21నుంచి ఎర్రవల్లిలో చండీయాగం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు, అంచనాలకు అవకాశం లేకుండా విస్తరణ ఎప్పున్నదానికి సిఎం కెసిఆర్‌ అంచనాలకు అందకుండా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. చివరిరోజు గవర్నర్‌ ప్రసంగంపై చర్చ అనంతరం కెసిఆర్‌ సమాధానం ఇస్తారు. అనంతరం సభను వాయిదా వేస్తారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 21 నుంచి 25 వరకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించతలపెట్టిన యాగంలో బిజీ కానున్నారు. దీంతో విస్తరణ ఎప్పుడన్నది ఊహలకు అవకాశం లేకుండా చేశారు. యాగతం పూర్తయ్యాకనే తిరిగి మంత్రివర్గ విస్తరణపై ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయి. తమకు మంత్రి పదవీయోగం పడుతుందని ఆశావహులు ఇంతకాలం ఎదురుచూశారు. అయితే అది ఎప్పుడన్నది కెసిఆర్‌ ప్రకటనను బట్టి ఉంటుంది. కేబినెట్‌ విస్తరణ ముహూర్తం ఫిబ్రవరి మొదటి వారంలోపే ఉంటుందని చాలామందివిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మార్చిలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన నేపథ్యంలో త్వలోనే విస్తరణ ఉంటుందన్న ఆశ మాత్రం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత నెల 11న వెలువడ్డాక, 13న సీఎంగా కేసీఆర్‌, మంత్రిగా మహమూద్‌అలీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. శాసనసభ్యుల దామాషా ప్రకారం కేబినెట్‌లో ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య 18 మందికి మించకూడదు. ఈలెక్కన తన కేబినెట్‌లోకి గరిష్ఠంగా మరో 16 మందిని తీసుకునే వెసులుబాటు కేసీఆర్‌కు ఉంది. ఇందుకోసం రెండు విడతల్లో విస్తరణ చేపడతారన్న ప్రచారం కూడా ఉంది. మొదటి దఫా ఆరు నుంచి ఎనిమిది మందిని కేబినెట్‌లోకి తీసుకొని, లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్‌ నెలాఖరులోపే మొదటి దఫా విస్తరణ చేపడతారనే సంకేతాలు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి బయటికి వచ్చాయి. కానీ జనవరి మూడో వారం ముగుస్తున్నా విస్తరణ ఊసే లేకపోవటంతో మంత్రిపదవులను ఆశిస్తున్న వారికి మరికొంత కాలం ఆగకతప్పదేమో. ప్రభుత్వ శాఖల ఏకీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చాక కేబినెట్‌ విస్తరణ చేపట్టాలనే ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలంటే మంత్రులు ఉండాలి. తాజా అంచనాల ప్రకారం యాగం ముగిసిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని ఆయన పరిమిత సంఖ్యలో మంత్రులను తన కేబినెట్‌లోకి తీసుకుంటారని అంటున్నారు. దీని ప్రకారం చూస్తే జనవరి 30, ఫిబ్రవరి 7 మంచి ముహూర్తాలు ఉన్నాయని టీఆర్‌ఎస్‌ వర్గాలే చెబుతున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీ మంచి ముహూర్తం ఉందని పేర్కొంటున్నాయి. అయితే కేబినెట్‌ విస్తరణ ముహూర్తం ఫిబ్రవరి మొదటి వారాన్ని దాటకపోవచ్చనే విశ్వాసాన్ని ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, తొలి విడత కేబినెట్‌ విస్తరణలో తాజా మాజీ మంత్రులు కె.తారకరామారావు, టి.హరీశ్‌రావుకు చాన్స్‌ ఉంటుందా? లేదా? అనే విషయంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ నుంచి కేటీఆర్‌కు అవకాశం దక్కకపోతే, చెన్నమనేని రమేశ్‌ బాబుకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన సన్నిహితులు కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌, ఈటల రాజేందర్‌, జి.జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్‌, జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పువ్వాడ అజయ్‌, పద్మారావు, దానం నాగేందర్‌, పట్నం నరేందర్‌రెడ్డి, వి.శ్రీనివాసగౌడ్‌ తదితరులు మంత్రి పదవి రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి పదవి దక్కదనే అభిప్రాయానికి వచ్చిన ఎమ్మెల్యేలు పలువురు చీఫ్‌ విప్‌, విప్‌, డిప్యూటీ స్పీకర్‌, పార్లమెంటరీ సెక్రటరీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here