Featuredరాజకీయ వార్తలువార్తలు

ముఖ్యమంత్రి పీఠం (ఆదాబ్ కథనం-3) ప్రాంతీయ ఉచ్చు పత్తాలేని పార్టీలు

★ లోక్ ‘సత్తా’ ఏది
★ సైన్యం లేని జనసేన
★ వైకాపా కు అభ్యర్థులు కరవు
★ తుడిచి పోయిన అమ్ ఆద్మీ
★ ‘కాంగీ’లో ఐక్యమైన ప్రజారాజ్యం
(అనంచిన్ని వెంకటేశ్వరరావు ఆదాబ్ హైదరాబాద్)

తెలంగాణ ప్రాంతీయవాదం ఒకటి రెండు కాదు ఏకంగా 16 పార్టీలను అదృశ్యం చేయగలిగింది. కొన్ని పార్టీల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. దిక్కులు పెక్కటిల్లేలా మాట్లాడే నాయకులను దిక్కులేకుండా చేసింది. గత ఎన్నికలలో అధికార మార్పిడిని రెండు పార్టీలు ప్రభావితం చేశాయి. హంగ్ అసెంబ్లీ వస్తే లోక్ సత్తా తరఫున జె.పి., ప్రజారాజ్యం తరఫున చిరంజీవికి అవకాశాలుండేవి. అయితే ఈ రెండు పార్టీలు కాంగ్రెసుకు అనుకోని వరంలా వచ్చి.. పోయాయి. ఇందులో చిరంజీవి మాత్రం రాజకీయంగా అట్టర్ ప్లాప్ అయినా కేంద్రమంత్రి అయ్యాననే తృప్తి దక్కించుకున్నారు.

లోక్ ‘సత్తా’ రాజకీయ సన్యాసం:
వైఎస్సార్ సారథ్యంలో రెండవసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రెండు పార్టీలు ప్రభావం చూపాయి. అందులో లోక్ సత్తా ఒకటి. కేవలం 1.4 శాతం ఓట్లు చీల్చి తెలుగుదేశం నోట్లో మట్టి కొట్టింది. నీతి, నిజాయితీ రాజకీయాల గురించి మంచి ఆలోచన దృక్పథంతో ముందుకు సాగింది. 2016, మార్చి 22న….ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని లోక్‌సత్తా కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాజకీయాలలో మార్పు తీసుకువస్తామని చెప్పిన జయప్రకాష్ నారాయణ చివరకు తాను, తాను స్థాపించిన పార్టీ రాజకీయాలకు దూరంగా జరిగింది. దీంతో భారతావని మంచి ‘సిఇఓ’ ను రాజకీయంగా కోల్పోయింది.

 

అన్న ‘ప్లాప్’షో: మెగాస్టార్ చిరంజీవి ఓ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ శంఖారావం పూరించారు. ఎన్టీఆర్ 9 నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారని.. అంతకంటే తక్కువ సమయంలో ప్రజారాజ్యం ఏలుతుందని ఇంటిల్లపాదీ తెగ కష్టపడ్డారు. 2008 ఆగష్టు, 26న  ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో 294 స్థానాలకు పోటీ చేసి 18శాతంతో 18 స్థానాల్లో గెలిచింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి, సొంతూరిలో ఓడిపోయి, తిరుపతిలో గెలిచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చిన పార్టీగానే మిగిలిపోయింది. 2011 అదే ఆగస్టు కాంగ్రెసుపార్టీలో విలీనంచేశారు.

తమ్ముడి ‘స్టార్ట్’ షో:
సినిమాలలో సీక్వెల్ లాగానే ప్రజారాజ్యం పార్టీకి జనసేన సీక్వెల్ పార్టీగా చెప్పవచ్చు.
అన్నగారి పార్టీ ఏర్పాటులో తమ్ముడు పవన్ కూడా కీలకవ్యక్తే.
యువరాజ్యానికి పవనే అధ్యక్షుడు. అభ్యర్ధుల ఎంపికలో పవన్ కూడా కీలకపాత్ర పోషించారు.
పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో కానీ నిర్ణయాలు తీసుకోవటంలో కుటుంబ సభ్యులే కీలకమన్నది అప్పట్లో వినబడిన ఆరోపణ. ప్రజారాజ్యం వైఫల్యంపై పవన్ బాగానే కసరత్తులు చేసి ‘జనసేన’ పేరుతో మరో పార్టీకి తెరతీశారు. ఒక క్రమపద్ధతిలో జనసేన ఎదిగేలా జాగ్రత్త పడుతున్నారు. ప్రజాదరణ ఎలా ఉన్నా సంస్థాగత నిర్మాణంపై ఇంకా లోతుగా ఆలోచించాలి. కొద్దిమంది సీనియర్లను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి, వారికి కాస్తంత స్వేచ్ఛను ఇచ్చి, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలనేదే ప్రస్తుత జనసేన వ్యూహంగా కనిపిస్తున్నది. ఇది తెలంగాణలో ఉనికి కోసం… ఆంధ్రాలో పట్టుకోసం ప్రయత్నిస్తోంది.

నగర అందాలకు పరిమితమైన అమ్ ఆద్మీ, పాతబస్తీకి పరిమితమైన మజ్లిస్ బచోవ్ తెహ్రీక్ (ఎంబిటి)లు ఇప్పుడు నామ మాత్రంగా మారాయి. ఇవి కాకుండా ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ జాబితాలో 14 ఉన్నాయి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, మహాజన సోషలిస్టు పార్టీ, నవ తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ జన సమితి, తెలంగాణ జనతా పార్టీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ రాష్ట్ర పార్టీ, తెలంగాణా రాష్ట్ర సాధన ఫ్రంట్ , హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ, జై తెలంగాణ పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్). ఇవన్నీ ప్రధాన పార్టీలపై ఉన్న అసంతృప్తితో ఏర్పాటు అయినవే.

చివరిగా…
దేశంలో జాతీయపార్టీలు వేరు ప్రాంతీయపార్టీలు వేరంటూ నిట్టనిలువునా చీల్చిన సూతం తమిళనాడుది. మరి ఆ సూత్రమే తెలంగాణ పాటిస్తుందా..? లేక మరికొన్ని పార్టీలకు అవకాశం కల్పింస్తుందా..? అనేది భవిష్యత్తులో తరచి చూడాల్సిన ముఖచిత్రం. అప్పటి వరకు ఈ నామ మాత్రపు పార్టీల నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే స్థాయి నాయకులు ఉండరనే చెప్పవచ్చు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close