లోకల్‌ పోరును అడ్డుకోలేం..

0
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌
  • బీసీలకు హైకోర్టులో దక్కని ఊరట

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో స్థానిక సమరానికి ఇక అడ్డంకులు తొలగినట్లే. హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో లోకల్‌ బాడీ ఎన్నికల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేల్చాలంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వేసిన పిటిషన్‌ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యంపై 3 వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదలావుంటే బీసీ రిజర్వేషన్లపై న్యాయపోరాటంతో పాటు వీధిపోరాటాలకు సైతం సిద్ధమవుతామంటున్నారు శ్రీనివాస్‌ గౌడ్‌. దేశ జనాభాలో బీసీలు గణనీయంగా ఉన్నారు. మొత్తం జనాభాలో మెజార్టీ వాటా బీసీలదే. 56 శాతమున్న బీసీలకు కేవలం 23 శాతమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అది కూడా సరిగ్గా అమలు కావడం లేదు. అదే విషయం ప్రస్తావిస్తూ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌. అయితే రిజర్వేషన్లు 50 శాతం మించొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తూ లోకల్‌ బాడీ ఎన్నికలను ఆపలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యానికి సంబంధించి 3 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఎన్నికల సంఘం, పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, తెలంగాణ బీసీ కార్పొరేషన్‌, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 22 వ తేదీకి వాయిదా వేసింది. గుండుసున్నలా రిజర్వేషన్లు హైకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్‌ గౌడ్‌ పలు అంశాలను ప్రస్తావించారు. బీసీల డేటా లేకపోవడంతో రిజర్వేషన్లకు ఇబ్బందవుతోందని గతంలో హైకోర్టే చెప్పిందన్నారు. బీసీల జనగణన చేపిస్తామని సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. కానీ అది ఇంతవరకు అమలు చేయలేదు. మొన్నటికి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి పరిమితం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ.. బీసీల విషయంలో మాత్రం జనాభా దమాషా పాటించడం లేదు. బీసీ ఓటర్ల గణాంకాలు చూపిస్తూ మోసం చేస్తున్నారు. 50 శాతం సీలింగ్‌ ఉందని హైకోర్టు చెబుతోంది. సుప్రీంకోర్టు అగ్రవర్ణాలకు 10 శాతం ఇచ్చాక అది 60 శాతం అవుతుంది కదా అంటూ ప్రశ్నించారు శ్రీనివాస్‌ గౌడ్‌. న్యాయపోరాటాలు, వీధిపోరాటాలు తప్పవు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో తీసుకొచ్చిన పంచాయతీ రాజ్‌ యాక్ట్‌ లో బీసీలను అవమానపరిచారు. బిర్యానీ తిన్నాక మిగిలిన ఎంగిలి మెతుకులు బీసీలకు వేసినట్లు ఉంది. అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం బీసీలకు అన్యాయం చేస్తోంది. రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ హైకోర్టుకు వెళితే న్యాయం జరగలేదు. బీసీల రిజర్వేషన్లు కాపాడుకోవడం కోసం న్యాయపోరాటం చేస్తాం, అవసరమైతే వీధిపోరాటాలు కూడా చేస్తాం. చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడతమంటూ చెప్పుకొచ్చారు శ్రీనివాస్‌ గౌడ్‌. ప్రభుత్వానికి సూచన అగ్రవర్ణాలతో కలిపి రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగిన దరిమిలా.. బీసీలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. సీఎం కేసీఆర్‌ అఖిలపక్షం సమావేశం నిర్వహించాలి. బీసీ నేతలతో, న్యాయనిపుణులతో భేటీ కావాలి.మా జనాభాకు మించి ఒక్కశాతం కూడా ఎక్కువ అడగడం లేదు. మా జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కావాలంటున్నాం. ఆదిలాబాద్‌ జిల్లాలో 17 జడ్పీటీసీ స్థానాలకు గాను ఒక్కటి కూడా బీసీలకు దక్కలేదు. అదేవిధంగా 32 జిల్లాల్లో చూసినట్లయితే 2, 3 శాతం మాత్రమే బీసీలకు దక్కాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న జరిగిన సర్పంచ్‌ ఎన్నికలు స్టేట్‌ యూనిట్‌ గా తీసుకున్నారు. ఇప్పుడేమో ఎంపీటీసీలను మండల యూనిట్‌ గా, జడ్పీటీసీలను జిల్లా యూనిట్‌ గా తీసుకోవడం ఎంతవరకు సబబు. ఈ ఎన్నికలను కూడా స్టేట్‌ యూనిట్‌ గా తీసుకుంటే కనీసం బీసీలకు 18 నుంచి 20 శాతమైనా రిజర్వేషన్లు దక్కుతాయి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ఆలోచించాలని.. బీసీలను రాజకీయ సమాధి చేయొద్దని కోరారు శ్రీనివాస్‌ గౌడ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here