Featuredజాతీయ వార్తలుటెక్నాలజీ

చంచమామ చెంతకు చంద్రయాన్‌-2

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌

  • సంబురాలు చేసుకున్న ఇస్రోశాస్త్రవేత్తలు
  • ఇస్రో ఘనతకు అభినందనల వెల్లువ
  • సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనున్న ఉపగ్రహం
  • చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమే
  • అసలు పని ఇప్పుడు మొదలవుతుంది
  • ప్రయోగంలో భాగస్వాములైన ప్రతీఒక్కరిక ధన్యవాదాలు
  • ఇస్రో ఛైర్మన్‌ శివన్‌

శ్రీహరికోట, జులై22(ఆర్‌ఎన్‌ఎ) : భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనలకోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. 20గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికెగసిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌) 16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణించింది. అనంతరం భూమికి దగ్గరగా 170కి.విూలు.. భూమికి దూరం 39059కి.విూల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్‌ 2ను

విడిచిపెట్టింది. ఐదు రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్‌ 2 ప్రవేశిస్తుంది. సగటును 3.84లక్షల కి.విూల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనుంది.

ఇదిలా ఉంటే చంద్రయాన్‌-2ను చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంలోకి ప్రవేశ పెట్టడమనేది అత్యంత క్లిష్టమైన అంశం. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరుకుంటున్న ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది. చంద్రుడిపై క్లిష్టమైన సాప్ట్‌ ల్యాండింగ్‌ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ విడిపోయిన తరువాత 15నిమిషాలు అత్యంత కీలకమైందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రయాన్‌-2 చంద్రుడిపై దిగిన తర్వాత అందులోని రోవర్‌ సెకనుకు సెంటీవిూటరు వేగంతో 14రోజుల పాటు పయనించనుందని, చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి సమాచారాన్ని, చిత్రాలను పంపనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై జల, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి ఇది పరిశోధనలు చేయనుంది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని జులై 15న తెల్లవారుజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం గుర్తించి వాయిదా వేశారు. ఈ సమస్యను పరిష్కరించిన శాస్త్రవేత్తలు ప్రయోగం సోమవారం నిర్వహించారు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి అనువైన లాంచ్‌ విండో ఒక నిమిషమే కావడం విశేషం. ఈ స్వల్ప సమయంలోనే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ఇదిలా ఉంటే ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకున్నారు. ఒకరినొకరు అభినందలు తెలుపుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతతో ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమే – ఇస్రో ఛైర్మన్‌

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ సరికొత్త విజయం సాధించిందని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ కే. శివన్‌ పేర్కొన్నారు. చంద్రయాన్‌ -2 పరీక్ష విజయవంతం కావడంతో ఇస్రో ఉద్యోగులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివన్‌ మాట్లాడారు. మార్క్‌-3 విజయం కొత్త ఉత్సాహం నింపిందన్న ఆయన చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమే అని చెప్పారు. ప్రతిక్షణం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామని, తీవ్రమైన సాంకేతిక సమస్యలను అధిగమించగలిగామని, సమస్యను గుర్తించి వారంలోనే పరిష్కరించామన్నారు. శాస్త్రవేత్తలందరూ 24గంటలూ తదేక దీక్షతో పనిచేశారని, శాస్త్రవేత్తల అంకితభావం, కృషి మాకు ఈ విజయాన్ని అందించిందని ప్రశంసించారు. లాంఛ్‌ వెహికల్‌ టీమ్‌ అత్యంత సునిశిత పరిజ్ఞానంలో విజయం సాధించిందని, ప్రతి అంశాన్ని లాంఛ్‌ వెహికల్‌ టీమ్‌ క్షుణ్ణంగా పరిశీలించి నిర్దారించిందన్నారు. ఇప్పటికీ రాకెట్‌ను విజయంతంగా నింగిలోకి పంపామని, అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభమవుతుందని, వచ్చే 45 రోజులు మాత్రమే మాకు అత్యంత కీలకమని శివన్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 7 రాత్రి ల్యాండర్‌ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ పేర్కొన్నారు. 
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close