కాంగ్రెస్‌ కోటకు ‘కమ్మ’ని బీటలు

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు చౌదరి, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఏ కుల ఉచ్చు బిగించి ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందో… అదే ఉచ్చులో కాంగ్రెస్‌ పార్టీ విలవిల లాడబోతోంది. పోటీకి ముందే పాతిక సీట్లను తెరాసకు బంగారు పళ్ళెంలో అందించ బోతుందని తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ లో అన్యాయం జరగబోతుందని, గులాబీ దళపతి ఎన్ని’కుల’ వ్యూహంతో ముందకెళుతున్నారని ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ముందే చెప్పింది. అదే నేడు నిజమైంది. ఎన్ని’కుల’ పోరాటంలో కేసీఆర్‌ ఘనవిజయం సాధించారు. తెరాసకు ధీటుగా సీట్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ పూర్తిగా మొండిచేయి ఊపుతోంది. ఇప్పటికే ఓ సామాజిక వర్గం ఆధిపత్యంతో సీట్లు అమ్ముకున్నారనే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో సుమారు16 ఏళ్ళు పరిపాలించినముగ్గురు ముఖ్యమంత్రులు ఈ సామాజిక వర్గం వారే. కానీ ఈసారికి మాత్రం కనీసం ఒక్కసీటుకు కూడా రాజకీయ రంగస్థలంపై దిక్కు లేక దీనంగా.. బేలగా.. నేల చూపులు చూస్తోంది. మరి వారిలో నాయకులు లేరా..? వారిలో ఆవేశం లేదా.. అంతగా చేవ చచ్చి పోయారా..? లేక శ్రీక ష్ణ దేవరాయలు లాగా ధీరత్వాన్ని ప్రదర్శిస్తారా..? అన్నది కమ్మటి సవాల్‌. ఇదీ మరీ అన్యాయం: 94 సీట్లలో ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో 75మందిలో.. కనీసం ఒక్కసీటూ కూడా కమ్మ సామాజిక వర్గానికి దక్కలేదు. మిగిలిన సీట్లలో దక్కే అవకాశం లేదు. దీంతో ఆ సామాజిక వర్గ నేతలు కొందరు బహాటంగానే టిపీసీసీపై నిప్పులు కురిపిస్తున్నారు. ఇంకొందరు ఏకంగా ‘కుట్ర చేసిన కాంగ్రెస్‌ నాయకులను’ ఓడించడానికి రెడీ అవుతున్నారు. అవసరాన్ని బట్టి ప్రత్యర్థి పార్టీలకు ఆర్థిక సహాయానికి కూడా సిద్దమౌతున్నారు. తెరాస ప్రకటించిన జాబితాలో 35 టికెట్లు రెడ్లకుఒక వైశ్య, ఒక బ్రాహ్మణ, ఒక రాజపుత్‌ లకు ఇచ్చారు. బీసీలకు 20, బీసీల్లో ఓసీలుగా భావించే మున్నూరు కాపులకు అందులో 6 సీట్లు, ఆ మిగతా 14 సీట్లను కూడా సామాజికంగా, ఆర్థికంగా కొంత ఎదిగిన గౌడ, యాదవ, ముదిరాజ్‌, పద్మశాలి, విశ్వబ్రాహ్మణులకు దక్కాయి. మిగతా సీట్ల విషయానికొస్తే మాదిగ 8, మాల 7 సీట్లు%ౌౌ% నిజానికి తెలంగాణలో మాల లకన్నా మాదిగలు ఎక్కువ. ఆదివాసీ, లంబాడా సీట్లకొస్తే కోయ 5, బంజారాలకు 7, ముస్లింలకు 2 సీట్లు కేటాయింపు జరిగింది.

‘కమ్మ’ని వాసనలతో గులాబీ: ఆరుగురు కమ్మ సామాజిక వర్గానికి కేసీఆర్‌ సీట్లు ఇచ్చారు. అరెకెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), పువ్వాడ అజయ్‌ కుమార్‌ (ఖమ్మం), తుమ్మల నాగేశ్వరరావు (పాలేరు), మాగంటి గోపినాథ్‌ ( జూబ్లీహిల్స్‌), నల్లమోతు భాస్కరావు (మిర్యాలగూడ), కోనేరు కోనప్ప (సిర్పూర్‌)లకు సీట్లను గులాబీ దళపతి తొలి జాబితాలో ప్రకటించి తన ఎన్ని’కుల’ వ్యూహాన్ని చాలా తెలివిగా అమలు చేశారు.

‘కమ్మ’ని ప్రభావం ఎక్కడెక్కడ..: తెలంగాణ నియోజకవర్గాలలో 7 నుంచి 8శాతం ఓటు బ్యాంకు కమ్మ సామాజిక వర్గం కలిగిఉంది. 29 నియోజకవర్గాలను ఈ సామాజిక వర్గం నేరుగా ప్రభావితం చేస్తోంది. మరో 12 నియోజకవర్గాలలో పరోక్షంగా ప్రభావం చూపుతుంది. ఈ ‘కమ్మ’ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు గులాబీ నేత వేసిన ‘వ్యూహాత్మక గాలం’ ఎవ్వరూ ఊహించనిది. ఈ తీరు పరిశీలిస్తే ఇతర పార్టీలకు దిమ్మ తిరుగుతుంది.

గులాబీ వ్యూహం ఇలా..: గులాబీ అధినేత మౌఖిక ఆదేశాల మేరకు సామాజిక వర్గం ప్రభావితం చేస్తున్న పరిశ్రమలు, విద్య, వైద్య, సినిమా, మీడియా అధినేతలతో తొమ్మిది నెలల క్రితం వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి విభాగం నుంచి ఐదు సంస్థల ప్రతినిధులు, లేదా ఐదుగురు ప్రతినిధులు హాజరయ్యారు. గులాబీ నేత పకడ్బందీగా ప్రతి విభాగానికి ‘కారు’లో ప్రయాణించే తన వారికి బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమల విభాగం ఓ భాస్కరుడు, వైద్య కళాశాల ఉన్న ఓ శాసనసభ్యుడికి వైద్య విభాగం, సినిమా పరిశ్రమ బాధ్యతలను ఆ నేపథ్యం కలిగిన శాసన సభ్యుడికి, మీడియా విభాగం వార్త, భక్తి ప్రసారాల నేపథ్యం కలిగిన వ్యక్తికి అప్పగించారు. ఈ వ్యవహారం ‘రోడ్డు’ మీద సాఫీగా సాగడానికి, అందరినీ సమన్వయం చేసే ‘రహదారి’ బాధ్యత తాజా మాజీమంత్రికి అప్పగించారు.

ఒకే వర్గం వారిదే పెత్తనంపై రేణు మండిపాటు

పరోక్షంగా రెడ్డివర్గంపై ఫైర్‌

ఖమ్మం (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఖమ్మం జిల్లాలో స్థానిక నేతలను సంప్రదించకుండా… వారి ఇష్టానుసారం టికెట్లు ఇచ్చారని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి మరోమారు రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలపై నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం రెండు శాతం జనాభా మాత్రమే ఉన్న ఒక సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు రావడం శోచనీయమన్నారు. బీసీలు రాష్ట్ర బంద్‌ కు పిలుపు నిచ్చారని, విద్యార్థులు కూడా అసంతఅప్తితో ఉన్నారని… దీనికంతా ఎవరు కారణమని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు పలువురు కార్యకర్తలు భావిస్తున్నారని తెలిపారు. తాను పోటీ చేయాలనుకుంటే తనకు సీటును ఇవ్వలేమని చెప్పే సత్తా ఎవరికీ లేదని, బలమైన కమ్మ సామాజిక వర్గానికి ఏ ధైర్యంతో టికెట్‌ ఇవ్వలేదని రేణుక మండిపడ్డారు. టికెట్లు పొందిన ఇతర సామాజికవర్గ నేతలంతా సరైనవారా,

బలమైనవారా అని ప్రశ్నించారు. మిగిలిన కులాల వారంతా

గెలిచేవారేనా అని దుయ్యబట్టారు. కమ్మ ఓట్లు విూకు అవసరం లేదా, ఒక సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకుని, రాజ్యాన్ని ఏలుదామనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమసమాజం అనేది కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీల సిద్ధాంతమని… సిద్ధాంతానికి విరుద్ధంగా రాష్ట్ర నేతలు వ్యవహరించారని రేణుక దుయ్యబట్టారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చకూడదనే తాను ఆవేదనను దిగమింగుకుంటున్నానన్నారు. రేపటి ఫలితాలు వ్యతిరేకంగా వస్తే… దీనికి కారణమైన నేతలంతా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందేనని మండిపడ్డారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఉపేక్షించబోనని… కార్యకర్తలతో మాట్లాడి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here