– టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ గర్జన

0

అసెంబ్లీ ముందు సీనియర్ల ఆందోళన

  • గాంధీ విగ్రహం ముందు బైఠాయింపు
  • ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ఖూనీ చేస్తున్నారు
  • టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
  • ప్రధాన ప్రతిపక్షంగా ఎంఐఎం పార్టీ

హైదరాబాద్‌ :

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. గురువారం కాంగ్రెస్‌ కు చెందిన 12మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి.. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని వినతిపత్రం అందజేశారు. దీనికి నిరసనగా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్‌రావులు అసెంబ్లీ ఆవరణంలో నిరసనకు దిగారు. నోటికి నల్లగుడ్డలు కట్టుకొని అసెంబ్లీ ఆవరణలోని రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. అనైతికమని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొంటోందని ఆరోపించారు. అధికార పార్టీ నిసిగ్గుగా, నిర్లజ్జగా తమ ఎమ్మెల్యేలను కొంటోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల తీర్పును కేసీఆర్‌ అవమానపరిచారని, ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్‌ తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని, అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్రగా వెళతామని ఉత్తమ్‌కుమార్‌ తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.

తమ పార్టీ గుర్తుపై గెలుపొంది తాజాగా సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలని కోరుతున్న ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటువేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. తెరాస నేతలను కలిసినట్టు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, వీడియో క్లిప్పింగ్‌లను గతంలో స్పీకర్‌కు ఇచ్చినా అనర్హత వేటుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రోజు విలీన పక్రియకు సంబంధించి మాత్రం శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

సభాపతి తీరుపై ఉత్తమ్‌ ఆగ్రహం…

మరోవైపు, సీఎల్పీ విలీనం పక్రియ నేపథ్యంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కార్యాలయానికి ఉత్తమ్‌ ఫోన్‌ చేశారు. ఆయన అందుబాటులో లేరని కార్యాలయ సిబ్బంది చెప్పారు. దీంతో సభాపతి తీరుపై ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను సభాపతి ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము కలిసేందుకు సభాపతి సమయం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. హైకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా విలీనంపై స్పీకర్‌ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్‌ ప్రశ్నించారు. 

ప్రధాన ప్రతిపక్షంగా ఎంఐఎం పార్టీ

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌ లో జాయిన్‌ అయ్యారు. కాంగ్రెస్‌ ఎల్పీని విలీనం చేయాలి అంటూ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ ఇచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వటంతో.. టీఆర్‌ఎస్‌ పార్టీలో విలీనం కావటం లాంఛనం అవుతుంది. ఈ పరిణామంతో అసెంబ్లీలో ప్రతిపక్ష ¬దా కోల్పోనున్నది కాంగ్రెస్‌. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ఎల్పీ విలీనం చేస్తుండటంతో.. మిగిలింది ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కంటే.. ఎంఐఎం పార్టీకే ఎక్కువ మంది సభ్యులు అసెంబ్లీలో ఉండనున్నారు. ఏడుగురు సభ్యులు ఆ పార్టీ నుంచి అసెంబ్లీలో ఉన్నారు. మెజార్టీ ప్రకారం ఎంఐఎం ప్రదాన ప్రతిపక్షంగా ఉండబోతున్నది. మొదటిసారి కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష ¬దాను కోల్పోతున్నది. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్లు స్పందించారు. న్యాయపోరాటం చేస్తాం అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 91. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 19గా ఉంది. వీరిలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ఎల్పీని విలీనం చేస్తూ స్పీకర్‌ కు లేఖ రాశారు. అంటే కాంగ్రెస్‌ లో మిగిలింది ఏడుగురు ఎమ్మెల్యేలు. ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ వాస్తవ బలం ఆరుకి పడిపోయింది. ఎంఐఎం సభ్యులు ఏడుగురు ఉన్నారు. ఈ లెక్కలతో తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here