మాఫీ-ఓటుబ్యాంకు

0

రాజకీయం మావల్ల కాదు..

రాంచీ : కాంగ్రెస్‌ పార్టీలాగా రుణమాఫీ పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు తాము చేయలేమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రుణమాఫీ ద్వారా కాకుండా ఇతర పద్ధతుల ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఝార్ఖండ్‌లో మండలం డ్యాం సహా ఆరు సాగునీటి ప్రాజెక్టులకు శనివారం మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి గృహ ఆవాస యోజన కింద ఐదుగురు లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌లా ఓటుబ్యాంకు రాజకీయా లకు తాను పాల్పడంలేమని, రైతులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారి సామర్థ్యాన్ని పెంపొందిస్తూ.. ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని మోదీ అన్నారు. తాము ఇళ్ల నిర్మాణ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్‌ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు. ప్రధాని పేరుతోనే తాము పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. తదుపరి ప్రధాని ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చన్నారు. రైతు రుణమాఫీ పేరిట రాజకీయాలు చేయడాన్ని మోదీ తప్పుపట్టారు. ప్రధానమంత్రి సించాయ్‌ పరియోజన కింద

99శాతం పనులు పూర్తి చేస్తున్నామని మోదీ అన్నారు. తాను రాజకీయం చేయాలనుకుంటే లక్ష కోట్లు రుణమాఫీ కింద రైతులకు ఇచ్చేసేవాడినని, కానీ, తాను రైతులను మోసం చేసే పాపానికి ఒడిగట్టనని చెప్పారు. రుణమాఫీ చేస్తే కేవలం ఒక ఏడాదే ఉపశమనం ఉంటుందని పేర్కొన్నారు. అదే లక్ష ఎకరాలకు నీరు వస్తే భవిష్యత్తులో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోకుండా తాము పనిచేస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా రైతుల సామర్థ్యాన్ని పెంచే విధానాలను అనుసరిస్తున్నట్టు ప్రధాని చెప్పారు. పొలాలకు నీరందిస్తే తరాలు బతుకుతాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here