హాట్‌హాట్‌గా సీఎల్పీ సమావేశం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ లీడర్‌ ఎంపికపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది.. గురువారం సీఎల్పీ లీడర్‌ ఎంపిక కోసం పార్టీ నేతలు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమయ్యారు. కాగా తనకంటే తనకంటూ పలువురు ఎమ్మెల్యే పట్టుపట్టడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణ సీఎల్పీ లీడర్‌ ఎంపిక బాధ్యతలను రాహుల్‌ గాంధీకి అప్పగిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ

తీర్మానం చేశారు.. దీంతో సీఎల్పీ లీడర్‌ ఎంపిక రాహుల్‌ కోర్టులోకి వెళ్లింది.. ఇదిలా ఉంటే ఈ సాయంత్రం వరకు సీఎల్పీ నేత పేరు వెల్లడవుతుందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. సీఎల్పీ నేతల రేస్‌లో ప్రముఖంగా మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సబితా ఇంధ్రారెడ్డి, శ్రీధర్‌బాబుల పేర్లు ఉన్నట్లు సమాచారం. వీరిలో రాహుల్‌ ఎవరిని ఎంపిక చేస్తే వారికి సీఎల్పీ నేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

హాట్‌హాట్‌గా సీఎల్పీ సమావేశం

కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత (సీఎల్పీ) ఎన్నిక సమావేశం గాంధీభవన్‌లో హాట్‌హాట్‌ సాగింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో కాంగ్రెస్‌ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, టీకాంగ్రెస్‌ ఇంచార్జి ఆర్సీ కుంతియా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క పేరు ప్రధానంగా వినిపించింది. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి,  శ్రీధర్‌బాబు కూడా రేసులో ఉన్నారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరును పార్టీలోని కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. సీఎల్పీ లీడర్‌ పదవి తనకే కావాలంటూ పలువురు పట్టుబట్టడంతో గురువారం ఉదయం ప్రారంభమైన సీఎల్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. పాత నాయకత్వాన్ని పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశమివ్వాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్‌ చేశారు. సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని నియమించాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పాతబ్యాచ్‌ పోవాలని.. పార్టీలో మార్పు రావాలని ఆయన అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 10ఎంపీ స్థానాలు రావాలంటే.. పార్టీలో ప్రక్షాళన జరగాలని సమావేశంలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే  సీనియర్‌ నాయకుడిని అయినందున సీఎల్పీ లీడర్‌గా తనకే అవకాశమివ్వాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని అన్నారు. గత డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేలందరిలో తానే సీనియర్‌ని అని.. వీలుంటే తనకు సీఎల్పీ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరారు. పార్టీలో పనికిరాని వాళ్లు చాలామంది ఉన్నారని.. ముందు పార్టీని ప్రక్షాళన చేయాలని సూచించారు. రాహుల్‌ గాంధీకి కూడా ఇదే విషయాన్ని చెప్పాలని కోరారు. పార్టీలో ఇప్పుడు ఉపాధ్యక్షులు, కీలక పదవుల్లో ఉన్నవాళ్లకు వాళ్ల ఇంట్లో వాళ్ళే ఓటేయని పరిస్థితులు ఉన్నాయన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు సీనియర్‌ నేతలకే సీఎల్పీ పదవి ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. దీంతో ఎవరికి వారి వాదనలు వినిపించడంతో సీఎల్పీ లీడర్‌ ఎంపిక కష్టతరంగా మారింది. దీంతో ఈ ఎంపికను రాహుల్‌గాంధీకి అప్పగిద్దామని కాంగ్రెస్‌ దూతలు పేర్కొనడంతో ఎమ్మెల్యేలు సైతం రాహుల్‌ గాంధీని తమ పేర్లు పంపించాలని, ఎవరిని నియమిస్తే వారికి అందరం సహకరిస్తామని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో తెలంగాణ సీఎల్పీ లీడర్‌ ఎంపిక రాహుల్‌ కోర్టులోకి వెళ్లింది. సాయంత్రం వరకు సీఎల్పీ లీడర్‌ పేరు ఎంపిక చేసే అవకాశమున్నట్లు కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here