Featuredరాజకీయ వార్తలు

నేడు కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ పార్టీ రెండవ జాబితా విడుదల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయగా, మరికొందరు ఇండిపెండెంట్‌లుగా రంగంలోకి దిగుతున్నారు.. దీంతో మహాకూటమిలో ఆందోళన నెలకొంది.. ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్‌ .. శనివారం మూడవ జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న స్థానాలకు టికెట్‌ ఆశిస్తున్న పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. వీరిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘవీర్‌, అద్దంకి దయాకర్‌లతో పాటు ఇల్లందు, తుంగతుర్తి, హుజురాబాద్‌, మిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్న పలువురు నాయకులు ఉన్నారు. రాహుల్‌ వీరితో పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పోటీకి దిగవద్దని రాహుల్‌ వారికి సూచించారు. టికెట్‌ ఎవరికిచ్చినా పార్టీ కోసం పనిచేయాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే అందరికీ తగిన విధంగా గుర్తింపు కల్పిస్తామని, అందరూ ఐక్యంగా కూటమి అభ్యర్ధుల గెలుపుకు కృషి చేయాలని రాహుల్‌ వారికి సూచించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే రెండు జాబితాల్లో 75 స్థానాలకు టికెట్లను ప్రకటించిన కాంగ్రెస్‌.. శనివారం మిగతా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ ఆర్సీ కుంతియా మాట్లాడుతూ.. ‘ఆదిలాబాద్‌, ఖమ్మం జిలాల్ల అభ్యర్థులతో రాహుల్‌ గాంధీ మాట్లాడారని అన్నారు. గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు ఇవ్వనున్నట్టు రాహుల్‌ తెలిపారు. ఇల్లందు, తుంగతుర్తి, హుజురాబాద్‌, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సంబంధించి రాహుల్‌ అందరి అభిప్రాయాలు తీసుకున్నారని తెలిపారు. గెలిచే అవకాశాలు, అక్కడి స్థానిక పరిస్థితుల గురించి నాయకులతో చర్చించారు. శనివారం మిగతా స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కుతింయా తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close