కంగుతినిపించే చంద్రవ్యూహం

0

చక్రం తిప్పిన బాబు

నారా చంద్రబాబు మంచి వ్యూహకర్త. అందులో ఎవ్వరికీ సందేహం ఉండదు. సోమవారం నాటి ఆయన సమావేశాలన్నీ ‘తెలంగాణ తెలుగుదేశం వైపు’ అని విూడియాతో సహా అందరూ అనుకున్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో హైదరాబాద్‌ సమావేశాలకు వచ్చారో ఆ పని కేవలం మూడుగంటల పది నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు. మధ్యలో ఓ మీడియా అధిపతితో సలహా సంప్రదింపులు, నందమూరి కుటుంబంతో మాటామంతీ… జరిపారు. చంద్రబాబు కదలికలకు తోడు ఇతర భాగస్వామి పక్షాల దగ్గర ఆదాబ్‌ నిఘా పెట్టింది. ఊహించని నిజాలు ఎన్నో ఆయన కనుసైగలతో జరగటం జరిగిం ది. తెలంగాణ ఎన్నికలపై ‘చంద్రవ్యూహం’ ఏమిటంటే… అదే నేటి ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ సంచలన కథనం…

(అనంచిన్ని వెంకటేశ్వరరావు) ఆదాబ్‌ హైదరాబాద్‌:

‘కూటమి’ పేరుతో కాంగ్రెసుతో కలసి ఎన్నికలకు వెళ్ళటం ఎవ్వరూ ఊహించనిది. ప్రత్యేకంగా ‘గులాబీ దళం’ ఆశించని చేదు వాస్తవం. బాబు గత సంవత్స రన్నర క్రితమే నిశ్శబ్దంగా కూటమి కోసం పావులు కదిపారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా తన నాయకుల పైరవీల సమాచారం కన్నా బాబు అభివృద్ధి ప్రణాళికలపై నమ్మకం ఉంచింది. బాబు కూడా ఢిల్లీకి బిసి నాయకులను పంపి తమ ఆకాంక్షలను వెల్లడింపచేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా అందుకు అంగీకరించింది. ప్రశాంతంగా నడుస్తున్న ప్రభుత్వాన్ని కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలతో ధైర్యంగా ముందుకు వెళుతున్నాని భావించారు. విశ్వాసం గొప్పది. అతివిశ్వాసం ప్రమాదకరం. అన్ని పార్టీలు ‘చావో రేవో’ తేల్చుకోవడానికి సిద్దపడుతున్నాయి.

సంఖ్య ముఖ్యం కాదు.. పక్కా గెలుపు లెక్క..: కూటమిలో ‘సీట్ల సంఖ్య ముఖ్యం కాదు. గెలిచే స్థానాలను ఎంచుకుని పోటీ చేద్దాం. పొత్తులు ముఖ్యం తప్ప సీట్లు ముఖ్యం కాదు. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులను పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ అవకాశాలు రాకపోవచ్చు.. సర్దుకుపోవాలి’ అని చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు చెప్పారు. దానికి తోడు ‘కూటమి’లో ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంటులో 2 సీట్లు బీసీలకు కేటాయిస్తూ.. 34 అసెంబ్లీ సీట్లు, లంబాడాలకు, ఆదివాసీలకు చేరో 6, మాలలకు 7, మాదిక సామాజిక వర్గానికి 12 సీట్లు కేటాయింపు చేయాలని సిట్టింగు స్థానాలు ఆ,యా పార్టీలకు వదలాలని చెప్పారు. ఒకవేళ తెరాస గెలిచిన స్థానాలలో ద్వితీయ స్థానంలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం సముచితమని లెక్కలతో వివరించి చెప్పారు. అగ్రవర్ణాల విషయంలో ఎవరిని, ఎక్కడ, ఎందుకు బరిలో నిలపాలో ఓ ‘ఎల్లో ప్రింట్‌’ ప్రణాళిక వివరించారు. దీంతో అప్పటి వరకు ఘీంకరించిన పార్టీలకు ‘వాస్తవ దృక్పథం’ వివరించారు.

ముందే ప్రణాళిక: గెలుపు గుర్రాలు ఎవరనే విషయంలో నిశ్శబ్ద సేకరణ కూడా ఆశ్యర్య పరిచేదే. మతం, కులం వారిగా ప్రత్యర్థి పార్టీలకు ధీటైన అభ్యర్థులను ఎంపిక చేయడం ఏఐసీసీ, సిపిఐ పెద్దలను సైతం ఆశ్చర్య పరిచింది. ఇతర పార్టీలలో గెలిచి కారెక్కిన వారికి ధీటైన అభ్యర్థులకు ఎవరు అయితే బాగుంటుందనే విషయంలో స్పష్టంగా పేర్కొన్నారు. కూటమిలో బలమైన అభ్యర్థులను ఏవిధంగా, ఎక్కడ, ఎలా రంగంలోకి దించాలనే విషయం వివరించారు.

అధిష్టానంతో ఫోన్‌ మంతనాలు: కాంగ్రెస్‌ అధిష్టానంతో చంద్రబాబు కీలక స్థానాలపై చర్చించారు. అనంతరం సీట్ల బాధ్యతను రమణ, నామా నాగేశ్వరరావులకు అప్పగించారు. ఇక్కడి పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.

సీట్లు సర్థుబాటు..: కూటమి భాగస్వామి పక్షాలైన

సిపిఐ, తెజస ముఖ్య నాయకులతో అయన సీట్ల సర్దుబాటుపై విడి, విడిగా ఫోన్‌ లో మాట్లాడారు. వారికి సంస్థాగత నిర్మాణాల గురించి, లోక్‌ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని, త్యాగాలకు సిద్దంగా ఉండాలని చెప్పారు. కొసమెరుపు: ఎన్టీఆర్‌ భవన్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చేరుకోవడానికి ముందే పాత్రికేయుల మాదిరిగా తెలంగాణ ఇంటిలిజెన్స్‌ అధికారులు ఉన్నారు. అయితే వారు జరుగుతున్న విషయాలను బయటకు చెప్పాల్సిన వారికి చెపుతున్నారు.. కానీ, తెరవెనుక అసలేం జరిగిందో పసిగట్ట లేకపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here