Featuredరాజకీయ వార్తలు

సిగ్గుపడుతున్న ఊసరవెల్లి

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

‘తొండ ముదిరితే ఊసరవెల్లి’ అవుతుంది. ‘నాయకుడు ముదిరితే ఫిరాయింపు దారుడు’ అవుతాడు.. వారు వేదికలు ఎక్కి మాట్లాడు తుంటే నీతీ మౌనంగా రోదిస్తుంది. నిజాయితీ భయపడుతుంది. అధికారం కోసం అప్పటిదాకా ఉన్న పార్టీని ఎలాంటి బెరుకు లేకుండా వదిలి… నిసిగ్గుగా, నిర్భయంగా మరో పార్టీకి ‘జంప్‌’ చేసి అక్కడ నీతులు వల్లేస్తారు. ఇవన్నీ చూసి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది.

కారెక్కారు..: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు స్వతంత్రులు వెంటనే కారెక్కారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌కు షాక్‌ల విూద షాక్‌ లు తగులు తున్నాయి. కాంగ్రెస్‌ శాసనమండలి పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎల్పీలో విలీనం అయ్యారు. నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ లోకి జంప్‌ అయ్యారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీల లేఖకు ఆమోదం లభించింది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ లో చేరిన ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌ మండలి సభ్యు లుగా గుర్తిస్తూ బులిటెన్‌ విడుదల అయింది. ఈమేరకు శాసన మండలి సెక్రటరీ బులిటెన్‌ విడుదల చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు దామోదర్‌ రెడ్డి, సంతోష్‌ కుమార్‌, ప్రభాకర్‌ రావు, ఆకుల లలితను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలుగా గుర్తించారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌ లో విలీనం చేస్తున్నట్టు కౌన్సిల్‌ కార్యదర్శి ప్రకటించారు.

కాంగ్రెస్‌ కు ఇద్దరే మిగిలారు.. ఆరుగురు ఎమ్మెల్సీలకు నలుగురు టీఆర్‌ఎస్‌ లో చేరాక శాసనమండలిలో కాంగ్రెస్‌ కు కేవలం ఇద్దరు సభ్యులే మిగిలారు. ఎమ్మెల్సీలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌ రెడ్డిలు మాత్రమే మిగిలారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్‌

ప్రాతినిధ్యం కోల్పోయినట్లు కనిపిస్తోంది.

కాంగ్రెసు నుంచి 8 మంది:

తాజా ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలలో 8మంది తెరాస అధిష్ఠానానికి ‘టచ్‌’లో ఉన్నారు. వీరందరూ గతంలో కాంగ్రెసు పార్టీలో వీర విధేయులుగా ఉన్నవారే.

తెలుగుదేశం నుంచి సండ్ర: సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నుంచి తెలుగుదేశం అభ్య ర్థిగా గెలుపొందారు.మంత్రి పదవి తాయిలం అందే విషయం ప్రచారంలో ఉంది.

టీఆర్‌ఎస్‌ ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు?

మరోవైపు టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపికైన కొండా మురళి, రాముల్‌ నాయక్‌, భూపతి రెడ్డి, యాదవరెడ్డిలు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ లో చేరారు. ఈ నలుగురిపై చర్యలు తీసుకోవా లంటూ ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కు లేఖ అందజేశారు.

కొసమెరుపు: గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘ఆకర్ష’ పథకాలను ఇప్పుడు గులాబీ దళపతి చేపట్టారు. ఆరోజు తప్పు కాని వ్యవహారం తమ దగ్గరకు వచ్చే సరికి ఈ పార్టీలు గుండెలు బాదుకోవడం ఆశ్చర్యం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close