Featured

ధిక్కారం…!

(పి.ఎన్‌.రావు, ఆదాబ్‌ ప్రత్యేక ప్రతినిధి)

  • తెలంగాణ ఉన్నత విద్యా మండలి షోకాజ్‌ నోటీసులు బేఖాతర్‌…
  • ఆంధ్ర ప్రాంత దూర విద్యతో తమకు సంబంధం లేదంటూనే స్టడీ సెంటర్ల కొనసాగింపు…
  • యథేచ్ఛగా గీతం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీల దూర విద్య పరీక్ష కేంద్రాల నిర్వహణ…
  • లక్షల్లో వసూళ్ల దందా… తెల్సినా తెలియనట్లు నటిస్తున్న విద్యా మండలి, యూనివర్సిటీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆచార్య నాగార్జున మరియు గీతం యూనివర్సిటీ లు నిర్వహిస్తున్న దూర విద్య సర్టిఫికెట్లకు మన రాష్ట్రంలో చెల్లుబాటు లేదని పేర్కొంటూ గతంలోనే తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి బహిరంగ ప్రకటనలు చేసిన విషయం విధితమే. అయితే ఈ ప్రకటనలకు చట్టబద్ధత లేదని, ఆంధ్ర ప్రదేశ్‌ రీ ఆర్గనైజేషన్‌ చట్టం -2014 లో ఉన్న పార్లమెంటరీ గజిట్‌ లోనే స్పష్టంగా 2024 వరకు పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న అన్ని యూనివర్సిటీల దూర విద్యా విధానం ద్వారా అందిస్తున్న సర్టిఫికెట్లు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సమానమైన విలువ కలిగి ఉంటాయని సంబంధిత అధికారిక గజిట్‌ లో పేర్కొన్నట్లు తెలంగాణలోని ఆయా డిగ్రీ కళాశాల అన్యాయాలు అంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆచార్య నాగార్జున మరియు గీతం తదితర యూనివర్సిటీలు దూర విద్య స్టడీ సెంటర్లు కానీ పరీక్ష కేంద్రాలు తెలంగాణలో ఎక్కడ కూడా నడవదని తెలంగాణ ఉన్నత విద్యా మండలి సెక్రెటరీ ఎన్‌. శ్రీనివాసరావు తమ పరిధిలోని అన్ని యూనివర్సిటీలకు గడిచిన ఆగస్టు 3.వ తారీఖున ఆదేశాలు జారీ చేసినారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల రిజిస్టార్లు తమ పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ ఇతర టెక్నికల్‌ కళాశాలల యాజమాన్యాలకు ఈ విషయమై ఎవరు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన యూనివర్సిటీల దూర విద్యా కేంద్రాలు కానీ పరీక్ష కేంద్రాలు నడపడానికి వీలు లేదని పేర్కొంటూ అన్ని కళాశాలలకు గడిచిన 2 నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఈ నోటీసులు బేఖాతరు చేస్తూ, రాష్ట్రంలోని పలు డిగ్రీ, కళాశాలలు ప్రస్తుతం ఆచార్య నాగార్జున మరియు గీతం యూనివర్సిటీ ల దూరవిద్య పరీక్ష కేంద్రాలను యదేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మరికొంతమంది ఈ దూరవిద్యా స్టడీ సెంటర్లు రహస్యంగా కొనసాగిస్తూనే, తెలంగాణ ఉన్నత విద్యా మండలి, సంబంధిత తమ యూనివర్సిటీల ఆదేశాలను దిక్కరించినట్లు కనబడకుండా తెలివిగా సంబంధిత ఆంధ్ర యూనివర్సిటీలతో కుమ్మక్కై, తెలంగాణలో ఉన్న డిగ్రీ, పీజీ కళాశాలల్లో కాకుండా జూనియర్‌, బీఈడీ, బిజినెస్‌ తదితర కళాశాలల్లో ప్రస్తుతం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూనియర్‌ కళాశాలలు యూనివర్సిటీల పరిధిలోకి రావు. అవి ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ పరిధిలో ఉంటాయి కాబట్టి ఉన్నత విద్యా మండలి, తమ యూనివర్సిటీలు పెద్దగా చేసేది ఏమి ఉండదని వీళ్ళ అభిప్రాయం కావచ్చు.తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీలు మరియు డిగ్రీ, పీజీ కళాశాల దూరవిద్య పరీక్ష కేంద్రాల పంచాయితీ పక్కన పెడితే..!

డబ్బులు ఇచ్చుకో… పరీక్ష రాసుకో…

ప్రస్తుతం ఆచార్య నాగార్జున, గీతం యూనివర్సిటీల దూరవిద్య పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తే, హైదరాబాదు ప్రాంతంలో ఒక్కో విద్యార్థి నుండి ఒక సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జిల్లా కేంద్రాల్లో నడుస్తున్న పరీక్షా కేంద్రాల్లో అయితే గుండు ఉత్తగా ఒక్కో విద్యార్థి నుండి మూడు నుండి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన ఏ యూనివర్సిటీ దూర విద్య విధానానికి చెందిన స్టడీ సెంటర్లు, పరీక్ష కేంద్రాలు నిర్వహించినట్లు తమ దృష్టికి వస్తే, సంబంధిత కళాశాలలకు గుర్తింపును రద్దు చేయనున్నట్లు ఆయా యూనివర్సిటీల రిజిస్టార్లు తెలియజేశారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఆచార్య నాగార్జున, గీతం యూనివర్సిటీ ల దూరవిద్య పరీక్ష కేంద్రాల వివరాలు మొత్తం సంబంధిత అనుబంధ యూనివర్సిటీలకు పూర్తి సమాచారం ఉన్నప్పటికీ, అవేమీ తమకు తెలియనట్లు నటించడం హాస్యాస్పదం.

ఈ పరీక్షల నిర్వహణ విషయంలో పలు యూనివర్సిటీలు అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బు అందుతున్నందునా ఎవరు కూడా చడీ చప్పుడు కాకుండా జాగ్రత్త పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీలు నిర్వహిస్తున్న దూర విద్యా విధానానికి సంబంధించిన స్టడీ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏయే కళాశాలలు అధికారికంగా నిర్వహిస్తున్నాయో సదరు యూనివర్సిటీల అధికారిక వెబ్‌ సైట్లో సంబంధిత కళాశాల సెంటర్‌ కోడ్‌ నెంబర్‌తో సహా పొందు పర్చినారు. అయినప్పటికీ ఇవేమీ తమ దృష్టికి రాలేదని ఆయా యూనివర్సిటీ అధికారులు నాటకాలు ఆడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళాశాలలకు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి దూర విద్య యూనివర్సిటీల స్టడీ సెంటర్లు కేటాయించాలని భావిస్తే, ముందస్తుగా సంబంధిత ఇక్కడి యూనివర్సిటీల అనుమతులు పొందవలసి ఉంటుందని తాము ముందే ఆంధ్ర యూనివర్సిటీలా అధికారులకు తెలియజేసినట్లు ఇక్కడి పలు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close