Featuredఅంతర్జాతీయ వార్తలు

కొలంబో దాడులపై భారత్‌ ముందే హెచ్చరికలు

  • సమాచారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం
  • భారత్‌ అండదండలు ఎప్పటికీ అవసరమే
  • శ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘే

కొలంబో: శ్రీలంక బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే భారత ప్రధాని తనకు ఫోన్‌ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని ఆ దేశ ప్రధాని రనిల్‌ విక్రమసింఘే తెలిపారు. అలాగే ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన మోడీ ఇక్కడి ప్రజలకు పూర్తి సంఘీభావం ప్రకటించారన్నారు. ఈ కష్ట సమయంలో శ్రీలంకకు అండగా ఉంటామని హావిూ ఇచ్చారన్నారు. భారత్‌ లాంటి మిత్రదేశాల నుంచి దాడులకు సంబంధించిన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తగు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యామని అంగీకరించారు. సమన్వయం ఎక్కడ లోపించిందన్న అంశంపై ఇప్పటికే విచారణ ప్రారంభించామన్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉగ్రవాద సమస్యను నిర్మూలించడానికి భారత్‌ ఎంతో కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే శ్రీలంక దాడులకు సంబంధించి ముందుగానే హెచ్చరించారన్నారు. శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల వెనక విదేశీ శక్తుల హస్తముందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని విక్రమసింఘే తెలిపారు. ఇప్పటి వరకైతే ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని వెల్లడించారు. అయితే ఈ దాడులు తమ పనే అని ఐసిస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరహా దాడులు జరగడం శ్రీలంకలో ఇదే తొలిసారని.. దీన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలతో కలిసి పోరాడతామన్నారు. ముఖ్యమైన సమాచార మార్పిడిలో శ్రీలంక ఇంటెలిజెన్స్‌ విభాగం ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నప్పటికీ.. ఈ ఘటన చోటుచేసుకోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై ఇప్పటివరకూ శ్రీలంక చేస్తున్న పోరాటంలో పాకిస్థాన్‌ పూర్తిగా సహకరించిందని చెప్పుకొచ్చారు. అవసరమైతే ఈ దాడులకు పాల్పడిన ముష్కరులను గుర్తించడానికి పాక్‌ సాయం తీసుకుంటామన్నారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నామన్నారు. దేశంలో ముస్లిం వ్యతిరేక ఘటనలకు ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈస్టర్‌ సందర్భంగా చర్చిలు, విలాసవంతమైన ¬టళ్లే లక్ష్యంగా జరిగిన వరుస బాంబు పేలుళ్లో 253 మంది మృత్యువాత పడగా.. దాదాపు 500 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే.

ప్రమాదం ఇంకా పొంచే ఉంది: అమెరికా

నాలుగు రోజుల క్రితం ఈస్టర్‌ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన దారుణ కాండను మర్చిపోక ముందే ఆ దేశానికి మరో షాకింగ్‌ సమాచారం అందింది. ఉగ్రదాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని సింహళ దేశాన్ని అమెరికా హెచ్చరించింది. దేశ వ్యాప్తంగా కొన్ని చోట్ల దాడులు జరగవచ్చని తెలిపింది. ఈస్టర్‌ సండేనాడు తెగబడిన ఉగ్రవాద సంస్థే మరోసారి దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. పర్యాటక ప్రాంతాలు, రవాణా ప్రాంతాలు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలు, ¬టళ్లు, రెస్టారెంట్లు, పార్కులు, ఆలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, ఇతర ప్రజావేదికల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని యూఎస్‌ తన లేఖలో పేర్కొంది. ఏప్రిల్‌26 నుంచి28 వరకు అంటే వారాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో జరిగిన వరుసు బాంబు పేలుళ్ల ఘటనలో 259 మంది ప్రాణాలు కొల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఈ దాడులను తామే చేశామంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ స్వయంగా ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆ దేశ పోలీసు అధికారి కూడా రాజీనామా చేశారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close