ఇచ్చింది కోటిన్నర.. మెక్కింది రూ.85 కోట్లు

0

పేదోడికి పెద్ద రోగం వస్తే పెద్దరాజు (ముఖ్యమంత్రి) ఆదుకుంటాడని ఏర్పాటు చేసిన సహాయనిధి

(సిఎం రిలీఫ్‌ ఫండ్‌)లోనే భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కార్పొరేట్‌ దొంగలు ఎంతకు తెగపడ్డారంటే… ఏకంగా ‘సిఎం’ తోనే అబద్దాలు ఆడించారు. సిఎం కార్యాలయ సిబ్బంది చేతివాటంతో ఈ భారీ స్కాం జరిగినట్లు తెలుస్తోంది.

(అనంచిన్ని వెంకటేశ్వరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద వేల సంఖ్యలో చెక్కులు మంజూరు చేశారు. వందల కోట్లు ఆ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నారు. కానీ వారు ఎవరు?.. వారికి ప్రభుత్వం ఏ కారణంగా సాయం చేసిం ది?.. లాంటి ప్రాథమిక వివరాలేవిూ ప్రభుత్వం వద్ద లేవు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. 2014 జూన్‌ నుంచి 2015 ఆగస్టు వరకు.. తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 12,462 చెక్కులు మంజూరు చేసింది. ఈ చెక్కుల నుంచి రూ. 86.6 కోట్లను డ్రా చేసుకున్నారు. ఈ చెక్కులన్నీ ఎవరు తీసుకున్నారో కానీ.. కేవలం 182 చెక్కులకు సంబంధించిన సమాచారం మాత్రమే ప్రభుత్వం వద్ద ఉంది. మిగతా సొమ్ములు ఎవరికి ఇచ్చారో ప్రభుత్వం వద్ద స్పష్టత లేదు.

సహాయం ఈ విధంగా..: సాధారణంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అంటే.. ప్రభుత్వ ఆరోగ్య పథకాల కిందకు రాని అరుదైన, ఖరీదైన వ్యాధుల బారిన పడిన వారికి ఈ నిధి నుంచి సాయం చేస్తారు. అలాగే ఇతర సమస్యల్లో ఉన్న వారికీ ఈ నిధి నుంచి సాయం చేస్తారు. అయితే ఈ సాయం ఆషామాషీగా చేయడానికి ఉండదు. దానికో లెక్క ఉంటుంది. నేరుగా నిధులు ఇవ్వరు. ఏ ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందో.. ఆ ఆసుపత్రి వారికి మాత్రమే బిల్లు చెల్లిస్తారు. నిబంధనల మేరకు చెల్లింపులు ఉంటాయి. ప్రతీది రికార్డులలో దస్తావేజుల రూపంలో ఉండాలి.

ఇక్కడెందుకు.. ఇలా..?: తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎవరికి ఎంత సాయం చేశారో తెలియ కుండానే నిధులు మంజూరు అయ్యాయి. ఇలా జరగటం వెనుక సంబంధిత అధికారుల ‘హస్తలాఘవం’ ఉన్నట్లు తెలుస్తోంది.

కేటీఆర్‌ ట్వీ(స్ట్‌)ట్‌.?: కొద్ది రోజుల క్రితం కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. 46 నెలల్లో లక్షా ఇరవై వేల కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా సాయం చేశామని.. ఇందు కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. దీనిపై సోషల్‌ విూడియాలో గొప్పగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఇలా మంజూరు చేసిన సాయం ఎవరికి పోయిందో తెలియకుండా పోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ సొమ్మంతా ఎటు పోయిందో తేల్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ సొమ్ము అంతా సీఎం ఆఫీస్‌ సాక్షిగా కాజేసిన వ్యక్తులు ఎవరో తెలియాల్సిఉంది. నిజానికి ప్రభుత్వం తరపున విడుదలయ్యే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. కానీ కొన్ని వందల కోట్లకు.. అదీ నేరుగా సీఎంకి సంబంధం ఉన్న నిధులకు లెక్కలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

2016, ఏప్రిల్‌ 6 ఏం జరిగింది: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నకిలీ రోగుల పేరుతో రూ. 73 లక్షలు విడుదల అయ్యాయి. ఈ విషయంపై తెలంగాణ పోలీసు నేర పరిశోధనా విభాగం (సిఐడి) విచారణ చేసి పదిమందిని అరెస్ట్‌ చేసింది. ఆ విచారణలో భాగంగా 11,600 దరఖాస్తులను పరిశీలించినట్లు తేలింది.

ఏందుకీ మౌనం: ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు దుర్వినియోగం అయిన కేసులో సీఐడీ దర్యాప్తు

అటకెక్కింది. దాదాపు 1300 మంది రోగుల పూర్వాపరాలు పరిశీలనలో అవకతవకలు జరిగినట్లు సిఐడి నిర్ధారించింది. కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు, మధ్యవర్తులతో కలిసి రోగులకు చికిత్స చేయించినట్లు ధ్రుపత్రాలు పుట్టించి నిధులు కొల్లగొట్టినట్లు సీఐడీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు తెలుసింది. అయితే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.

పాత రోగులు?కొత్త రోగాలు: ఇంతకుముందు ఉన్న రోగుల పేరుతో తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని 112 బ్రోకర్లు నకిలీ బిల్లులు సృష్టించారు. వారు ఆసుపత్రుల నకలు, కొంతమంది ఆసుపత్రి సిబ్బంది సహాయంతో నిజమైన రోగుల కేసు షీట్లను సృష్టించారు, చికిత్స కోసం సహాయం కోరుతూ నకిలీ రోగుల పేరిట సిఎం రిలీఫ్‌ కు నకిలీ బిల్లులు సృష్టించి ధరఖాస్తులు చేశారు. ఈ విధంగా 2016 నాటికే రూ.73,68,572 లు అధికారికంగా చేతులు మారాయి. కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రమేయం ఉండటం వల్లే బ్రేకులు పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here