాటాలంటే భయపడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. శీతల గాలులు వీచడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే రోజుల్లో ఈదురు గాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. బయట వెళ్లాల్సి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.రికార్డు స్థాయిలో ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి(టి)లో అత్యల్పంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది డిసెంబరు 27న నమోదైన 3.8 అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డును బ్రేక్‌ చేసినట్లయింది. ఆదిలాబాద్‌లో 4.4 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొగమంచు ఆవరించడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో లైట్లు వేసుకొని ముందుకు కదలాల్సిన పరిస్థితి నెలకొంది. కుమురం భీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. కశ్మీర్‌ను తలపిస్తున్న ఈ వాతావరణంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరులో శనివారం ఉదయం 5.3 డిగ్రీలుగా నమోదైంది. 30 ఏళ్లలో తొలిసారి ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంతగా తగ్గాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here