కాంగ్రెస్‌లో కలకలం

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు) న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌

ఎట్టకేలకు కాంగ్రెస్‌ పరువు బజారున పడింది. ఎప్పటిలాగే సీట్లు అమ్మకోవడం జరిగింది. కొన్నిచోట్ల సమాజిక న్యాయం జరగలేదని కొందరు బరిలోకి దిగుతున్నారు. మరికొందరు మరోపార్టీలోకి జంప్‌ చేసి సీట్లు సంపాదించారు. ఇక హైదరాబాద్‌ మేయర్‌ గా పనిచేసిన బండ కార్తీకరెడ్డి ఏకంగా రాహుల్‌ గాంధీ ఇంటి ఎదుటే దర్నాకు దిగారు. మరొకరు భక్త చరణ్‌ దాస్‌ మూడు కోట్లు తీసుకున్న ఆడియో విడుదల చేశారు. వరంగల్‌ లో ఏకంగా డిసీసీ అధ్యక్షుడు రెబల్‌ గా నామినేషన్‌. వెరసి గెలుపుతీరాలలో ఉన్న పార్టీని పట్టుభట్టి మరీ నిలువునా ముంచడానికి రంగం సిద్దమైంది.

సీటు కోసం రూ.3కోట్లు:

తెలంగాణలో కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపుపై రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ కోసం కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్దాస్‌ తనను రూ.3కోట్లు డిమాండ్‌ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించిన వీడియో టేపులను విడుదల చేశారు. ఆయన సుపుత్రుడు హైదరాబాద్‌ లో పాగా వేయడంపై ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ కథనం అందించింది. అది ఇప్పుడు బట్టబయలైంది.

సబిత తనయుడు గుడ్‌ బై..:

రాజేంద్రనగర్‌ టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్‌ రెడ్డి ప్రకటించారు. మహాకూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్‌ స్థానం తెదేపాకు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ స్థానం నుంచి తెదేపా నుంచి గణేశ్‌ గుప్తా బరిలో ఉన్నారు. దీంతో ఎప్పటినుంచో ఆ టికెట్‌ ఆశిస్తున్న కార్తీక్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్‌ తమకు బీఫాం ఇస్తే రాజీనామాలను ఆమోదించనట్టు అని.. ఒకవేళ ఇవ్వకపోతే తమ రాజీనామాలను ఆమోదించినట్టేనన్నారు.

‘ఆదాబ్‌ హైదరాబాద్‌’తో మాట్లాడుతూ ఈ నెల 19లోపు తనకు బీఫాం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి ఉంటానని చెప్పారు.

రాహుల్‌ ఇంట ‘బండ’ ధర్నా:

హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి దిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసం వద్ద నిరసనకు దిగారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్‌ కేటాయించకపోవడంపై అసంతృప్తికి గురైన ఆమె ధర్నాకు దిగారు. దీంతో ఈ రోజు కొత్తగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన కుసుం కుమార్‌ ఆమెతో చర్చలు జరుపారు. బండ కార్తీక ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థుల పరిశీలను వెళ్ళింది. చివరకు ఆమెకు కాంగ్రెస్‌ ‘మెండి చేయి’ చూపింది. అయితే అల్వాల్‌, తదితర ప్రాంతాల్లో భూ వివాదాల గురించి ఏఐసిసికి లిఖితపూర్వకంగా పిర్యాదు అందటంతో ఆమెకు టికెట్‌ దక్కలేదని తెలిసింది.

పటేల్‌ షాక్‌:

నిజామాబాద్‌ జిల్లా, ముధోల్‌ నియోజకవర్గ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్కు టికెట్‌ రాకపోవడంతో ఆయన గురువారం కాంగ్రెస్కు రాజీనామా చేశారు.

జాతీయ పార్టీ ఎన్సీపీ నుంచి ఆయన ముధోల్‌ నియోజకవర్గ

అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారని సమాచారం.

అరుణతార రాంరాం:

జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ తార కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బిచ్కుంద మండల కేంద్రం నుంచి గాంధీ భవన్కు ఆమె ఫ్యాక్స్‌ ద్వారా పంపించారు. తొమ్మిదేళ్లు పార్టీ కోసం శ్రమిస్తే పార్టీ పట్టించుకోలేదనీ, టికెట్‌ ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్ను వీడుతున్నానని ప్రకటించారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి వచ్చిన మొండిచేయి చూపారని అరుణ వాపోయారు.

వర్గపోరులో వరంగల్‌:

పశ్చిమ సీటు తెదేపాకు కేటాయించినా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి నామినేషన్‌ దాఖాలు చేశారు. ఇదే బాటలో మరి కొందరు నాయకులున్నారు.

నియోజకవర్గాల వారీగా..

– స్టేషన్ఘన్పూర్‌ అభ్యర్థిగా ఇందిర పేరు ప్రకటించడంతో మాజీ మంత్రి డాక్టర్‌ విజయరామారావు రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

– ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు భద్రాచలం సీటు ఇచ్చారు. ఆయన అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలిసింది.

– వరంగల్‌ తూర్పు సీటు తెజసకు ఇవ్వొద్దంటూ

రెబల్గా బరిలోకి దిగుతానని ఇప్పటికే మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పోశాల పద్మ ప్రకటించారు. నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

వైరాలో సీపీఐకి ‘నో’:

సీపీఐ పార్టీ అభ్యర్థి విజయ స్థానికేతురులని, తండ్రి గుగులోత్‌ ధర్మా సీపీఎం పార్టీకి చెందినవారన్నారు. వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకు తెరాస సీపీఐతో కుమ్మక్కైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు చెందిన వ్యక్తిని స్వతంత్రంగా నిలబెట్టి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని స్థానిక నాయకుడు సైదులు చెప్పారు. కారేపల్లి నాయకులు ఏకంగా

సీపీఐకి మద్దతివ్వబోని తీర్మానం చేశారు.

కొత్తగూడెం కాంగ్రెస్లో టిక్కెట్‌ లొల్లి

– వనమా, ఎడవల్లి వర్గాల మధ్య తారాస్థాయికి చేరిన వివాదం

– బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఎడవల్లి కృష్ణ

భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్లో టికెట్‌ లొల్లి తారాస్థాయికి చేరింది. మహాకూటమి అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావుకు టికెట్‌ దక్కడంతో.. నియోజకవర్గంలోని అసమ్మతి నేత ఎడవల్లి కృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం కొత్తగూడెంలో హైడ్రామా చోటుచేసుకుంది. వనమా-ఎడవల్లి స్వయానా తోడళ్లల్లు కావడంతో ఆయన్ని బుజ్జ గించేందుకు వనమా కుమారులు ఎడవల్లి ఇంటికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఎడవల్లి అనుచరులు వారిని లోపలికి అనుమతించలేదు. తమ ఇంట్లోకి వనమా కుటుంబసభ్యులు రావొద్దంటూ కృష్ణ సతీమణి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వనమా కుమారులను బయటకు పంపించివేశారు. అనంతరం కొత్తగూడెంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఎడవల్లి కృష్ణ హుటాహుటిన సీపీఎం కార్యాలయానికి వెళ్లి బీఎల్‌ఎఫ్లో చేరారు. కొత్తగూడెంలో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here