Featuredరాజకీయ వార్తలు

ఊరెళ్ళిపోతున్న సెట్లర్లు.. లబోదిబోమంటున్న అభ్యర్థులు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఓటు వేయండని డిసెంబర్‌ 7 శుక్రవారంనాడు ప్రభుత్వం సెలవిస్తే గురువారం సాయంత్రం నుంచే ఊరికి చెక్కేయడానికి ఆంద్రా, రాయలసీమ సెట్లలర్లు సిద్ధమైపోయారు. ఇప్పటికే రైళ్లు, బస్సులన్నీ బుకింగ్‌లతో నిండిపోయాయి. వీళ్ల ప్రయాణాలతో బరిలో ఉన్న అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ముందు ఓటు వేయండి, తర్వాత ప్రయాణం చేయండి.. అవసరమైతే మేమే సొంత గ్రామాలకు బస్సులను ఏర్పాటు చేస్తామని బతిమాలాడే పనిలో ఉన్నారు.. ఇన్ని రోజులు విస్తృతంగా ప్రచారం చేసి, తీరా పోలింగ్‌ రోజు శుక్రవారం సెలవు, దానితో పాటు సెకెండ్‌ సాటర్‌డే, సన్‌డే సెలవులు కావడంతో నగరంలో చాలామంది ఓటుపై ఆసక్తే చూపడం లేదు. ఓటు వేసినా, వెయ్యకున్నా ఏముంది ఫాయిదా.. అలా ఒక చిన్న ట్రిప్‌ పెట్టుకుంటే కాస్త రిలాక్స్‌ అయిరావచ్చు.. లేదా అయినవారిని చూసైనా రావచ్చు అని నిర్ణయించేసుకుం టున్న సెట్లర్లు ప్రయాణం వైపే మొగ్గుచూపుతున్నారు. నగరంలో ఎక్కువ ఓట్లు ఆంధ్రా, రాయలసీమకు చెందిన వారివే కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు కాళ్లూ, వేళ్లూ పట్టుకునే పనిలో పడ్డారు. బుధవారం సాయంత్రం 5గంటలతో ప్రచారాలు సమాప్తం కావడంతో అభ్యర్థులంతా ఫుల్‌టైమ్‌గా ఈ పనిలోనే మునిగితేలు తున్నారు., ఇవికాక ఓటర్లను కొనే పని ఒకటి ఎటూ ఉండనే ఉంది. పైసలు, మందుసీసాలు, బిర్యానీపొట్లాలు పంచే పనిలో మరింత బిజీగా మారిపోయారు. ఉద్యోగుల విభజన పూర్తికాక ఆంధ్రాలో ఉండిపోయిన తెలంగాణా ఉద్యోగులకు ఓటువేయ డానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెలవు ఇవ్వడంతో అక్కడి వారంతా ఇక్కడికి వస్తున్నారు. అలా వచ్చే వారిని మచ్చికచేసు కోడానికి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవారిని ఆపడానికి అభ్యర్థులు అపసోపాలు పడుతున్నారు. పోలింగ్‌ డిసెంబర్‌ ఏడున కాకుండా ఐదునో, ఆరునో నిర్వహిస్తే వరస సెలవలు వచ్చేవికావు. అందువల్ల సుదూర ప్రాంతాలు ప్రయాణాలు చెయ్యడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. ఒక్కరోజు కోసం ప్రయాణాలు ఎందుకని హాయిగా నగరంలో ఓటేసి కుటుంబంతో ఉండాలని భావించేవారు. పోలింగ్‌ శుక్రవారం కావడంతో చాలా మంది ఉన్న ఊరు వదిలి ఎక్కడికో ఒక అక్కడికి వెళ్ళాలని ఫిక్స్‌ అయిపోయారు. నగరంలో సెటిలర్స్‌ ఓట్లే ఎక్కువ హైదరాబాద్‌ నగరంలో సెటలర్స్‌ ఓట్లే అధికంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి చాలా మంది యువతీయువకులు ఉద్యోగాల కోసం, పై చదువుల కోసం, వ్యాపార వ్యవహారాల కోసం వచ్చి నగరంలో ఉంటున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండిపోవడంతో ఇల్లూ వాకిలీ సమకూర్చుకుని ఇక్కడే సెటిలైపోయారు. అలాకాని వారు కూడా ఇక్కడే రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఓటరు గుర్తింపుకార్డులు పొంది ఇక్కడి వారనిపించుకున్నారు. దేశంలో ఎక్కడ ఉన్నా సిటిజనే అయినప్పటికీ వీరంతా సిటీలో చేరి సిటిజనులు అనిపించుకున్నారు. పండుగలొచ్చినప్పుడో, గట్టిగా మూడునాలుగురోజులు సీరియల్‌గా సెలవులొచ్చినప్పుడో వీరు పుట్టింటికో, తీర్థయాత్రలకో బయల్దేరుతుండడంతో నగరం దాదాపుగా ఖాళీ అవుతోందీ. ముఖ్యంగా ఈ ఇంపాక్ట్‌ అనేది దసరా, సంక్రాంతి పండగలప్పుడు బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ముఖ్యంగా కూకట్‌పల్లి, కొండాపూర్‌, మణికొండ, మియాపూర్‌, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చిక్కడపల్లి, నల్లకుంట, విద్యానగర్‌, ఇసిఐఎల్‌, బిహెచ్‌ఇఎల్‌, పటాన్‌చెరు,శేరిలింగంల్లి, లింగంపల్లి, మియాపూర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాలలో ఎక్కువమంది ఉన్నారు. వీరుకాక ఇతర ఏరియాల్లో కూడా కొద్దో గొప్పో సెటిలర్లున్నారు. గతంలో జరిగిన జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలుపులో కీలక పాత్ర వహించిన ఓట్లు సెటిలర్స్‌వేనని అందరికీ తెలుసు. సెటిలర్లు ఓట్లు అధికంగా వినియోగించుకోవడంతో తెరాస అధిక సీట్లు సాధించి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణాలోని ఇతర జిల్లాల నుంచి నగరానికి వలసవచ్చినవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరుకూడా నగరంలోనే ఓటరు ఐడి తీసుకున్నారు. ప్రచారాలు అదరగొట్టాము అనుకున్న అభ్యర్థులకు సెలవలు మోకాలడ్డి ఓట్లు పడకుండా చేస్తున్నాయన్న వార్త మింగుడుపడడంలేదు. అందుకే కాళ్ళూ గడ్డం పట్టుకునైనా వారిని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో తగ్గిన పోలింగ్‌ శాతం… 2014 తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అతి తక్కువగా పోలింగ్‌ నమోదయింది హైదరాబాద్‌ నగరంలోనే! నగరంలో ఉంటున్న వారందరూ దాదాపుగా చదువుకున్న వారే. కాని పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చి ఓటేయ్యడం అనేసరికి ఎక్కడలేని బద్ధకం పట్టుకుంటుంది. నేను ఒక్కణ్ణి ఓటు వెయ్యకుంటే ఏమవుతుందిలే అని కొందరు, అంతా దొంగలే నిలబడ్డారు వీరికి ఓటు వేయని అని మరికొందరు ఓటు వేయకుండా పోలింగ్‌కు దూంగా ఉండిపోతున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఒక నియోజకవర్గంలో లక్షమంది ఓటర్లు ఉంటే పోయినసారి ఎన్నికల్లో పోలైన ఓట్లు పధ్నాలుగు వేలు మాత్రమే! మరొక నియోజకవర్గంలో 43 ఓట్లతో ఒక అభ్యర్థి గెలుపొందాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ దేశంలోనే ఐదవ పెద్ద నగరంగా పేరుగాంచింది. చదువుకున్న యువకులు, లక్షలాది ఉద్యోగులు ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసే ప్రముఖులు, విద్యావేత్తలు వేలల్లో ఉన్నారు. కాని వీరిలో ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నవారు అతికొద్దిమందే! పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్ళడం, క్యూలో నిలబడడం అంతా టైమ్‌వేస్ట్‌ అనుకుని దూరంగా ఉండిపోతుంటారు. ఇది మంచి పద్ధతికాదు. ఇది ఇలా ఉంటే సాప్ట్‌వేర్‌ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు కూడా కచ్చితంగా సెలవు ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసినా చాలా కంపెనీలు సెలవు ఇవ్వడానికి అంగీకరించవు. ఒక గంట పర్మిషన్‌ ఇవ్వడానికే ఇష్టపడతాయి. తప్పిదారి ఏ సంస్థయినా సెలవిస్తే ఉద్యోగులంతా ముసుగుతన్ని పడకేయడం ఖాయం. మధ్యాహ్నానికి లేచినా అన్నంతిని సినిమా పోదామని చూస్తారే తప్ప ఓటేద్దామని ఆలోచించరు. శుక్ర, శని, ఆదివారాలకు తోడుగా డిసెంబరు నెల కావడం వల్ల కూడా సెలవలకు అన్ని ఆఫీసులలోనూ డిమాండ్‌ పెరుగుతోంది. నెలాఖరులోగా క్యాజువల్‌ లీవులను ఉపయోగించుకోవాల్సి ఉండడంతో మరో రోజు సెలవు పెట్టుకుని మరీ ఊరెళ్ళిపోతున్నారు. వీరి సంగతి ఇలా ఉండగా నగరంలో ఉద్యోగం, వ్యాపారం, చదువుల కోసం వచ్చిన ఇతర జిల్లాల వారు కూడా ఇళ్ళకు తిరుగుముఖం పడుతన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వీరిని ఆకర్షించడానికి అభ్యర్థులు గ్రామాల వారీగా వివరాలు సేకరించి ఫోన్లు చేయిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి ఓటేయాలని పిలుపునిస్తున్నారు. అసవరమైతే క్యాబ్‌ ఖర్చులు భరిస్తామంటున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close