Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

సీఎం రాకపాయే..

  • హుజుర్‌నగర్‌లో కేసీఆర్‌ సభ రద్దు
  • వర్షం కారణంగా రద్దుచేసిన టీఆర్‌ఎస్‌
  • హెలికాప్టర్‌ వెళ్లేందుకు అనుమతివ్వని ఏవియేషన్‌ శాఖ
  • మీడియా ముందుకు రాని సీఎం కేసీఆర్‌

సూర్యాపేట

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం హుజూర్‌నగర్‌ పట్టణంలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు వరుణుడు అడ్డు తగిలాడు. హుజూర్‌నగర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా సీఎం కేసీఆర్‌ సభ రద్దయింది. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్‌ వస్తుండటంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున జనసవిూకరణను చేపట్టింది. సభా ప్రాంగణానికి ఇప్పటికే పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. అయితే, ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సభాప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది. సభా ప్రాంగణంలో నీళ్లు చేరి.. బురదమయంగా అయింది. దీంతో ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఇబ్బందిపెడుతూ.. సభ నిర్వహించడం కుదరదని గ్రహించిన సీఎం కేసీఆర్‌ సభను రద్దు చేశారు. దీనికితోడు సభాప్రాంగణం వద్ద భారీ వర్షంకురియడంతో సభకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్‌కు ఏవియేషన్‌ శాఖ అనుమతి ఇవ్వలేదు. వాన పడుతున్నందున హుజుర్‌నగర్‌ వెళ్లడం కష్టమని పైలట్లు సూచించిన మేరకు హెలికాప్టర్‌ పర్యటనను రద్దు చేసినట్లు ఏవియేషన్‌ డైరెక్టర్‌ భరత్‌ రెడ్డి ప్రకటించారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల పర్వం.. ఆందోళన క్రమం

ఒకవైపు ఆర్టీసీ సమ్మె.. మరోవైపు హుజుర్‌ నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. ఈ రెండు కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి టఫ్‌ ఫైట్‌లా మారాయి. ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగడం లేదు. సమ్మె ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం కూడా చర్చలకు ఛాన్స్‌ లేదనడంతో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు, నిరసనలు చేస్తూ సమ్మెను మరింత హీటెక్కిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్న రాజకీయ నేతలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ ప్రత్యక్షంగా సమ్మెపై మాట్లాడిన దాఖలాలు లేవు. మంత్రులు తెరపైకి వచ్చి రాసిచ్చిన స్క్రిప్టులు వల్లె వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హుజుర్‌ నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ సమ్మెపై ఏం మాట్లాడబోతున్నారనేది హాట్‌ టాపికైంది. అయితే చివరి క్షణంలో ఆయన పర్యటన రద్దు కావడం చర్చానీయాంశంగా మారింది.

ఆర్టీసీ సమ్మె ప్రభావాన్ని టీఆర్‌ఎస్‌ అధిగమిస్తుందా?

హుజుర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో టఫ్‌ ఫైట్‌కు సిద్ధమయ్యాయి. హుజుర్‌ నగర్‌ కాంగ్రెస్‌ కంచుకోట కావడంతో ఆ పార్టీ నేతలు బిందాస్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది వ్యవహారం. అదే క్రమంలో ఆర్టీసీ సమ్మె ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి మరిన్ని ఓట్లు అధికంగా రాలతాయనేది హస్తం నేతల ఆలోచన. ఇలాంటి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ బాస్‌తో పాటు గులాబీ నేతలు హుజుర్‌ నగర్‌ లో గెలుపు కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేశారు. అయితే ఆర్టీసీ సమ్మెను ఎలా అధిగమిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.

విూడియా ముందుకు రాని సీఎం

ఆర్టీసీ సమ్మెపై మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌ మాట్లాడారే తప్ప సీఎం కేసీఆర్‌ నేరుగా మాట్లాడిన దాఖలాలు లేవు. సవిూక్షలు, పత్రిక ప్రకటనలు తప్ప ఆయన స్పందించలేదు. సమ్మెపై ప్రభుత్వ వైఖరిని అధికారులకు వివరిస్తున్నారే తప్ప విూడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఈ క్రమంలో గురువారం నాడు హుజుర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌ వస్తారనే నేపథ్యంలో.. ఆర్టీసీ సమ్మెపై ఆయన ఏమైనా మాట్లాడతారా అనేది ఉత్కంఠ రేపింది. అయితే చివరి క్షణంలో భారీ వర్షం పడిందనే కారణంతో ఆయన సభ రద్దయింది. భారీ ఏర్పాట్లు చేసిన తర్వాత కేసీఆర్‌ రావడం లేదనేది పార్టీ శ్రేణుల్లో నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close