ఎంబిబిఎస్‌ పరీక్షలో గందరగోళం..

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎంబిబిఎస్‌ అంటేనే నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టాలి.. పుస్తకాల పురుగు అనే పేరు ఉంటుంది. నాలుగు సంవత్సరాలు ఆ విద్యార్థులకు చదువే లోకం.. చదువే ప్రాణం.. అంత కష్టపడి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అంతా సిద్దమై పరీక్షహాలులోకి వెళ్లాక ఒక పేపర్‌కు బదులు మరోక పేపర్‌ ఇస్తే ఏలా ఉంటుంది. ఎబిసిడిలుగా తయారు చేసిన పేపర్లో ఎంపిక చేసిన పేపర్‌ ఇవ్వకుండా ఒక్కో కేంద్రానికి ఒక్కో పేపర్‌ సిరీస్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నారు… పరీక్ష రాసి బయటికొచ్చిన విద్యార్థులకు అసలు విషయం తెలిసి తలలు పట్టుకుంటే సారీ తప్పు జరిగింది పరీక్ష మళ్లీ నిర్వహిస్తామంటే ఏలా ఉంటుంది.. కిందా మీద పడి పరీక్ష రాసిన విద్యార్థులకు ఏమి చేయాలో తెలియక, ఎవ్వరికి చెప్పాలో అర్థంకాక తికమకపడుతూ, లబోదిబోమనడమే తప్ప చేసేదేమి ఉండదు.. సోమవారం నిర్వహించిన ఎంబిబిఎస్‌ రెండవ సంవత్సరం ఫార్మాకాలేజీ పరీక్షలో

జరిగిన తంతు చూస్తే అటు అధికారులు, ఇటు యూనివర్శిటి నిర్లక్ష్యం ఏలా ఉందో అర్థమవుతోంది..

     తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాళోజీ హెల్త్‌ యూనివర్శిటి వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంది. ఎంబిబిఎస్‌ రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం, నాలుగో సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎంబిబిఎస్‌ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫార్మాకాలేజీ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మాస్‌ కాఫీయింగ్‌, పేపర్‌ లీక్‌ వంటి మొదలకు విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పరీక్ష పేపర్‌ను ఎబిసిడి అంటూ నాలుగు పేపర్లు తయారు చేస్తారు. ఎవరూ ఎక్కడ తయారు చేశారో, ఎవరి పేపర్‌ సెట్‌ ఏటు వెళుతుందో కూడా తెలియనంతగా రహస్యంగా అన్ని వైద్య కళాశాలలకు పేపర్లను పంపుతారు.. పరీక్ష ప్రారంభమయ్యే ఒక గంట ముందు లాటరీ ద్వారా ఒక పేపర్‌ను ఎంపిక చేసి అన్ని పరీక్ష కేంద్రాలకు అదే ఇస్తారు.. పేపరు తయారు చేసిన వారికి కూడా పరీక్షలో ఏ పేపర్‌ వచ్చిందనే విషయం తెలియదు. అంత పకడ్భందీగా నిర్వహిస్తున్న ఎంబిబిఎస్‌ పరీక్షలను అధికారులు, యూనివర్శీటి నిర్లక్ష్యం వల్ల ఎబిసిడిలుగా తయారు చేసిన పేపర్లలో ఎంపిక చేసిన పేపర్‌ ఇవ్వకుండా ఒక్కో కేంద్రానికి ఒక్కో పేపర్‌ ఇచ్చారు. పరీక్ష కేంద్రాల్లో ఏ పేపర్‌ వచ్చిందో తెలియక ఇచ్చిన పేపర్‌ను వైద్య విద్యార్థులు రాశారు. ఎగ్జామ్‌ పూర్తయి విద్యార్థులు బయటికొచ్చి చూసే సరికి ఒక్కొక్కరికి ఒక్కో పేపర్‌ ఉంది. ఇలా ఎందుకు జరిగిందని విద్యార్థులు గగ్గోలు పెట్టే సరికి చిన్న పొరపాటు మా వల్లనే జరిగింది, ఈ రోజు జరిగిన పరీక్షను చివరిరోజు నిర్వహిస్తామని చల్లగా చెప్పారు. ఇన్ని రోజులు ఇంత కష్టపడి చదివి పరీక్ష రాస్తే మళ్లీ నిర్వహిస్తామంటే అంత టెన్షన్‌, అంత ఒత్తిడి మేము పడలేము. మళ్లీ చదవడం మా వల్ల కాదంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హెల్త్‌ యూనివర్శిటి నిర్లక్ష్యం వల్ల మెమెందుకు బలికావాలి అదే పరీక్ష అలాగే ఉంచాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యాశాఖలో చిన్న చిన్న పరీక్షలు నిర్వహించేముందే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు, అలాంటిది ఎంబిబిఎస్‌ పరీక్ష నిర్వహించే హెల్త్‌ యూనివర్శిటి ఏలాంటి జాగ్రత్తలు లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఏలా వ్యవహరించారనేది సందిగ్దంగా మారిపోయింది. విద్యార్థుల జీవితాలతో ఇలా చెలగాడమాడుకోవడం సరియైనది కాదని, అందుకు బాధ్యులైనఅధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. పరీక్ష జరుగుతున్నంతసేపూ ఏమి తెలియనట్టుగా నిశ్శబ్దంగా ఉండి, పరీక్ష అయ్యాక అనుకోకుండా పొరపాటు జరిగింది క్షమించడం, మళ్లీ పరీక్ష నిర్వహిస్తామనడం వారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తుంది. పరీక్షలంటేనే వైద్య యూనివర్శిటికి నిర్లక్ష్యమని ఇలాంటి తప్పులు మరోసారి జరుగకుండా చర్యలు కఠినంగా ఉండాలంటున్నారు విద్యార్థులు.. 

అదే పరీక్షను కొనసాగించాలి.

డాక్టర్‌ విజయేందర్‌ జూడా అధ్యక్షుడు..

ఎంబిబిఎస్‌ అంటేనే నిత్యం పుస్తకాలతో పోటీపడాలి. అలాంటిది చిన్న తప్పు జరిగింది మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని చెప్పడం కరెక్ట్‌ కాదు. విద్యార్థులు మళ్లీ పరీక్ష నిర్వహిస్తే ఎంతో ఒత్తిడికి గురవుతారు. అదే పరీక్షను అలాగే ఉంచాలి. వైద్య విద్యార్థులు కూడా మళ్లీ పరీక్ష రాయడానికి సిద్దంగా లేరు. ఈ పరీక్షను ఒకసారి పరిశీలించి రద్దు చేయకుండా ఉంటేనే మంచిది. సాంకేతిక సమస్యల వల్ల తప్పు జరిగినా, ఇంకెలా జరిగినా విద్యార్థుల భవిష్యత్తుతో మాత్రం ఆడుకోవద్దు. దయచేసి విద్యార్థుల సమస్యలను పరిగణలోకి తీసుకొని ఆలోచించాలి. వాయిదా వేసిన పరీక్ష రద్దుకు సాధ్యం కాకపోతే విద్యార్థులు మళ్లీ పరీక్షకు సిద్దమయ్యేలా తగినంత సమయం ఇవ్వాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here