చల్లబడిన నగరం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మండుటెండలతో ప్రజలు విలవిలలాడు తున్నారు. ఠారెక్కిస్తోన్న ఎండలు, ఉక్కపొతతో అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు హైదరాబాద్‌లో పలు చోట్ల కురిసిన వర్షంతో ఉపశమనం కలిగింది. వాతావరణ చల్లబడటంతో ప్రజలు ఒక్కసారిగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. రోహిణి కార్తె ఎండలతో అల్లాడుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు శుభవార్తే అని చెప్పాలి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం శని, ఆదివారాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అసలే మాడు పగిలే ఎండలు .. ఉక్కపోతతో విసిగిపోతున్న జనాలకు ఊరట కలిగించిన విషయమిది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో ఎండలకు జనాలు పిట్టల్లా రాలిపోయారు. జగిత్యాల జిల్లాలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవడంతో 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పలు సూచనలు కూడా చేశారు. భాగ్యనగరంలో మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుండి తప్పించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులతో పాటు చిరుజల్లులు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం బాగానే కురిసింది. జూభ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, సికింద్రబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు వడగాల్పుల నుంచి ఉపశమనం పొందారు. తెలంగాణలో నేటి నుంచి మరో రెండురోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here