ఊసరవెల్లులే చాలా నయం…

0

రాజకీయం నేడు సేవ కాదు.. అవకాశాల కోసం మారిపోతున్న ఒక ఆట… ప్రజలకోసం పనిచేయ్యడమనే మాట చెప్పేవారు.. వినేవారు ఇద్దరూ కరువవుతున్నారు… ముందు పదవి…. పదవి… పదవి… ఆ తర్వాత హోదా, అన్ని అయ్యాక చివరకు అవకాశం ఉంటేనే ప్రజల సేవ అంటోంది నేటి నాయకత్వం.. పదవి, పలుకుబడి కోసమే ఓటర్లను పావులుగా వాడుకుంటున్నారు… ఉదయం గెలిచిన నాయకుడు సాయంత్రం వరకు ఏటు పోతున్నారో తెలియడం లేదు. తన అవసరం కోసం పార్టీ మారుతూ ఓటు వేసిన జనం నెత్తిన టోపి పెడుతున్నారు… గల్లీగల్లీలో నాయకుడి కోసం జెండాలు పట్టి, జేజేలు కొట్టి, రేయింబవళ్లు తిరిగిన కార్యకర్తలను నడిబజారులో నిలబెడుతోంది నేటి రాజకీయం.. ప్రతిపక్షం, అధికారం పక్షం అన్ని ఒకటవుతున్నాయి… ఓటు వేసి గెలిపించిన ఓటర్లు, నాయకుల వెంట తిరిగినా చోటా, మోటా నాయకుల పరిస్థితి మాత్రం ఎవరికి చెప్పుకోలేనంత వ్యధగా మారిపోతుంది… రాజకీయం అంటేనే ఒక చదరంగమని మరీ కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.. మనం అనుకునే నాయకులు, మన కష్టించి, పరితపించి గెలిపించిన మన లీడర్లు, మన కోసం సేవచేయాలి కాని వారి స్వార్థంకోసం పార్టీలు మారడం ఏంటో అర్థంకాని పరిస్థితి… సేవ చేయాలంటే.. నిజంగా ఓట్లేసిన ప్రజలకోసం పనిచేయ్యాలంటే పార్టీలే మారాలా… పార్టీ మారితేనే అభివృద్ది అందనంత వేగంగా పరిగెడుతుందా అంటే సమాధానం లేని ప్రశ్నలే.. నమ్మకంతో, గుండెల్లో పెట్టుకొని ఓటు వేసిన ఓటర్లకు ఏం సమాధానం చెపుతారో తెలియని రాజకీయం నేడు అంగడిలో ఆట వస్తువుగా మారిపోయింది.. ఒక గుమ్మడి నర్సయ్య, ఒక కుంజ భోజి, ఒక కొడంగారి రాములు లాంటి నాయకులు నేటికి, నాటికి, రాబోయే తరానికి కూడా స్పూర్తిదాతలు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎవరూ ఎక్కడ ఉంటున్నారో.. ఎవరూ ఏటూ పోతున్నారో తెలియదు… రాత్రి పడుకునే ముందు ఉన్న ఆలోచన ఉదయం లేవగానే మాయమైపోతుంది.. అవకాశాలు రాకున్నా వెతుక్కుంటూ వెళుతున్నారు నేటి నాయకులు.. నాకు నా పార్టీలో సీటు రావడం లేదు.. నీ పార్టీకి రమ్మంటావా చెప్పు.. రావడానికి నేను ఇప్పుడంటే ఇప్పుడే సిద్దమంటున్నారు. నా కూతురికి, నా కుమారుడికి అవకాశమే లేదు. ఇద్దరం వస్తాము, రెండు టికెట్లు కావాలంటున్నారు… నమ్ముకున్న ప్రజలు, వెంట తిరిగే కార్యకర్తలు ఏలా అంటే మాత్రం, వారి గురించి పట్టించుకునే సమయం, ఆలోచించే తీరికే నేటి నాయకత్వానికి లేదు.. ఏ పార్టీ నుంచి ఎవరిని లాగుదామా, ఏ పార్టీలో ఎవరున్నారు.. మన పార్టీ బలమెంత, అవతలి పార్టీ బలహీనత ఏంటో మొత్తం ఆధారాలతో సహా తీసుకుని ఏలా అవకాశం ఉంటే అలా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. రాని వారిని నయానో, భయానో పిలిచి మరీ మరీ రప్పించుకుంటున్నారు.. ఇలాంటి వారు రేపు ప్రజలకు ఏలా సేవచేస్తారంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేని ప్రశ్నలు మిగులున్నాయి.. వారిని చూసి రాజకీయం గర్విస్తుంది.. నేటి తరంలో నడుస్తున్న నాయకత్వాన్ని చూస్తే రాజకీయం కన్నీరుకారుస్తుంది.. చావైనా, రేవైనా ప్రజల సేవకోసమే గెలిచామని ప్రజల మధ్యలో ఉంటూ, వారి కోసమే పనిచేస్తామని నాయకత్వం రోజురోజుకు కనుమరుగవుతూనే ఉంది…

లీడర్‌ అంటే ఏలా ఉండాలి…

లీడర్‌… అంటే మరొ తరానికి స్పూర్తిగా ఉండాలి… రాబోయే తరతరాలు కూడా మరిచిపోకుండా ఆయన అడుగుజాడల్లో నడవాలి… నిత్యం ప్రజల సేవలో ఉంటూ, ప్రజల మధ్యలో జీవిస్తూ, ప్రజల పనికోసమే పనిచేసేవారే నాయకుడు.. కాని ఆ నాయకత్వం రోజురోజుకు కనుమరుగవుతోంది.. అవకాశాలను వెతుకుతోంది… తన లాభం, స్వలాభం, తన స్వార్థం మాత్రమే చూసుకుంటుంది… ప్రజల కోసం పనిచేస్తారని, ప్రజల మధ్యలోనే ఉంటారని నాయకులను ఎన్నుకుంటే గెలిపించిన ప్రజలకు వారం తిరగకముందే పంగనామాలు పెడుతున్నారు… పోటీ చేసి గెలిచిందీ ఒక పార్టీలో ఐతే.. గెలిచాక మారిపోతుంది మరొక పార్టీ… రాజకీయం అంటేనే దాని అర్థం కూడా మార్చే నాయకులు ఎక్కువైపోయారు… ఎవరూ ఎందులో ఉంటున్నారో, ఎవరూ మారిపోతున్నారో.. ఎక్కడ ఉంటున్నారో తెలియకుండా పోయింది నేటి రాజకీయం.. తను నాయకుడైతే అతనికి మనశ్శాంతి లేదు.. తనతో పాటు తన కుటుంబంలో మరో నలుగురు నాయకులుగా ఎదగాలి. అధికారాన్ని అనుభవించాలి.. అది వారి తరతరం అలాగే కొనసాగాలి.. అదీ కూడా ప్రాణం పోసి, గుర్తింపునిచ్చిన పార్టీలో ఉంటున్నారా అంటే అదీ లేదు.. కన్నతల్లిలాంటి పార్టీ ఒక నాయకున్ని ప్రజలకోసం పనిచేయమని అవకాశం కల్పిస్తే, ప్రజల సేవ తర్వాత నేను నా స్వార్థం, స్వలాభమే చూసుకుంటుంది. కొంతమంది నాయకులు వారి అవకాశాలు కోసం ఎన్నిమార్లు ఎన్నిపార్టీలోకి మారడానికైనా సిద్దపడుతున్నారు. ఇలాంటి వాళ్లు రేపటితరానికి, రాబోయే తరానికి, ఓటు వేసిన ప్రజలకు ఏం సేవచేస్తారో తెలియడమే లేదు…

సేవ చేయాలంటే పార్టీ మారాలా…

ప్రజలకోసం పనిచెయ్యాలంటే, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సేవచెయ్యాలంటే పార్టీ మారాలా అనేది నేడు ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఎన్నికల ముందు గెలవడానికి నానా మాటలతో పెద్ద యుద్దమే ప్రకటిస్తారు. అధికారం కావాలి. అధికారంలోకి రావాలి.. అధికారం ఉంటేనే ఏదైనా చేయవచ్చు అంటూ ప్రజల మధ్య కన్నీరు కార్చి వంగి, వంగి సలాములు పెట్టెవారికి మన దేశంలో కొదువే లేదు.. ఎన్నికల మందు ప్రజలను ప్రలోభపెట్టడానికి దేశవ్యాప్తంగా నాయకులు ఆడుతున్న ఆటలకే అడ్డే ఉండదు.. ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల కోసమే పనిచేస్తామని చెపుతున్న నాయకులు, గెలిచాక నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా అంటే ఏ నూటికో, కోటికో కొద్దిమందీ మాత్రమే.. తన అనుకునే వాళ్లకే అన్ని సౌకర్యాలు కల్పించాకనే తర్వాతనే ఓట్లు వేసిన ప్రజల గురించి ఆలోచిస్తుంది నేటి రాజకీయం.. నిజంగా ప్రజలకు సేవచేయాలనే ఆలోచన ఉంటే ఓటు వేసిన ప్రజలకోసం ఎ్కడున్నా చేయోచ్చు. పార్టీ మారితేనే అభివృద్ది జరుగుతోంది. పార్టీ మారకుంటే అభివృద్ది అనేది శూన్యం అనే ధోరణిని మన నాయకులు విడవడం లేదు. అధికారంలో ఉంటేనే, అధికారంలో ఉన్న పార్టీ సరసన చేరితేనే అధిక లాభాలంటున్న నాయకత్వానికి ఆ లాభం ఎవరికో మాత్రం చెప్పలేకపోతున్నారు… నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సేవ చేయాలంటే ఎక్కడున్నా చేయోచ్చనే ఆలోచన నేటి తరానికి రావాలని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.. అవకాశం, అవసరాల కోసం పార్టీ మారే విధానాలను కట్టడి చేసే కఠినమైన చట్టాలైనా రావాలని కోరుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here