కానరాని వానమ్మ..

0
  • ఆశగా అన్నదాత.. మళ్లీ నిరాశే
  • రుతుపవనాల కోసం ఎదురుచూపు
  • కమ్ముకుంటున్న కరువు ఛాయలు
  • తెలుగు రాష్ట్రాల్లో కానరాని చినుకుజాడ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గత రెండు వారాలుగా మురిపిస్తున్న నైరుతి రుతుపవనాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా కదులుతున్నాయి. అసలే ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాల గమనానికి వాయు తుఫాన్‌ తోడు కావడంతో విస్తరణకు అడ్డంకిగా మారింది. వాతావరణ శాఖ అంచనాలకు అందకుండా ఉంది. నైరుతి రుతుపవనాల చలనంలో రోజుకో మార్పు చోటు చేసుకొంటోంది.మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం చూస్తోన్న ప్రజలకు, తొలకరి చినుకుల కోసం ఎదురుచూస్తోన్న రైతన్నలకు నిరాశ తప్పేలా లేదు. నైరుతి రుతుపవనాలు ఇంకా ఆలస్యం కానున్నాయి. ముందస్తుగానే రుతుపవనాలు వస్తున్నాయన్నారు. అనుకున్నా సమయానికి వచ్చేస్తాయన్నారు. చెప్పిన సమయం రానే వచ్చేసింది. కాని చినుకు జాడ లేదు. ఏటి లాగే ఆకాశం వైపు అన్నదాత ఆశగా చూస్తున్నాడు. వరుణుడి కరుణ కోసం ప్రార్ధిస్తున్నాడు. విత్తును మొలకగా మార్చి మొక్క అయ్యేంత వరకు కరుణించమంటూ కన్నీటితో వేడుకుంటున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు ఛాయలు వేగంగా అలుముకుంటున్నాయి. గతంతో పోల్చుకుంటే భారీగా వర్ష లోటు ఉంటంతో సాగుపై పెను ప్రభావం పడుతోంది. అదిగో ఇదిగో అంటూ దోబూచులాడుతున్న వరుణుడి కోసం తెలుగు రాష్ట్రాల రైతులు ప్రార్దిస్తున్నారు. జూన్‌ తొలి వారంలోనే రావాల్సిన నైరుతి రుతుపవానలు ఇంత వరకు జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పుడమి తల్లి ఎప్పుడు పులికిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేయడంతో రైతులమోహంలో ఆనందం కరువైంది. హలాలు పట్టి దుక్కులు దున్నిన రైతులు చినుకు తాకితే విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. కాని ఇంత వరకు వానలు కురవలేదు. ఏటా ఇదే సమయానికి కురిసే సగటు వర్షపాతంలో 46 శాతం మేర లోటు ఉండటంతో దిగాలు చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినా విత్తనాలు వేసేందుకు 10 రోజుల పైనే పడుతుందంటున్నారు. ఇక సమయానికి వర్షాలు వస్తాయని భావించి బోర్లు, బావులు, సాగునీటి ప్రాజెక్టుల పరివాహాక ప్రాంతాల్లో ముందస్తుగా విత్తనాలు వేసిన రైతులు నిండా మునిగామంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. వేలాది రూపాయలు నష్టపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు మాత్రం త్వరలోనే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకుతాయంటున్నారు. వాతావరణ మార్పులు, డ్రైస్పెల్స్‌ కారణంగానే నైరుతి రుతుపనాలు చురుగ్గా ముందుకు కదలలేకపోయాయని చెబుతున్నారు. ఇప్పటివరకు లోటు స్ధాయి వర్షపాతం నమోదైనా త్వరలోనే ఆశించిన స్ధాయి వర్షాలు కురుస్తాయంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here