Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

ఒడ్డుకు చేరిన ‘సెలబ్రిటి శవాలు’

  • మిన్నంటిన రోదనలు
  • శబాష్‌ ‘సత్యం’
  • డిఎన్‌ఏ పరీక్షల తర్వాత అప్పగింత
  • కదిలించిన ‘ఆదాబ్‌’ కథనాలు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు 38 రోజుల తర్వాత ఎట్టకేలకు ఒడ్డుకు చేరింది. ధర్మాడి సత్యం బృందం, స్కూబా డైవర్లు తీవ్రంగా శ్రమించి నదిలో నుంచి బోటును వెలికితీశారు. దుర్వాసన వస్తుండటంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటపడుతున్నాయి. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఒక్కో కుటుంబానిది ఒక్కో బాధ.

ఇలా జరిగింది: గత నెల 15న 77 మందితో పాపికొండల పర్యటనకు బయలుదేరిన వశిష్ఠ బోటు కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతిచెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 12 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో అప్పటి నుంచి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

‘సత్యం’ పలికాడు..: బోటును వెలికితీసే బాధ్యతను కాకినాడకు చెందిన ధర్మాడి సత్యంకు అప్పగించారు. మునిగిపోయిన బోట్లు, పడవలను వెలికితీయడంలో మంచి నైపుణ్యం ఉన్న ధర్మాడి సత్యం.. తన బృందంతో గత కొన్నిరోజులుగా బోటును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో విశాఖ నుంచి స్కూబా డైవర్లను తీసుకొచ్చారు. వారు నదీగర్భంలోకి వెళ్లి ఇసుకులో కూరుకుపోయిన బోటుకు లంగర్లు, ఐరన్‌ రోప్‌ కట్టడంతో అతికష్టం మీద పొక్లెయిన్తో బయటకు లాగారు. గత 38 రోజులుగా నదీ గర్భంలోనే బోటు ఉండటంతో పూర్తిగా ధ్వంసమైంది. బోటులో ఐదు మృతదేహాలు కనిపిస్తున్నప్పటికీ.. అందులో ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయన్నది అధికారికంగా ప్రకటించలేదు. నీటిలో తేలియాడుతున్న మరికొన్ని మృతదేహాలను ఒడ్డుకు చేరుస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టువీడకుండా బోటు వెలికితీసిన ధర్మాడి సత్యం బృందానికి సమీప గ్రామాల ప్రజలు అభినందనలు తెలిపారు. బోటును ఒడ్డుకు చేర్చిన అనంతరం ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడుతూ..లోతు ఎక్కువగా ఉండటం వల్లే వెలికితీత ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. బోటును వెలికితీసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బోటు వెలికితీతలో విశాఖ స్కూబా డైవర్లు చేసిన కృషి మరువలేనిదని చెప్పారు.

డిఎన్‌ఏ పరీక్షల అనంతరమే..: బయటపడ్డ శవాలను గుర్తించే వీలు లేకుండా ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ… డిఎన్‌ఏ పరీక్షల అనంతరం వారి వారి బంధువులకు శవాలను అప్పగింఛడం జరుగుంతుందని చెప్పారు.

‘ఆదాబ్‌’ కథనాలకు సెల్యూట్‌: పోలవరం బోటు ప్రమాదం.. సెలబ్రిటి శవాలు కాదు’ అంటూ ఓ ప్రత్యేక కథనం గతనెల 27న ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందించింది. సామాన్య శవాలకు విలువ లేదనే కోణంలో వెలువరించిన మానవీకోణ కథనం అందర్నీ కన్నీరు పెట్టించింది. ప్రభుత్వాన్ని కదలించింది. ముఖ్యమంత్రి జగన్‌ వెంటనే స్పందించి బోటును వెలికితీయాలని ఆదేశించారు. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’కు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close