మరిన్ని దాడులకు కుట్ర?

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): పుల్వామా ఆత్మాహుతి దాడి తరహా ఘటనలకు పాకిస్తాన్‌ తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ప్లాన్‌ చేసిందా..? దేశంలో మరిన్న ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందా అంటే అవునంటున్నాయి కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు. పుల్వామా దాడి తర్వాత ఈ నెల 16, 17 తేదీల్లో పాకిస్థాన్‌ దేశంలోని జైషే మహ్మద్‌ నాయకులు, కశ్మీర్‌ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారని, ఆ సంభాషణలో జమ్మూ లేదంటే జమ్మూ కశ్మీర్‌ బయటి ప్రాంతంలో ఎదో ఒకచోట భారత జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్‌ కు సమాచారం అందింది దీంతో ఇంటలిజెన్స్‌ అధికారులు మన భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.పుల్వామాలాంటి దాడులు మరిన్ని చేయడానికి జైషే మహ్మద్‌ ప్లాన్‌ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించడంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. తాన్‌జీమ్‌ అనే ఓ చిన్న ఉగ్రవాద గ్రూపు ద్వారా ఈ సమాచారం వెల్లడైంది. జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌లు లక్ష్యంగా ఈ దాడులు జరగనున్నట్లు హెచ్చరించాయి. ఈసారి చౌకీబల్‌, తాంగ్‌ధర్‌ రూట్లలో ఈ దాడులు జరగనున్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. ఈ రూట్లలో ఐఈడీ దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. దీనికోసం తాన్‌జీమ్‌ ఓ ఆకుపచ్చ రంగు స్కార్పియోను సిద్ధం చేసిందని, దాని ద్వారా ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. జైషే మహ్మద్‌కు చెందిన ఓ సోషల్‌ విూడియా గ్రూప్‌లోని కోడ్‌ను నిఘా వర్గాలు ఛేదించాయి. పుల్వామాలో 300 కిలోల ఆర్డీఎక్స్‌తో జరిగిన దాడి ఓ ఆటబొమ్మలాంటిదని, 500 కిలోల పేలుడుకు సిద్ధంగా ఉండండి అని ఆ సందేశంలో రాసి ఉండటం గమనార్హం. కశ్మీరీలను లక్ష్యంగా చేసుకోవడం భద్రతా బలగాలు మానుకోవాలని ఆ ఉగ్రవాద గ్రూపులు హెచ్చరించాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని కూడా చెప్పడం విశేషం. ఈ సందేశం నేపథ్యంలో సరిహద్దులో చొరబాట్లు కూడా పెరిగే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమ వుతున్నది. గురెజ్‌ ప్రాంతంలో వివిధ చోట్ల నుంచి ఐదారుగురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కశ్మీర్‌ లోయలోని ఉగ్రవాదులు పాక్‌ తీవ్రవాద నాయకులతో ఫోన్‌ లో మంతనాలు జరిపిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటలిజెన్స్‌ హెచ్చరికలతో జమ్మూతోపాటు ఇతర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here