చైనా నిర్బంధంలో ఇంటర్‌పోల్‌ చీఫ్

0

బీజింగ్‌: అంతర్జాతీయ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడు మెంగ్‌ హోంగ్‌వై ప్రస్తుతం చైనా అధికారుల నిర్బంధంలో ఉన్నారు. మెంగ్‌ కనిపించకుండా పోవడంతో ఆయన భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత దేశమైన చైనాలోనే అక్కడి అధికారులు ఆయనను నిర్బంధించడం వివాదాస్పదంగా మారింది. ఇంటర్‌పోల్‌ ప్రధాన కార్యాలయం ఉన్న ఫ్రాన్స్‌లోని లైయాన్‌ నగరంలో తన నివాసం నుంచి వెళ్లిన మెంగ్‌ కనిపించకుండా పోయారు. చివరిగా సెప్టెంబరు 29న ఆయన ఫ్రాన్స్‌లో కనిపించారు. తర్వాత మెంగ్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆయన భార్య ఫ్రాన్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. మెంగ్‌ సొంత దేశమైన చైనాకు వెళ్లినట్లు తెలిసిందని ఫ్రాన్స్‌ అధికారులు తెలిపారు.
అయితే మెంగ్‌ ఫ్రాన్స్‌ నుంచి చైనాకు వెళ్లగానే అక్కడి అధికారులు నిర్బంధించినట్లు తెలుస్తోంది. వారు ఆయనను ఎప్పుడు, ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే అంశంపై స్పష్టత లేదు. ఏ విషయంపై ఆయనను విచారిస్తున్నారో కూడా ఎలాంటి సమాచారం లేదు. కానీ, దర్యాప్తులో భాగంగా చైనా అధికారులు మెంగ్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారని అక్కడి మీడియా కథనాల్లో వెల్లడైంది. గత వారం ఆయన చైనాకు చేరుకోగానే క్రమశిక్షణ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది. మెంగ్ ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడే కాకుండా చైనాలో ప్రజా భద్రత విభాగంలో ఉప మంత్రి కూడా.
ఈ అంశంపై చైనా మౌనంగా ఉంది. ప్రజా భద్రత శాఖ మంత్రి గానీ, విదేశాంగశాఖ మంత్రి గానీ దీనిపై స్పందించలేదు. అక్కడి నిబంధనల ప్రకారం అనుమానితుడిగా ఎవరినైనా అదుపులోకి తీసుకుంటే 24 గంటల్లో వారి కుటుంబ సభ్యులకు, పనిచేసే సంస్థ యాజమాన్యానికి తెలియజేయాలి. విచారణ గోప్యంగా ఉంచాలనుకునే కేసుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. అయితే మెంగ్‌ భార్యకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మెంగ్‌ 2016లో ఇంటర్‌పోల్‌ చీఫ్‌గా నియమితులయ్యారు. 2020వరకు ఆయన పదవీ కాలం ఉంది. మెంగ్‌ ఇంటర్‌పోల్‌ చీఫ్‌గా ఎంపికైన తొలి చైనా దేశస్థుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here