బిజినెస్

ఈడీ ఎదుట హాజరైన చందాకొచ్చర్‌

న్యూఢిల్లీ, మే13(ఆర్‌ఎన్‌ఎ) : మనీలాండరింగ్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో జరిగిన అవకతవకలపై, రుణాల మంజూరి అర్హతలపై అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం విచారణాధికారి ఎదుట హాజరుకావాలంటూ చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, ఆయన సోదరుడు రాజీవ్‌లకు గత నెల ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే దీపక్‌, రాజీవ్‌లు విచారణకు హాజరయ్యారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ముంబయి, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న చందా కొచ్చర్‌, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌ ఇళ్లలో సోదాలు చేసిన అనంతరం ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో వారిని విచారించిన విషయం తెలిసిందే. వీడియోకాన్‌ గ్రూప్‌ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చర్‌ గత ఏడాది అక్టోబరులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో వీడియోకాన్‌ గ్రూప్‌ రూ.3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్‌ కుటుంబం లాభపడిందని ఆరోపణలు రావడంతో విషయం వివాదాస్పదమైంది. దీంతో వారిపై మనీ లాండరింగ్‌ క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close