Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

కోడ్‌ కూసింది…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గ్రామ పంచాయతీ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణలో మరింత జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తాము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మహమూద్‌ అలీ చేత మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గ విస్తరణను కేసీఆర్‌ వాయిదా వేస్తూ వస్తున్నారు. జనవరిలో కెసీఆర్‌ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తూ వస్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. విస్తరణకు ఈ షెడ్యూల్‌ చట్టపరంగా ఆటంకమేమీ కాదు. అయితే, ఎమ్మెల్యేలంతా ఎన్నికల్లో నిమగ్నమై ఉంటారని, దానివల్ల విస్తరణలో మరింత జాప్యం జరుగుతుందని అంటున్నారు. దాంతో ఫిబ్రవరిలో విస్తరణ ఉంటుందని అనుకుంటున్నారు. మరో 6 గురు లేదా ఎనిమిది మందితో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తూ వచ్చారు. మంగళవారం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెలాఖరు వరకు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. మూడో దశ ఎన్నికలు ఈ నెల 30న జరుగనున్నాయి. విస్తరణ చేపడితే ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని కేసీఆర్‌ భావిస్తే ఫిబ్రవరి దాకా ఉండకపోవచ్చునని అంటున్నారు.

నిలిచిపోయిన బతుకమ్మ చీరెలు, రైతు బంధు చెక్కులు… గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినందున బతుకమ్మ చీరెల పంపిణీ, రైతు బంధు చెక్కుల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ వరకు గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బతుకమ్మ చీరెల పంపిణీని నిలిచిపోయింది.ఆ సమయంలో కూడ ఎన్నికల కోడ్‌ కారణంగానే చీరెల పంపిణీ నిలిపివేశారు. ఎన్నికలు ముగిశాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బతుకమ్మ చీరెల పంపిణీని చేపట్టారు. ఈ సమయంలో మరోసారి గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ తరుణంలో మరోసారి బతుకమ్మ చీరెల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు పథకం కింద చెక్కుల పంపిణీని కూడ నిలిపివేయాలని కూడ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలకు చెందిన పాలక మండళ్లు ఉంటే ఆ పాలక మండళ్లు ఉన్న చోట వెంటనే సమావేశాలను యధావిధిగా నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. కానీ, కీలక నిర్ణయాలు తీసుకోకూడదని కూడ ప్రకటించింది. ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలుమంత్రివిస్తరణ చేయకూడదని కూడ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైతే ఎవరైనా ప్రతి రోజూ రూ. 50వేల నగదును మాత్రమే వెంట తీసుకెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close