మన్మోహన్‌ గౌరవాన్ని కాపాడలేకపోయిన కాంగ్రెస్‌..!

0

కేంద్ర ఆర్థికమంత్రిగా సంస్కరణలకు తెరతీసిన నేత మన్మోహన్‌ సింగ్‌. రెండు సార్లు ప్రధానిగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి. ఆయన గౌరవాన్ని కాంగ్రెస్‌ పార్టీ కాపాడలేకపోయింది. ఆయన మరో సారి రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయింది. జూన్‌ 14న మన్మోహన్‌ రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయనను మళ్లీ నామినేట్‌ చేయలేకపోయింది. ఇప్పటి వరకూ ఆయన అసోం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. అక్కడ రాజ్యసభ సభ్యుడిని గెలిపించుకోలేనంతగా? కాంగ్రెస్‌ ఓడిపోయింది. అసోంలో కాంగ్రెస్‌ పార్టీకి 25 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. దాంతో ప్రత్యామ్నాయం చూడాల్సి వచ్చింది. ఎలాగైనా మన్మోహన్‌ ను.. రాజ్యసభకు పంపే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ డీఎంకే సాయం కోరింది. ద్వైవార్షిక ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఆరు స్థానాలు భర్తీ చేయబోతుండగా, అందులో మూడు స్థానాలు డీఎంకే కైవసం చేసుకునే వీలుందని,అందులో ఒకటి మన్మోహన్‌ సింగ్‌కు కేటాయించాలని.. కాంగ్రెస్‌ కోరింది. మన్మోహన్‌కు? డీఎంకే గౌరవం ఇస్తుందని.. కాంగ్రెస్‌ భావించింది. రెండు పార్టీల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఒక అవకాశం వస్తుందని ఎదురు చూశారు. అయితే వాస్తవ పరిస్తితి అందుకు విరుద్ధంగా తయారైంది. కాంగ్రెస్‌ పార్టీకి ఒక రాజ్యసభ సీటును వదులుకునేందుకు డీఎంకే సిద్ధంగా లేదని తేలిపోయింది. డీఎంకే ఫ్రంట్‌ పోటీ చేయబోయే మూడు స్థానాల్లో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మూడో స్థానాన్ని వైగో నేతృత్వంలోని ఎండిఎంకేకు కేటాయించారు. లోక్‌ సభ ఎన్నికల పొత్తులో భాగంగా ఎండిఎంకేకు రాజ్యసభ సీటు వదిలేస్తామని స్టాలిన్‌ ముందే హావిూ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం ఒక రాజ్యసభ సీటును వదులుకునే అవకాశం లేదని డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. రెండు పార్టీల మధ్య అలాంటి చర్చే జరగలేదని, అది విూడియా సృష్టేనని డీఎంకే సీనియర్‌ నేతలు చెబుతున్నారు. మన్మోహన్‌ వ్యవహారంలో ఇరు పార్టీల మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. తాము ఎలాంటి ప్రతిపాదనా చేయలేదని, డీఎంకే ఎలాంటి తిరస్కారమూ చేయలేదని వెల్లడించి పరువు కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికి ఏం చేయలేమని.. రాజస్థాన్‌ లేదా మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు మన్మోహన్‌ సింగ్‌ను అక్కడ నుంచి గెలిపించుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు లైట్‌ తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here