Featuredరాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి పీఠం – తెలుగుదేశం రంగుమారింది

(ఆదాబ్ కథనం-2)

★ బిచాణా ఎత్తేసిన నాయకులు
★ ఆత్మరక్షణలో పడేసిన ఓ(నో)టు కేసు
★ ప్రచారానికి నందమూరి వారసులు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)

ఏపార్టీపై పోరాటం చేయడం కోసం తెలుగుదేశం పుట్టిందో ఆపార్టీతో కలవక తప్పని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ హయంలో తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం కోసం అంతర్గత పోరు భీకరంగా నడిచింది. ప్రస్తుతం తెలంగాణలో సీట్ల సర్దుబాటు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థితో ‘సంసార నావ’ సాగాల్సిందే. అయితే తెలంగాణ తెదేపాలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది మరో పదేళ్ల వరకు కాగడా పెట్టి వెతికినా దొరకని వైనం.. ప్రస్థుత రాజకీయ చిత్రం.

కాంగ్రెస్ వేసిన ప్రాంతీయ ఉచ్చులో తెలంగాణలో తెలుగుదేశం తెరమరుగు అయ్యేది. గ్రామస్థాయి నుంచి ఉన్న సంప్రదాయ ఓటుబ్యాంకుతో ఆ పార్టీ కొద్దికాలం దీనంగా వెళ్ళదీసింది. ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో కదం తొక్కడానికి నెమ్మది నెమ్మదిగా రంగం సిద్దం చేసుకొంటోంది.

నాటి తప్పటడుగు:
తెలుగుదేశంలో చంద్రబాబు వ్యూహాలకు అడ్డులేదు. కేసీఆర్ కు మంత్రిపదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ వాదం తెరపైకి వచ్ఛింది. దశాబ్దకాలం పాటు తుది తెలంగాణ ఉద్యమాన్ని ఆరకుండా కేసీఆర్ చూసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదాలో రెండుకళ్ళ సిద్ధాంతం సీమాంధ్రకే నచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నందమూరి కుటుంబం నుంచి ఒకరిని తెలంగాణ వాదం వైపుకు మరల్చగలిగితే పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉండేది. అయితే బాబు మది మరో ‘నందమూరి హీరో’ను రాజకీయ తెరపై చూడటానికి ఇష్టపడలేదని చెప్పవచ్చు. ఉద్యమం ఉద్రుతంగా జరిగే సమయంలో జూనియర్ ఎన్టీఆర్.. ‘తెలంగాణలో పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఇక్కడే మరణిస్తాను’ … అంటూ ఉద్విగ్నంగా చెప్పిన దాన్ని తెలుగుదేశం అధినాయకత్వం ఉపయోగించుకోలేక పోయిందనే.విమర్శలు ఉన్నాయి.

నిన్నటి బిగి కౌగిలి..
నేటి దృతరాష్ట్ర కౌగిలి:
బాజాపా గాలి వీస్తుండటంతో వారితో జతకట్టిన బాబు తెలంగాణలో 21.77% ఓట్లతో 15 సీట్లు దక్కించుకున్నారు. తెరాస ‘ఆకర్ష్’ పథకంలో 12 మంది ఎమ్మెల్యేలు, ఏకైక పార్లమెంటు సభ్యుడు మూటా ముల్లె సర్థుకొని వ్యక్తిగత అవసరాల కోసం కారెక్కారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లెక్కలోకి వెళ్ళగా… ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్యలు తెదేపాలో కొనసాగారు. తెదేపా తరఫున ఓడిన తుమ్మల, గెలిచిన తలసాని
తెరాసలో చేరి మంత్రులయ్యారు. ముచ్చటబడ్డ బాజాపా కౌగిలి నేడు దృతరాష్ట్ర కౌగిలిగా మారిపోయింది.

ఓ(నో)టు కేసు:
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్నో ఆటు ‘పోటు’ లను చవిచూసింది. నాదెండ్ల రూపంలో ఒకసారి, ‘లక్ష్మీ-బాబు’ రూపంలో మరోసారి తెదేపాతో పాటు ఎన్టీఆర్ ను ఒక్క కుదుపు కుదిపాయి. తొలి సంఘటనలో ఎన్టీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం సాధిచారు. అయితే రెండో ‘పోటు కుదుపు’ ఇంటిదే కావడంతో ఆయన జరిగిపోయారు. రాజ’క్రీనీడ’లో గెలుపోటములు సహజం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. కేసీఆర్ ప్రాంతీయ యాసకు జవాబు చెప్పే ధీటైన నాయకులు మౌనంగా ఉండటం పార్టీని ఓ మూలకు నెట్టింది. చంద్రవ్యూహంలో ఓటుకు నోటు కేసు ఆత్మరక్షణలో పడేసిన దిగ్భ్రాంతి కరమైన సంఘటన. దీని కారణంగా తెలంగాణలో ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా సందిగ్ధంలో పడింది.

ప్రచారంలో ‘నందమూరి’ వారసులు:
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాపాడుకోవడం కోసం నందమూరి కుటుంబం సభ్యులను ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దించనున్నది. అందులో భాగంగా ఖమ్మంజిల్లా మధిరలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. తేదేపా అభ్యర్థులు రంగంలో ఉన్న స్థానాలలో జూనియర్ ఎన్టీఆర్, ఆ పార్టీ సినీ శ్రేయేభిలాషిలాషులను రంగలోకి వచ్చే అవకాశం ఉంది. అంశాల వారీగా ప్రచారంలోకి దింపాలని అంతర్గత నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

కొసమెరుపు:
పరిస్థితులు మారడంతో బాజాపాను వద్దనుకుని కాంగీతో స్నేహానికి సిద్దపడింది. బద్దశత్రువులు అవసరార్థం కోసం తప్పనిసరిగా మిత్రులుగా మారారు. సీట్ల సర్దుబాటు, అనంతర ఫలితాల తరువాత తెదేపా తలరాత ఎలా ఉంటుందో చూద్దాం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close