Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

ప్రశాంతంగా ముగిసిన తొలివిడత పంచాయితీ ఎన్నికలు

  • పలు గ్రామాల్లో భారీగా బందోబస్తు
  • 7గంటల నుంచి 1 గంట వరకు పూర్తి
  • క్యూ లైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం
  • 75శాతం వరకు పోలింగ్‌ శాతం నమోదు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు బ్యాలెట్‌ విధానంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉపసర్పంచి ఎన్నికనూ రిటర్నింగ్‌ అధికారి చేపడతారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మొదటి విడత ఎన్నికలు జరిగే 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు.. 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 12,202 మంది సర్పంచి అభ్యర్థులు, వార్డులకు 70,094 మంది బరిలో నిలిచారు. 12 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు తర్వాత పంచాయతీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతకోసం 26వేల మంది పోలీసులను వినియోగించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉపసర్పంచి ఎన్నికనూ రిటర్నింగ్‌ అధికారి చేపడతారు. మిగతా రెండు విడతల పోలింగ్‌ ఈనెల 25,30 తేదీల్లో జరగనుంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా రెండు విడతల పోలింగ్‌ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది. రాష్ట్రంలో తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభంకాగా సినీ, రాజకీయ, పోలీసు, అధికారులు, పలు రంగాల ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటేశారు. సొంత ఊళ్లో తమ ఓటు

హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి జిల్లా డాకూర్‌లో సినీ హీరో జయంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని 14వ బూత్‌లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఆయన సతీమణి ఉషా దయాకర్‌రావు ఓటు వేశారు.

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లోని పోలింగ్‌ స్టేషన్‌ను జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు పరిశీలించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండల కేంద్రంలోని పంచాయతీ ఎన్నికల కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ హరిత తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరుగుతున్నదని సిద్ధిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దేవరకొండ కృష్ణ భాస్కర్‌ చెప్పారు. నంగునూరు, ఖానాపూర్‌ గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆయా గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించారు. మెదక్‌ జిల్లాలో మొదటి విడుత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. 6 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మెదక్‌ మండలం కుచాన్‌ పల్లిలో పంచాయతీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అభ్యర్థి పేరు గల్లంతు

మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం జజ్జరెల్లిలో పోలింగ్‌ నిలిచిపోయింది. బ్యాలెట్‌ పేపర్‌లో ఒక సర్పంచ్‌ అభ్యర్థి పేరు గల్లంతు కావడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. ఆరుగురు అభ్యర్థులకు గాను… పోలింగ్‌ సిబ్బంది ఐదుగురు అభ్యర్థుల బ్యాలెట్‌ పేపర్‌ ఇచ్చింది. దీంతో గ్రామస్థుల ఆందోళన చేయడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ కొనగింది.

పలుగ్రామాల్లో ఓటింగ్‌ బహిష్కరణ

తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ మొదలవ్వగా పలు చోట్ల గ్రామస్థులు నిరసనలు తెలుపుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాల ప్రజలు ఓటింగ్‌ను తిరస్కరించారు. ఆవాస గ్రామాలను పంచాయతీగా చేయాలంటూ ఎక్కల, బూటారం, చింతలపాడు గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఓటు హక్కు వినియోగించు కోవాలని అధికారులు, పోలీసులు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇదే జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యప్లలె పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. పోల్‌ చిట్టీల పంపిణీలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళలకు గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

గుండెపోటుతో పోలింగ్‌ ఏజెంట్‌ మృతి

గుండెపోటుతో పోలింగ్‌ ఏజెంట్‌ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ఆకుపాములలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థికి పోలింగ్‌ ఏజెంట్‌గా వి. సత్యంరాజు(70) విధులు నిర్వహిస్తున్నాడు. పోలింగ్‌ జరగుతుండగా గుండె పోటు వచ్చింది. వెంటనే స్థానికులు గుర్తించి ప్రైవేట్‌ వాహనంలో కోదాడకు తరలిస్తుండగా మృతి చెందాడు.

పోలింగ్‌ సిబ్బందిపై వేటు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన పోలింగ్‌ సిబ్బందిపై వేటు పడింది. జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం అర్పపల్లిలో బంధువుల ఇంట్లో విశ్రాంతి తీసుకోవడంతో పోలింగ్‌ సిబ్బందిని అధికారులు తొలగించారు. ఎన్నికల నిర్వహణకు వచ్చిన కొంతమంది పోలింగ్‌ సిబ్బంది ఆదివారం రాత్రి వారి బంధువుల ఇంట్లో బస చేశారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందిని వెంటనే మార్చాలని వారు డిమాండ్‌ చేశారు. అభ్యర్థుల ఆందోళనతో ఐదుగురు పోలింగ్‌ సిబ్బందిని అధికారులు తొలగించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close