కాకలు పడుతున్న కాంగ్రెస్‌ ఖాళీగా ఉన్న బీజేపీ

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశవ్యాప్తంగా పూలు వికసిస్తున్నాయి. మొన్నటి వరకూ తెలంగాణలో పువ్వులు పుష్పించాయి. కానీ మొన్న అసెంబ్లీ పోరులో మాత్రం, పువ్వులన్నీ నలిగిపోయాయి. అందుకే బయటకు రావడానికి భయపడుతున్నాయ్‌. తరుముకొస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి, పువ్వు గుర్తు పార్టీకి, గెలుపు గుర్రాలు కరువయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. పలు రాష్ట్రాల్లోనూ పవర్‌లో ఉంది. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. మోడీ, అమిత్‌ షాలు ప్రచారం కూడా మొదలుపెట్టారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమకు అనుకూలమైన వాతావరణం ఉందని అంటున్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి నిలిచే, పెద్ద నేతలు ఎవరూ కనిపించడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే కనీసం ప్రభావం చూపెట్టే నేతలు కూడా వెతికినా దొరికే పరిస్థితి లేదు. 17 స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నా, బీజేపీకి ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే అంతోఇంతో ప్రభావం చూపెట్టే వ్యక్తులు పోటీలో ఉండే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో ప్రస్తుతానికి ఆ స్థాయి నేతలు లేరనే అభిప్రాయం పార్టీలోనే వ్యక్తమవుతోంది. 2009లో అన్ని స్థానాలకు పోటీ చేసిన బీజేపీ, చాలా స్థానాల్లో నామ్‌కే వాస్తే అభ్యర్థులకు టికెట్స్‌ ఇచ్చింది. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ, మంచి అభ్యర్థులనే బరిలోకి దించింది. ఈసారి మాత్రం అలాలేదు. 2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన నాగం జనార్దన్‌ రెడ్డి, నరేంద్రనాథ్‌లు పార్టీని వీడారు. విద్యాసాగర్‌ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా వెళ్లారు. ఈసారి ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కొత్త ముఖాలే బరిలోకి దిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఫలితాల దెబ్బతో, ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల్లో పార్లమెంట్‌కి పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్న వారెవరూ పెద్దగా లేరు. పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉన్న లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఒకరిద్దరు ఆసక్తి చూపుతున్నా, మిగతా స్థానాల్లో మాత్రం మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూశాక అమ్మో అంటున్నారు.

టీకాంగ్రెస్‌లో డిన్నర్ల హడావిడి…

తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు తెగ డిన్నర్లు చేసుకుంటున్నారంట. ఎందుకో తెలుసా..? మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలిచినందుకు కాదు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు సంపాదించేందుకు. సీఎల్పీ నేతకు అధిష్టానం వద్ద పలుకుపడి ఉందని ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్యనేతల మెప్పుకోసం వరుసగా డిన్నర్లు ఇచ్చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పార్లమెంటు టిక్కెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పోటీపడుతున్నారు. గతంలో అధిష్టానం వద్ద పైరవీలు చేసుకునే ఆనవాయితీ ఉన్న హస్తం నేతలు ఇప్పుడు రాష్ట్ర పార్టీ నేతలను కాకాపడుతున్నారు. నేతల మెప్పు పొందుతే తమకు సీటు ఖాయమన్న ఉద్దేశంతో వరుసగా డిన్నర్లు ప్లాన్‌ చేస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మెప్పుకోసం నేతలు తెగ పోటీపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హైకమాండ్‌ వద్ద పలుకుబడి తగ్గిందని పార్టీలో జోరుగా చర్చజరగడం, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన్ను మార్చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో భట్టివిక్రమార్కకు పార్టీలో డిమాండ్‌ పెరిగింది. దీంతో ఎంపీ టిక్కెట్టు ఆశిస్తున్న వారంతా భట్టివిక్రమార్క మన్ననలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా డిన్నర్ల బ్యాచ్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారే అధికంగా ఉన్నారు. జడ్చర్లలో పోటీ చేసి ఓడిపోయిన మల్లు రవి ఇప్పుడు నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ టిక్కెట్టును ఆశిస్తున్నారు. దీంతో ఆయన తన నివాసంలోనే పార్టీ నేతలందరికీ డిన్నర్‌ ఇచ్చేశారు. ఇక కరీంనగర్‌ టిక్కెట్టు ఆశిస్తున్న పొన్నం ప్రభాకర్‌ కూడా భట్టివిక్రమార్కతోపాటు ముఖ్యనేతలందరికీ డిన్నర్‌ ఇచ్చి తనకు అవకాశం కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు చేవెళ్ల పార్లమెంటు టిక్కెట్టు ఆశిస్తున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నిజాం క్లబ్‌లో పార్టీ ముఖ్యనేతలకు దావత్‌ ఇచ్చారు. అలాగే, భువనగిరి ఎంపీ టిక్కెట్టు ఆశిస్తున్న పార్టీ ట్రెజరర్‌ గూడూరు నారాయణరెడ్డి భట్టివిక్రమార్క కోసం డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఇలా పార్టీలో ఎంపీ టిక్కెట్లు ఆశిస్తున్న నేతలంతా భట్టివిక్రమార్క ప్రసన్నం కోసం తహతహలాడుతున్నారు. మరి ఇలా ఎంతమంది భట్టి ఆశీస్సులతో పార్టీ టిక్కెట్లు పొందుతారో చూడాలి.

నేడు ఉదయం సిఎల్పీ భేటీ.. అసెంబ్లీ సమావేశాలపై చర్చ

శుక్రవారం ఉదయం 9.30కి తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఈ సమావేశంలో ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధరపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే బ్జడెట్‌ సమావేశాలు 10 రోజులు జరిగేలా చూడాలని డిమాండ్‌ చేస్తామని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు చేసేలా బడ్జెట్‌ ఉండాలని కోరారు. ప్రజల గొంతు వినిపించాలంటే ప్రతిపక్షం అవసరమని అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here