Featured

కేటీఆర్‌, హరీశ్‌ రావులపై ఇసికి ఫిర్యాదు

ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ను తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని.. తమ పార్టీ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డిని మంత్రి హరీశ్‌రావు బెదిరించేలా మాట్లాడుతున్నారని నేతలు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. తెరాస అభ్యర్థులు గంగుల కమలాకర్‌, భూపాల్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని… వారిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

హరీష్‌ వ్యాఖ్యలపై రేవూరి కౌంటర్‌… నాలుక కోస్తానంటూ టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. హరీష్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చంద్రబాబును తిట్టడం ద్వారా కేసీఆర్‌ మెప్పు పొందాలని హరీష్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆది నుంచీ ఎదుటివాళ్ల జీవితాలతో ఆడుకోవడం హరీష్‌ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. తన నాలుక కోస్తానంటూ హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయాలని రేవూరి డిమాండ్‌ చేశారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే.. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.

పిఠాపురం నుంచి పవన్‌ పోటీ?

పిఠాపురం: అసెంబ్లీ ఎన్నికల్లో తనను చాలా మంది పిఠాపురం నుంచి పోటీచేయాలని అడుగుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తనను మత్స్యకారులు అడుగుతుంటే పిఠాపురం ప్రత్యేకత ఏమిటో తనకు అర్థంకాలేదని, ఆ తర్వాత ఇక్కడి ప్రత్యేకత శ్రీపాద వల్లభుడేనని అర్థమైందన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శ్రీపాద వల్లభుడంటే తనకెంతో ఇష్టం, ప్రేమ, గౌరవమని.. ఆయన ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచే పోటీచేస్తానేమో అని వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని భగవంతుడి ఆజ్ఞే అయితే అప్పుడు చూద్దామన్నారు. ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తనది కాదని, సెలక్షన్‌ కమిటీ అన్ని అంశాలను బేరీజు వేస్తుందన్నారు. తిరుపతి, అనంతపురం, ఇచ్ఛాపురం నుంచి కూడా తనను పోటీచేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో దేన్ని ఎంపిక చేసుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.

జనసైనికుల్నికాదని కాంగ్రెస్‌ వెళ్లిన సీఎంను చూస్తే బాధేసింది

జవాబుదారీతనం లేని పరిస్థితుల్లో జనసేన ఆవిర్భవించిందన్నారు. చాలా బలమైన భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉమ్మడి ఏపీలో పాలకులు చేసిన పని వల్ల ప్రజలకు నష్టం జరిగిందని చెప్పారు. ఏపీకి కాంగ్రెస్‌ చేసిన అన్యాయానికి మూడు ఎన్నికల్లో చోటు దక్కలేదని వ్యాఖ్యానించారు. జన సైనికుల్ని కాదని కాంగ్రెస్‌తో కలిసిన సీఎంను చూస్తే చాలా బాధ కలిగిందన్నారు. వంతాడలో రిజర్వ్‌ ఫారెస్టును అడ్డుగోలుగా దోచేస్తున్నారని.. తెదేపా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని పవన్‌ ఆరోపించారు. పేకాట క్లబ్బులు, ఇసుక, మట్టి, ఖనిజ మాఫియా కలిసి దండుకుంటున్నారని చెప్పారు. పంచాయతీకి కూడా పోటీ చేయని వ్యక్తి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రి లోకేశ్‌ ఎలా పడితే అలా హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన భాజపా, కాంగ్రెస్‌ను వదిలిపెట్టనన్నారు. తాను మోదీ దత్తపుత్రుడిని కాదని, ఆయనంటే తనకు భయంలేదన్నారు. ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంటే ఎవ్వరైనా తనకు ఒక్కటేనన్నారు. చురకత్తి, కోడికాలికి కట్టే కత్తితో రాజకీయం మారిందని వ్యాఖ్యానించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close